
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని సరిగ్గా రెండు సంవత్సరాలైంది. ఒక సీఎం పాలన ఎలా ఉందని చెప్పడానికి ఈ సమయం సరిపోతుంది. మరి, రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ఎలా ఉంది? అన్నది ఇప్పుడు ఖచ్చితంగా చర్చించాల్సిన సమయం. ఇప్పటి వరకు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని మార్చడమే భారీ నిర్ణయం నుంచి.. పదుల సంఖ్యలో తెచ్చిన సంక్షేమ పథకాల వరకు చాలా నిర్ణయాలు ఉన్నాయి. మరి, జగన్ పాలనలో రాష్ట్రం పురోగమిస్తోందా? తిరోగమిస్తోందా? అన్నది చూద్దాం.
ఒక రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తోందని చెప్పడానికి రెండు అంశాలను ప్రధానంగా లెక్కలోకి తీసుకుంటారు. ఒకటి సంక్షేమం. రెండు అభివృద్ది. సంక్షేమం అంటే.. ప్రజల వసరాలు తీర్చడం. అంటే.. పలు పథకాల ద్వారా వ్యక్తిగత ప్రయోజనం చేకూర్చడం. ఈ రంగానికి చేసే కేటాయింపులతో రాబడి ఉండదు. ఖజానా ఖాళీ అవుతుంది. భోజనం చేస్తే గాసం అయిపోతుందని పొట్టమాడ్చుకోలేనట్టే.. ప్రజాసంక్షేమాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. లేదంటే.. ఆకలి, అవసరాలు తీరక అల్లాడిపోతారు.
ఇక, రెండోది అభివృద్ధి. ఇందులోనూ నిరర్థక అభివృద్ధి ఉంటుంది. ఆదాయం వచ్చే అభివృద్ధి ఉంటుంది. ఉదాహరణకు రోడ్లు వేసేది నిరర్థకమైన అభివృద్ధి. దాన్నుంచి రూపాయి తిరిగిరాదు. అదే సమయంలో ఫ్యాక్టరీలు, కంపెనీలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే.. తిరిగి ఆదాయం సమకూరుతుంది. దేశం, రాష్ట్రం డెవలప్ కావాలంటే.. ఈ తరహా అభివృద్ధి అనివార్యం. ఈ విధంటా అటు సంక్షేమంతో ప్రజల అవసరాలు తీరుస్తూ.. ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టించినప్పుడే రాష్ట్రంకానీ, దేశంకానీ అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క.
మరి, ఈ విషయంలో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంది. ఇప్పటి వరకు చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వీటికోసం ఏడాదికి దాదాపు 70 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే.. ఇందులో చాలా వరకు అప్పులు తెచ్చి నడిపిస్తుండడం ఆందోళన కరం. ప్రతినెలా రాష్ట్రం 7 వేల కోట్ల అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితిలో ఉంది. ఆర్బీఐ దగ్గరనే ప్రతీవారం రూ.2 వేల కోట్లు అప్పులు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ముగిసే సమయానికి తిరిగి చెల్లించాల్సిన అప్పుడు దాదాపు 30 వేల కోట్లు అవుతాయన్నది అంచనా. అసలే కష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థపై ఇలా అప్పుల భారం పెంచుతూ పోతే.. రాష్ట్రం దివాళా తీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక, అభివృద్ధి సంగతి చూస్తే.. ఇప్పటి వరకు రాష్ట్రానికి కొత్త పరిశ్రమ వచ్చిన దాఖలాల్లేవు. పైగా.. అమరావతి వివాదం నేపథ్యంలో వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కు వెళ్లిపోయాయనే విమర్శలు ఉన్నాయి. ఏ రాష్ట్రం, దేశం పురోగమించాలన్నా.. సంక్షేమం తోపాటు అభివృద్ధి అత్యంత కీలకం. అప్పుడే ఖజానాకు నాలుగు రాళ్లు సమకూరే అవకాశం ఉంది. కానీ.. ఏపీలో ఇప్పటి వరకూ ఇలాంటి అడుగులు పడకపోవడం గమనించాల్సిన అంశం. సంక్షేమం కోసం ఖజానా ఖాళీ చేస్తే.. రాబడి లేకపోతే.. భవిష్యత్ ఏంటన్నది ప్రశ్న. అప్పులతోనే ఇలా ఎంతకాలం వెళ్లదీస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదిలాఉంటే.. రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలకే ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. రాజకీయ నేతలను వరుసగా జైలుకు పంపిస్తుండడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు విశ్లేషకులు. ఇప్పటి వరకు అరడజను మంది ప్రత్యర్థులపై ఈ తరహా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు నామమాత్రమేననే విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి.
మొత్తంగా ఈ రెండేళ్ల కాలంలో చూసినప్పుడు.. సంక్షేమం మినహా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో సంతృప్తికరమైన పని కనిపించట్లేదన్నది మెజారిటీ ప్రజల భావనగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ చేతిలో ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈ విలువైన కాలాన్ని ఇదేవిధంగా సాగిస్తారా? రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించే ప్రయత్నం చేస్తారా? అన్నది చూడాలి. రాబోయే కాలంలో ఆయన అనుసరించే విధానమే వచ్చే ఎన్నికల్లో నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.