కోర్టు ధిక్కరణ కేసు.. ఇద్దరు కలెక్టర్లకు మూడు నెలల జైలు

కలెక్టర్లంటే జిల్లా మేజిస్ట్రేట్స్‌. జిల్లా మొత్తానికి పాలనాధికారి. అంతటి హోదాలో ఉన్న అధికారే ప్రభుత్వం ఆదేశాలను పాటించకుండా.. ప్రజా హక్కులను కాలరాస్తే ఎలా..? అలా చేస్తే ఏ రోజుకైనా ఇబ్బందులు తప్పవని మరోసారి రుజువైంది. తెలంగాణ హైకోర్టు ఇద్దరు కలెక్టర్లు మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించడం ఇప్పుడు సంచలనమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అనంతసాగర్ రిజర్వాయర్ కు భూసేకరణను కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ జరిపారు. అయితే పరిహారం చెల్లించలేదు. బాధితులు కోర్టుకు వెళ్లారు. […]

Written By: Srinivas, Updated On : March 3, 2021 2:13 pm
Follow us on


కలెక్టర్లంటే జిల్లా మేజిస్ట్రేట్స్‌. జిల్లా మొత్తానికి పాలనాధికారి. అంతటి హోదాలో ఉన్న అధికారే ప్రభుత్వం ఆదేశాలను పాటించకుండా.. ప్రజా హక్కులను కాలరాస్తే ఎలా..? అలా చేస్తే ఏ రోజుకైనా ఇబ్బందులు తప్పవని మరోసారి రుజువైంది. తెలంగాణ హైకోర్టు ఇద్దరు కలెక్టర్లు మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించడం ఇప్పుడు సంచలనమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అనంతసాగర్ రిజర్వాయర్ కు భూసేకరణను కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ జరిపారు. అయితే పరిహారం చెల్లించలేదు. బాధితులు కోర్టుకు వెళ్లారు. కోర్టు పరిహారం ఇచ్చిన తర్వాత మాత్రమే నీటి నిల్వ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Also Read: షర్మిల పార్టీలోకి ప్రముఖ నేత.. ఎవరో తెలిస్తే షాక్?

అయితే.. వారి నివాసాలకు మాత్రమే పరిహారం ఇచ్చిన కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ అనంతసాగర్‌లో నీరు నిల్వ చేశారు. ఈ కారణంగా పరిహారం ఇవ్వని మూడు వందల ఎకరాల వరకూ ముంపునకు గురయ్యాయి. దీంతో రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను హైకోర్టులో వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా నిర్ధారించింది. మూడు నెలలసాధారణ జైలు శిక్ష విధించింది. శిక్షకు గురైన ఇద్దరిలో ఒకరు ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్ మరొకరు ప్రస్తుతం వనపర్తి జిల్లా కలెక్టర్ గా ఉన్న యాస్మిన్ భాష. వీరితో పాటు భూసేకరణ అధికారిగా ఉన్న ఎన్.శ్రీనివాసరావుకు కూడా శిక్ష విధించారు.

కోర్టు ధిక్కరణ కేసు వల్ల పిటిషనర్లకు చెందిన భూమిని స్వాధీనం చేసుకోవాలన్న అధికారుల ప్రయత్నాలు చెల్లవని న్యాయస్థానం పేర్కొంది. పిటిషనర్ల భూమికి సంబంధించి ప్రాథమిక ప్రకటన (భూసేకరణ చట్టంలోని సెక్షన్‌ 11(1) నోటిఫికేషన్‌)తో పాటు 2019 మే 21న జారీ చేసిన డిక్లరేషన్‌, అవార్డు నోటిఫికేషన్లను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఆరు నెలల్లోగా తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసి చట్ట ప్రక్రియను అనుసరించి పిటిషనర్ల భూమిని సేకరించవచ్చంది.

ఆర్డీవోతో పాటు ఇద్దరు కలెక్టర్లు వేర్వేరుగా ఒక్కొక్క పిటిషనర్‌కు రూ.2 వేల చొప్పున ఖర్చుల కింద చెల్లించాలని జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు తన తీర్పులో ఆదేశించారు. మల్లన్నసాగర్‌ డీపీఆర్‌ (ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నివేదిక)ను పిటిషనర్లకు తెలుగులో ఇచ్చి, వారి అభ్యంతరాలపై తీసుకున్న నిర్ణయాలను తెలియజేసి డిక్లరేషన్‌, అవార్డు నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ 2018లో హైకోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు విరుద్ధంగా భూసేకరణ చేపట్టడంతో లక్ష్మి, మరో 11 మంది వేర్వేరుగా రెండు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేయగా- వీటిపై జస్టిస్‌ రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు.

Also Read: నిమ్మగడ్డకు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు

ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్డీవో అందజేశారని కలెక్టర్‌ చెబుతున్నప్పటికీ ఎలాంటి వివరాలివ్వలేదని పిటిషనర్లు చెప్పారని న్యాయమూర్తి పేర్కొన్నారు. పది రోజుల్లో మూడు సెట్ల డీపీఆర్‌ ఇవ్వాలన్న కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో కలెక్టర్‌ వివరించలేదన్నారు. భూసేకరణపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆర్డీవోకు పిటిషనర్లు వినతి పత్రమిచ్చినా, ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. అలాగని తిరస్కరించలేదన్నారు. దీన్నిబట్టి పిటిషనర్ల వాదనను అంగీకరించినట్లేనన్నారు. ఆర్డీవో ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వును ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియను పరిశీలిస్తే కలెక్టర్ల పరిపాలనా సామర్థ్యాలపై అనుమానాలు కలుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించేలా ఆర్డీవోను ప్రోత్సహించినట్లుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. శిక్షపై అప్పీల్ చేసుకోవడానికి అధికారులకు ఆరు వారాల సమయం ఇచ్చింది. అప్పటి వరకూ శిక్షను అమలు చేయరు. అయితే తీర్పును వారి సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవలి కాలంలో అధికారులు ప్రభుత్వాలు చెప్పినట్లుగా చేస్తూ.. చట్టాలను అతిక్రమిస్తున్నారు. అలాంటి వారికి.. ఈ తీర్పు మేలుకొలుపులా ఉండే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్