
చింత చచ్చినా ఆ పులుపు చావదన్నట్టు.. ఏపీ సీఎం జగన్ తో పెట్టుకొని నానా అగచాట్లు ఎదురైనా కూడా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజులో ఆ దూకుడు మాత్రం తగ్గడం లేదు. తాజాగా లేని కంపను మళ్లీ కెలుకుతున్నారు.
సహజంగా ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రం పోలీసులు ఎంట్రీ ఇవ్వడానికి అరెస్ట్ లు చేయడానికి వీల్లేదు. ఆ సొంత రాష్ట్రం పోలీసులే అది చేయలేదు. లేదంటే సహకరించాలి. కానీ తెలంగాణలో ఉన్న ఎంపీ రఘురామను ఏపీ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి తీసుకుపోయారు.
ఇప్పుడు దీన్నే ఎంపీ రఘురామకృష్ణంరాజు లేవనెత్తుతున్నారు.తనను అరెస్ట్ చేసే విషయంలో తెలంగాణ పోలీసులు నిబంధనలు పట్టించుకోలేదని తాజాగా సీఎం కేసీఆర్ కు ఘాటు లేఖ రాశారు. ఒక ఎంపీని అరెస్ట్ చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసంచరిల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను తన పీఎస్ పరిధిలోని గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు.
ఏకంగా తెలంగాణ పోలీసులపైనే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ను ఎంపీ రఘురామ లేఖలో కోరడం విశేషం. తన అరెస్ట్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎంపీ రఘురామ కేసీఆర్ కు 8 పేజీల లేఖ రాశారు.. తెలంగాణ పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. అరెస్ట్ చేసే ముందు తనకు వైద్య పరీక్షలు కూడా చేయలేదని మండిపడ్డారు. వెంటనే తెలంగాణ పోలీసులపై చర్య తీసుకోవాలని ఎంపీ రఘురామ లేఖ రాయడం అగ్నికి ఆజ్యం పోసినట్టైంది.
మరి ఈ లేఖపై కేసీఆర్ స్పందిస్తారా? తెలంగాణ పోలీసులపై యాక్షన్ తీసుకుంటారా? యాథాలాపంగా జగన్ కు అండగా నిలుబడుతారా? అన్నది వేచిచూడాలి. .