
Turkey Earthquake : శత్రువునైనా క్షమించే గొప్ప మనసు భారతదేశానిది. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడం భారతీయుల గుణం. శత్రవును ఎదుర్కోవడంలో ఎంత ధీటుగా ఉంటుందో.. సాయం చేయడానికి కూడా అంతే దయతో ఉంటుంది . శత్రువు పంచన చేరినా.. ఆపదలో ఉన్న దేశానికి అండగా నిలిచింది. వారి కన్నీళ్లు తుడుస్తోంది. ఛిద్రమైన బతుకులను చేరదీయడంలో తనకు తానే సాటి అని నిరూపిస్తోంది. `ఇండియా గ్రేట్` అని ప్రపంచం నలుదిక్కులు గర్జించేలా తన కీర్తిని ఇనుమడింప చేసుకుంటోంది.
టర్కీ దేశం భూకంపంతో అతలాకుతలమైంది. వేలాది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. వందలాది ఇళ్లు శిథిలాలుగా మారిపోయాయి. ఆపన్నహస్తం కోసం ఆ దేశ పౌరులు ఆర్తనాదాలు చేస్తున్నారు. శిథిలాల కింద మూగరోదనలు చేస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం కాకపోవడంతో శిథిలాల కింద నరకం అనుభవిస్తున్నారు. శిథిలాల నుంచి బయటికి వచ్చినవారు సరైన వైద్యం అందక కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రపంచ దేశాల సాయం కోసం అర్తిస్తున్నారు.
టర్కీ ఒకప్పుడు ఇండియాను వ్యతిరేకించింది. పాక్ పంచన చేరింది. కానీ భారతదేశం ఆ ఘటనను మనసులో ఉంచుకోలేదు. తనువెల్ల గాయాలతో రోదిస్తున్న టర్కీ కన్నీళ్లు తుడిచేందుకు ..నేనున్నానంటూ ముందుకెళ్లింది. ఆపదలో ఉన్న టర్కీని ఆదుకునేందుకు తన శక్తి మేర ప్రయత్నిస్తోంది. తన మానవత్వాన్ని ప్రపంచానికి చాటుతోంది. గాయపడిన వారిని ఆదుకునేందుకు టర్కీలోని హతయ్ ప్రావిన్స్ లో ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. కేవలం ఆరు గంటల్లో ఆస్పత్రి ఏర్పాటు చేసి.. ఔరా అని అనిపించుకుంది. ఈ ఆస్పత్రిలో 96 మంది భారత ఆర్మీ సిబ్బంది.. 24 గంటలూ సేవలందిస్తున్నాయి. ఇప్పటి వరకు 800 మంది చికిత్స పొందినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పది మేజర్ చికిత్సలు చేసినట్టు లెఫ్టినెంట్ కల్నల్ యదువీర్ సింగ్ తెలిపారు.
టర్కీ బాధితులకు అండగా ఉండేందుకు తామెల్లప్పుడూ సిద్ధమేనని భారత ఆర్మీ ప్రకటించింది. ఆర్మీ సేవలకు టర్కీ వాసులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆపదలో ఉన్న తమకు ఎనలేని సాయాన్ని భారత్ అందిస్తోందని ఆనందిస్తున్నారు. థ్యాంక్యూ హిందూస్థాన్ అంటూ టర్కీవాసులు నినదిస్తున్నారు. భారతీయుల దయార్ద్ర హృదయాన్ని కొనియాడుతున్నారు. పాత ఘటనలు మనసులో ఉంచుకోకుండా సహృదయంతో సాయం చేస్తున్నారని టర్కీ వాసులు భారత ఆర్మీని మెచ్చుకుంటున్నారు.