దేశవ్యాప్తంగా నష్టాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవటీకరణ చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ కూడా ఈవిషయాన్ని బహిరంగంగా ప్రకటించేశారు కూడా. ఇందులోభాగంగా చాలా వరకు ఇప్పటికే ప్రైవేటీకరణ చేస్తూ అనౌన్స్ చేశారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య ఓడరేవుల విషయంలో కూడా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రధాన ఓడరేవులను ప్రైవేటీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇక అందులో వైజాగ్ ఓడరేవు కూడా ఉండడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: కోర్టు ధిక్కరణ కేసు.. ఇద్దరు కలెక్టర్లకు మూడు నెలల జైలు
ఓ పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగుతున్న సమయంలో.. వైజాగ్ పోర్ట్‌ను కూడా ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం వర్చువల్ విధానంలో మారిటైం ఇండియా సమ్మిట్ 2021 ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సదస్సులో కేంద్ర నౌకాయాన జల రవాణా శాఖ కార్యదర్శి సంజీవ్ రంజన్ మాట్లాడుతూ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న పోర్టులలోని బెర్తులను ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అప్పగించబోతున్నట్లుగా ప్రకటించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మేజర్ పోర్టులు వాటి పరిధిలోని 39 బెర్త్‌లను సొంతంగా నిర్వహిస్తున్నాయని, వాటన్నింటిని పీపీపీ విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ఈ ఏడాది వాటిని ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియ మొదలవుతుందని సంజీవ్ రంజన్ పేర్కొన్నారు. ఇక కేంద్ర నౌకాయాన జల రవాణా శాఖ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలను బట్టి ప్రైవేటీకరణ అంశం ఎంతో దూరంలో లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన మేజర్ పోర్టు అథారిటీ చట్టం ప్రకారం పోర్టులోని ప్రాజెక్టులను పీపీపీ పద్ధతి ద్వారా అప్పగించే అధికారం కల్పిస్తోంది.
Also Read: హైదరాబాద్‌లో ఎవరు సంపన్నులు.. టాప్ 10లో వీరే..!
ఇక అథారిటీ కూడా ప్రైవేట్ భాగస్వామిని ఎంపిక చేసుకోవచ్చు. అలా ఎంపిక చేయబడిన ప్రైవేట్ భాగస్వామి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పోర్టుల్లోని సేవలకు రుసుము వసూలు చేయవచ్చు. ఇక ఈ ఆదాయాన్ని ప్రైవేట్ భాగస్వామి, పోర్టులు కలిసి పంచుకుంటాయి. విశాఖ పోర్టు విషయంలో కూడా భవిష్యత్తులో ఇదే జరగబోతోంది. ఒక విశాఖపట్నం మాత్రమే కాకుండా దేశంలోని ప్రధాన పోర్టులైన చెన్నై, కొచ్చి, కలకత్తా,, ముంబై, మంగళూరు, కాండ్ల వంటి పది పోర్టులు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంతో భగ్గుమంటున్న విశాఖ వాసులు, ఇక విశాఖ పోర్టులో కూడా ప్రైవేటు భాగస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒప్పుకునే స్థితిలో లేరు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్