తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ దొంగ ఓట్ల కలకలం చెలరేగింది. వేలాది మంది వాహనాల్లో తిరుపతికి వస్తుండడంతో టీడీపీ నేతలు అడ్డుకొని ఆందోళనకు దిగారు. వైసీపీ దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తిరుపతికి తరలించారని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
తిరుపతిలోని లక్ష్మీపురం, కెనడీనగర్ కూడలి వద్ద బయట నుంచి వస్తున్న దొంగ ఓటర్లను అడ్డుకొని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందు ఓ ప్రైవేటు బస్సును ఆపిన టీడీపీ నేతలు బస్సులో ఉన్న వ్యక్తులను ఎందుకు వచ్చారని వారితో గొడవకు దిగారు. ఇక ఓ కల్యాణ మండపంలో బయట వ్యక్తులు బస చేశారన్న సమాచారం మేరకు అక్కడికి చేరుకొని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
టీడీపీ నేతల ఆందోళనతో అందులో బస చేసిన వ్యక్తులంతా పారిపోయారు. బస్సులు, కార్లు ఆపేసి నకిలీ ఓటర్లను టీడీపీ, కాంగ్రెస్ నేతలు బలవంతంగా దించేశారు. వారి నకిలీ ఓటరు కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వేసేందుకు వేలాది మందిని తీసుకొచ్చిందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతా మోహన్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సైతం దొంగ ఓటర్ల ఫొటో ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు. రెండు బస్సుల్లో వైసీపీ నేతలు బయట వ్యక్తులను తరలించారని లేఖలో పేర్కొన్నారు. స్థానికేతరులతో రిగ్గింగ్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు.