
Sajjala Ramakrishna Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎదురుతిరిగేసరికి వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యింది. ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారు. ఒకరిద్దరు టీడీపీ వారిని ప్రలోభపెట్టి ఓటు వేయించుకుందామనుకుంటే సీన్ రివర్స్ అయ్యింది. ఒకరు కాదు.. ఇద్దరు ఎమ్మెల్యేలు గీత దాటి మరీ టీడీపీకి స్నేహహస్తం అందించారు. వైసీపీకి పనిగట్టుకొని ఓడించారు. అయితే కట్టదాటిన ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో ఇదేం ఉద్యోగం కాదు.. రాజకీయం. త్వరలో చర్యలుంటాయని సలహాదారులు సజ్జల వారు సెలవిచ్చారు. సరైన సమయంలో చర్యలుంటాయని గురువారం సెలవిచ్చారు. కానీ శుక్రవారం మీడియా ముందుకు వచ్చి ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో పాటు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ప్రకటించారు. అంతర్గత విచారణలో వీరు తప్పుచేసినట్టు తేలడంతో చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే సమయం పడుతుందని చెప్పి.. అక్కడకు ఒక రోజు తరువాతే చర్యలకు ఉపక్రమించడం హాట్ టాపిక్ గా మారింది.
ఆ ఇద్దరిపై చర్యలు వెనుక..
కోటంరెడ్డి, ఆనంల విషయం వైసీపీ ఊహించిందే. వారి గురించి కనీస ప్రయత్నం చేయలేదు. వారు ఎవరికి ఓటు వేయాలో చెప్పలేదు. ఆత్మప్రభోదానుసారం ఓటు వేస్తామని చెప్పడంతో వారి ఓట్లు టీడీపీ అభ్యర్థికేనని కన్ఫర్మ్ చేసుకుంది. కానీ ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో మాత్రం ఎటువంటి అనుమానం పడలేదు. వారు వ్యూహాత్మకంగా సీఎం జగన్ ముందు తమ వైఖరిని బయటపెట్టలేదు. ఇప్పటికే పార్టీపై అనుమానంతో ఉన్నారు. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తెచ్చుకోవడంతో లాభం లేదన్న తెగింపునకు వచ్చేశారు. కానీ ఎక్కడా బయటపడలేదు. చివరకు అధికార పార్టీ డిన్నర్ కు, మాక్ పోలింగ్ కు సైతం హాజరయ్యారు. అటు టీడీపీ సైతం వారిద్దరికీ టచ్ లోకి వెళ్లినట్టు కనీస సంకేతాలేవీ ఇవ్వలేదు. దీంతో పక్కా వ్యూహంతో ఆ రెండు ఓట్లు టీడీపీ అభ్యర్థికి పడినట్టు వైసీపీ నిర్థారణకు వచ్చింది. రెండోసారి కౌంటింగ్ కోరడం వెనుక కూడా ఇదే రీజన్.
వారి విషయంలో వైసీపీ వ్యూహం ఫెయిల్..
ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను బుజ్జగించడంలో వైసీపీ ఫెయిలైంది. ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపునకు వారి అవసరం కీలకమైనా జగన్ ఆ స్థాయిలో వారితో మాట్లాడలేదు. చాలా లైట్ తీసుకున్నారు. ఇప్పటికే తమను తప్పించడానికే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తెరపైకి తెచ్చారన్న అనుమానం వారిని వెంటాడుతోంది. అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించాలని నిర్ణయానికి వచ్చారు. కానీ వారిని జగన్ ఊరడించలేదు. నిఘా వర్గాలు కూడా పసిగట్టలేకపోయాయి. అయితే ఇక్కడ వైసీపీ చేసిందలా్ల ఒక్కటే. కోటంరెడ్డి, ఆనం ఇద్దరికీ వైసీపీ హైకమాండ్ ఎవరికి ఓటేయాలో చెప్పలేదు. అయితే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం క్యాంపులో ఓట్లు ఎలా వేయాలో ప్రాక్టీస్ చేయించి..ఎమ్మెల్సీ అభ్యర్థులకు కేటాయించారు. కానీ వారు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసినట్టు గుర్తించినట్టు వైసీపీ చెబుతోంది.

స్వేచ్ఛ కల్పించిన హైకమాండ్..
అయితే ఈ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. కానీ వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడే అవకాశమే లేదు. కానీ వైసీపీ నుంచి విముక్తి లభించడంతో వీరు హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే నలుగురిలో కోటంరెడ్డి, ఆనంలకు టీడీపీ హైకమాండ్ అభయహస్తం ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కోటంరెడ్డి సోదరుడు సైకిలెక్కేశారు. ఇప్పుడు మిగిలింది కోటంరెడ్డే. అటు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు నిజంగా టీడీపీ అభ్యర్థికే ఓటు వేసి ఉంటే.. వారు తెలుగుదేశం పార్టీ నుంచి భారీ అడ్వాంటేజ్ పొందే అవకాశముంది. వైసీపీ మూలన పెట్టినా.. టీడీపీని గట్టెక్కించి ఏదో రూపంలో లబ్ధిపొందే చాన్స్ ఉంది. అందుకే తాము స్వేచ్ఛాజీవులం అయ్యామని వైసీపీ ధిక్కార ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ నలుగురు కేంద్రంగా కొద్దిరోజుల పాటు ఏపీ రాజకీయాలు నడుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. వీరిపై కానీ వేటు వేయకుంటే పార్టీలో ధిక్కార స్వరాలకు అలుసుగా మారుతుందని తెలిసి.. సజ్జల సవరించుకొని సస్పెన్షన్ ప్రకటన చేశారు.