TRS: వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య రాజకీయ యుద్ధమే జరిగింది. ఒకరిని మించి మరొకరు ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి కేంద్రంపై పలు ఆరోపణలు చేశారు. యాసంగిలో వరి ధాన్యం కొంటారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, తాజాగా పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలతో చి‘వరి’కి ధాన్యం కొనుగోలు కిరికిరిలో టీఆర్ఎస్ పార్టీ ఇరుక్కుపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరకాటంలో పెట్టబోయి టీఆర్ఎస్ తనంతట తానే కిరికిరిలో ఇరుక్కుపోయింది. యాసంగి వరిధాన్యం కొనబోమని కేంద్రం చెప్పలేదని తెలంగాణ బీజేపీ నేతలు చెప్పిన వాదనను కేంద్ర మంత్రి బలపరిచారు. ఈ మేరకు పార్లమెంటు వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. తామిచ్చిన టార్గెట్ ప్రకారం తెలంగాణ సర్కారు ఇంకా బియ్యమే ఇవ్వలేదని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినంత బియ్యం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇకపోతే యాసంగి గురించి ఇంకా టార్గెట్ ఫిక్స్ చేయలేదని, ఆ టార్గెట్ ఫిక్స్ చేయడానికి టైం ఉందని, అప్పుడు దాని గురించి చెప్తామన్నారు.
కేంద్ర మంత్రి చేసిన ప్రకటన ద్వారా టీఆర్ఎస్ నేతలకు షాక్ తగిలినట్లయింది. ఇకపోతే తెలంగాణలో బియ్యం నిల్వలను తనిఖీ చేసేందుకుగాను కేంద్ర బృందాలను పంపగా, అక్కడ అవకతవకలు జరిగినట్లు గుర్తించామని పీయూష్ గోయల్ తెలిపారు. గులాబీ పార్టీ నేతలు కర్నాటక రాష్ట్రం నుంచి తక్కువ డబ్బులకు బియ్యం కొనుక్కొచ్చి రైతుల రూపంలో ఎక్కువ మొత్తానికి ఎఫ్‌సీఐకి విక్రయిస్తున్నారని, అలా భారీ స్కాం జరిగినట్లు ఆరోపించారు. ఈ స్కాం విషయమై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చాలా కాలం నుంచి విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా ‘బియ్యం’ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైంది.
Also Read: దళితబంధు పథకం అమలు హుళక్కేనా?
యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీని ఇరకాటంలో పడేసి రైతుల్లో ఆ పార్టీ మీద వ్యతిరేకత తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించింది. కానీ, బియ్యం కొనుగోలులో చివరకు ముద్దాయిగా టీఆర్ఎస్ పార్టీయే మిగిలిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై టీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇకపోతే వానాకాలం పంటకు సంబంధించిన వరి ధాన్యాన్ని అనగా బియ్యాన్ని తీసుకుంటామని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే యాసంగి సంగతి అటుంచి వానాకాలం పంటను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయం ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు.
Also Read: విజయగర్జన సభ విరమించుకోవడంలో కారణాలేంటి?