
Young farmers : దేశంలో కొన్నేళ్లుగా నేతలు అధికారం కోసం పాదయాత్రలు చేయడం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి ఎక్కువ. యాత్ర చేసిన వారికి అధికారం దాక్కడంతో దానిని నేతలు సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ సంస్కృతి ఉత్తర భారతదేశానికి కూడా విస్తరించింది. ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ బీహార్ లో గత అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించారు. రెండేళ్ల క్రితం కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ పంజాబ్ హర్యానాకు చెందిన రైతులు పాదయాత్రగా ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. కానీ తాజాగా కొంతమంది యువ రైతులు తమ పెళ్లి కోసం పాదయాత్ర మొదలుపెట్టారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. రైతులు అన్న ఏకైక కారణంతో వారికి పిల్లను ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదు. వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా ఎదిగినప్పటికీ పెళ్లి చేసుకోవడానికి యువతులు ఆసక్తి చూపడం లేదు. తల్లిదండ్రులు కూడా తమ కూతుర్ని రైతులకు ఇవ్వడానికి వెనుకాడుతున్నారు. దీంతో ఆ యువ రైతులు ఇలా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
– కర్ణాటకలో 200 మంది రైతుబిడ్డల నిర్ణయం..
కొందరు భక్తితో పుణ్యక్షేత్రాలకు నడిచి వెళ్తారు. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి తన సోదరి కాపురం నిలబెట్టాలని పాదయాత్ర చేశాడు. కర్ణాటకలో మాత్రం 200 మంది యువ రైతులు ఓ విచిత్రమైన పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. మండ్య జిల్లాకు చెందిన వీరంతా.. తమకు పెళ్లి కావాలన్న కోరికతో ప్రముఖ శైవక్షేత్రం మలెమహదేవన బెట్టకు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మాండ్య నుంచి 105 కిలోమీటర్ల దూరంలో చామరాజనగర జిల్లాలో ఉన్న బెట్టకు వీరంతా ఈ నెల 23న బయలుదేరి వెళ్లనున్నారు.
-అందరూ వ్యవసాయ కుటుంబీకులే…
మాండ్య జిల్లా మద్దూరు తాలూకా కేఎం దొడ్డి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వీరంతా వ్యవసాయ కుటుంబాలకు చెందినవారే. అందరికీ పదెకరాల పైగా పొలాలున్నాయి. ఏడాదికి మూడు పంటల సాగుతో శ్రీమంతులుగా ఎదిగారు. కానీ వీరికి వధువులు దొరకడం లేదు. స్త్రీ, పురుష నిష్పత్తిలో తేడా, ఇతర ప్రాంతాలవారు ఇక్కడకు పిల్లలను ఇవ్వకపోవడంతో తమకు సరైన వయసులో పెళ్లిళ్లు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-అందరూ 30 ఏళ్లు దాటిన బ్రహ్మచారులే..
ఈనెల 23న పాదయాత్ర చేపట్టబోతున్న 200 మంది యువరైతుల్లో అందరూ 30-34 ఏళ్ల వయసు బ్రహ్మచారులే. బ్రహ్మచారుల పాదయాత్ర పేరిట తాము యాత్ర చేస్తున్నట్లు ప్రకటించగానే.. బెంగళూరు, మైసూరు, మండ్య, శివమొగ్గ జిల్లాల నుంచీ 100 మంది పేర్లు నమోదు చేసుకున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. యాత్రలో పాల్గొనేవారంతా ఖర్చును సమానంగా భరించాలని నిర్ణయించుకున్నారు.
-గతంలో ఎమ్మెల్యే కలెక్టర్ కు వినతులు..
మాండ్య జిల్లా మద్దూరు తాలూకా కేఎం దొడ్డి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వీరంతా పెళ్లి సంబంధాల కోసం చాలా చోట్ల తిరిగారు. కేవలం రైతులు అన్న కారణంగానే అమ్మాయిలు వీరిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. తల్లిదండ్రులు కూడా తమ కూతుళ్లను రైతు కుటుంబానికి ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో చాలామంది రైతులు ఏకమై గతంలో తమ ఎమ్మెల్యేకు సమస్య విన్నవించారు. తనకు అమ్మాయిలను వెతికి పెట్టాలని కోరారు. తర్వాత జిల్లా కలెక్టర్ ను కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఇక్కడ కూడా తమకు పిల్లను వెతికి పెట్టాలని కోరారు. యువ రైతులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. తమ అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇలా బ్రహ్మచారి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.