https://oktelugu.com/

హైదరాబాద్‌లో ఎవరు సంపన్నులు.. టాప్ 10లో వీరే..!

భారత్‌లో మోడీ ప్రభుత్వ విధానాల దెబ్బకు మెజారిటీ ప్రజలు కొనుగోలు శక్తి, ఆదాయాలను కోల్పోతుంటే మరోవైపు అపార కుబేరులు అమాంతం పెరిగిపోతున్నారు. కరోనా దెబ్బతో సామాన్య జనం విలవిల్లాడుతుంటే బిగ్‌ షాట్స్‌ ఆదాయం మాత్రం రెట్టింపవుతూనే ఉంది. ముఖ్యంగా కరోనా కాలంలోనూ దేశంలో కొత్తగా 40 మంది కుబేరులు పుట్టుకొచ్చారని తాజాగా ఓ రిపోర్ట్‌లో వెల్లడైంది. దీంతో దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 177కు చేరింది. మంగళవారం హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2021 ధనవంతుల జాబితాను […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 3, 2021 1:57 pm
    Follow us on

    Billionaires Of Hyderabad
    భారత్‌లో మోడీ ప్రభుత్వ విధానాల దెబ్బకు మెజారిటీ ప్రజలు కొనుగోలు శక్తి, ఆదాయాలను కోల్పోతుంటే మరోవైపు అపార కుబేరులు అమాంతం పెరిగిపోతున్నారు. కరోనా దెబ్బతో సామాన్య జనం విలవిల్లాడుతుంటే బిగ్‌ షాట్స్‌ ఆదాయం మాత్రం రెట్టింపవుతూనే ఉంది. ముఖ్యంగా కరోనా కాలంలోనూ దేశంలో కొత్తగా 40 మంది కుబేరులు పుట్టుకొచ్చారని తాజాగా ఓ రిపోర్ట్‌లో వెల్లడైంది. దీంతో దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 177కు చేరింది. మంగళవారం హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2021 ధనవంతుల జాబితాను విడుదల చేశారు. దీని ప్రకారం భారత్‌లో మొత్తం 209 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో 177 మంది ప్రస్తుతం దేశంలో నివసిస్తున్నారు.

    Also Read: షర్మిల పార్టీలోకి ప్రముఖ నేత.. ఎవరో తెలిస్తే షాక్?

    గతేడాది కాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన బిలియనీర్ల విషయంలో అమెరికాతో భారత్‌ పోటీ పడింది. అమెరికాలో మొత్తం 69 మంది కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరగా.. భారత్‌లో ఈ సంఖ్య 40కు పెరిగింది. దీంతో దేశంలో వారానికో కుబేరుడు పుట్టుకొస్తున్నాడని స్పష్టమవుతోంది. ప్రపంచ బిలియనీర్లు గతేడాదిలో జర్మనీ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)తో సమానంగా 3.5 ట్రిలియన్‌ డాలర్ల సంపదను పోగు చేసుకున్నారు. హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2021 జాబితాను ప్రపంచంలో 68 దేశాల్లో ఉన్న 2,402 కంపెనీలు, 3228 బిలియనీర్లను పరిగణనలోకి తీసుకొని విడుదల చేశారు. గతేడాది 412 మంది బిలియనీర్లు ప్రపంచ వ్యాప్తంగా పుట్టుకొచ్చారు.

    ముంబై నగరంలో అత్యధికంగా 60 మంది బిలియనీర్లు ఉండగా.. ఢిల్లీ (40) బెంగళూరులో (22), అహ్మదాబాద్ (11), హైదరాబాద్‌ (10) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భాగ్యనగరంలోని పది మంది బిలియనీర్ల సంపద రూ.1,65,900 కోట్లు కావడం గమనార్హం. హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-–2021 ప్రకారం.. పది మంది హైదరాబాద్ కుబేరుల్లో ఏడుగురు ఫార్మా రంగానికి చెందిన వారే కావడం విశేషం. దివీస్ ల్యాబ్స్ అధినేత మురళీదివీ, ఆయన కుటుంబం భాగ్యనగరంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. భారత్‌లో 20వ స్థానంలో, అంతర్జాతీయంగా 385వ స్థానంలో ఉన్న మురళీ దివి, ఆయన కుటుంబ సంపద విలువ రూ.54 వేల కోట్లు. రెండో స్థానంలో అరబిందో ఫార్మా ప్రొమోటర్ పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి, ఆయన కుటుంబం ఉంది. పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి, ఆయన కుటుంబం దేశంలో 56వ స్థానంలో ఉండగా.. వారి సంపద రూ.22,600 కోట్లుగా ఉంది.

    Also Read: నిమ్మగడ్డకు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు

    హెటెరో డ్రగ్స్ ప్రమోటర్ బి.పార్థసారథి రెడ్డి, ఆయన కుటుంబం ఈ ఏడాది అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో చేరింది. హైదరాబాద్‌లో మూడో స్థానంలో నిలిచిన వీరి సంపద రూ.16 వేల కోట్లుగా ఉంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌కు చెందిన కె. సతీష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ రూ.12,800 కోట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. జీవీ ప్రసాద్, ఆయన భార్య జి.అనురాధ రూ.10,700 కోట్లతో ఐదో స్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు చెందిన పి.పిచ్చిరెడ్డి రూ.10,600 కోట్ల సంపదతో దేశంలో 134వ స్థానంలో నిలిచారు. మై హోం ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు అండ్ ఫ్యామిలీ సంపద రూ.10,500 కోట్లు కాగా.. మేఘా ఇంజినీరింగ్‌కు చెందిన పీవీ కృష్ణా రెడ్డి సంపద రూ.10,200 కోట్లుగా ఉంది. ఫార్మా రంగానికి చెందిన ఎం. సత్యనారాయణ రెడ్డి అండ్ ఫ్యామిలీ (ఎంఎస్ఎన్ ల్యాబ్స్) రూ.9800 కోట్లు, నాట్కో ఫార్మాకు చెందిన వీసీ నన్నపనేని రూ.8600 కోట్లతో వీరి తర్వాతి స్థానంలో ఉన్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్