AP Politics- Media: ఎన్నికలంటే నేతలకు ఎందుకంత భయం? అధికారంలో ఉన్నవారు మరోసారి నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలోకి వచ్చేందుకు ఆరాటపడతారు. అది కామన్ పాయింట్. దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా రాజకీయం ఇలానే ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. సింగిల్ గా రండి అని ఒకరు. పొత్తు కుదుర్చుకుంటే మీకేంటి బాధ అని మరొకరు. ఎట్టి పరిస్థితులో మీకు అధికారంలోకి రానివ్వనని మరొకరు సవాల్ విసురుకుంటున్నారు. విచిత్రమేమిటంటే రాష్ట్రంలో కత్తులు దూసుకుంటున్న పార్టీలన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాపకం కోసం ప్రయత్నిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. పోనీ రాష్ట్ర ప్రయోజనాల కంటే అదీ కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనన్నది బహిరంగ రహస్యం. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేడివిజన్ల ఏర్పాటు, ప్రత్యేక ప్రాజెక్టులు ఇలా ఎన్నో సమస్యలు ఏపీని పీడిస్తున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా బీజేపీ నేతలతో వేదిక పంచుకునేందుకు ఆరాట పడుతున్నారు. వారు పక్కన నిలబడితే మురిసిపోతున్నారు. కలిసి భోజనం చేస్తే పొంగిపోతున్నారు.

మూడు వర్గాలుగా మీడియా...
ఏపీలో గ్రహపాటు ఏమిటంటే సగటు మనిషి కూడా ఇక్కడి రాజకీయాలను అంచనా వేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో కూడా గణాంకాలతో చెబుతున్నాడు. విపక్షాలు ఒంటరిగా వెళితే జగన్.. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిస్తే కూటమి.. బీజేపీ సహకారం లేనిదే ఏ ఒక్కరూ సంపూర్ణ మెజార్టీతో విజయం సాధించలేరని సామాన్యుడు సైతం విశ్లేషిస్తున్నాడు. దీనికితోడు ఏ పార్టీకి ఉన్న అనుకూల మీడియా వారికి తగ్గట్టు విశ్లేషణలు చెబుతోంది. ప్రత్యర్థి పార్టీల తప్పులను ఎత్తిచూపుతూ తాము అనుకూలంగా వ్యవహరించి, ఆరాధించే పార్టీల పల్లకి మోస్తున్నాయి. అటు మీడియాను కూడా మూడు వర్గాలుగా విభజించారు. ఒకటి ఎల్లో మీడియా, రెండోది నీలి మీడియా, మూడోది తటస్థ మీడియా. ముందుగా ఈ విభజనకు ఆజ్యం పోసింది రాజకీయ పార్టీలే. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే మీడియాను ఎల్లోగాను, వైసీపీకి అనుకూలించే మీడియాను నీలిగాను విభజించారు. ఇప్పుడు ఏపీనాట ఈ రెండు మీడియాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. ప్రజలు కూడా వాటిని విభజించి చూడడం ప్రారంభించారు. ఎదైనా వార్తను కన్మర్మ్ చేసుకోవడానికి తటస్థ మీడియాలను చూడడం ప్రారంభించారు.
రోత రాతలతో నీలి మీడియా..
జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నీలి మీడియాలో పతాక శీర్షికన కథనాలు, టీవీల్లో రోజంతా అనుకూల స్క్రోలింగులు నడుస్తాయి. సొంత పత్రిక, టీడీ సాక్షిలో అయితే చెప్పనక్కర్లేదు.. ఇదంతా జగన్ సర్కారు గొప్పదనమేనన్నట్టు వ్యవహరిస్తాయి. అటు రాష్ట్రంలో ఏ చిన్న సమస్య కూడా ఈ మీడియాకు కనిపించదు. రహదారులు బాగాలేదు. ప్రజలకు మౌలిక వసతులు లేవు. ప్రజలు నరకయాతన పడుతున్నారు. కానీ ఈ సమస్యలేవీ ఆ మీడియా దృష్టికి రావు. ఒక వేళ ఎవరైనా ప్రస్తావించినా అదంతా రాజకీయంగా అభివర్ణిస్తారు. గత ప్రభుత్వాల తప్పిందలా చూపిస్తారు. అదే జగన్ ఒక సంక్షేమ పథకాన్ని ప్రారంభిస్తే చాలు ఆయా వర్గాలు, లబ్ధిదారుల అభిప్రాయాలను పేపరులో నిలువునా పరిచేస్తారు. వారిని స్టూడియోలో కూర్చోబెట్టి టీవీల్లో కథనాలు వండి వారుస్తారు. కేంద్రంలో ఉన్న బీజేపీ విషయంలో ఏ రోజుకు ఉన్న పరిస్థితులను తగ్గట్టు కవరేజ్ చేస్తారు. అనుకూలంగా ఉన్నరోజు ఆకాశానికెత్తేస్తారు. లేకపోతే కవరేజ్ తగ్గించేస్తారు. ఇక చంద్రబాబు, లోకేష్, పవన్ ల విషయానకి వస్తే రోజుల్లో సగం సమయం వారిపై వ్యతిరేక వార్తలకే ప్రాధాన్యమిస్తారు.
Also Read: Karnataka Husband and Wife: ఒక మహిళ కోసం ఇద్దరు భర్తల ఆరాటం..ఎందుకు కొట్టుకు చస్తున్నారంటే?
అతిగా స్పందిస్తున్న ఎల్లో మీడియా..
ఎల్లో మీడియా గురించి చెప్పనక్లర్లేదు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుంచి భుజానికి ఎత్తుకొని పల్లకి మోయడం ఈ వర్గం మీడియాకు అలవాటు అయిపోయింది. నిత్యం పసుపు పార్టీ అధికారంలో ఉండాలన్నదే ఎల్లో మీడియా అభిమతం. ప్రస్తుతం జగన్ అధికారంలో ఉండడం, ఒక్క రాజకీయంగానే కాకుండా తమ మీడియా గుత్తాధిపత్యాన్ని కొల్లగొట్టడం సహజంగా ఈ మీడియాధిపతులకు రుచించడం లేదు. అందుకే జగన్ అంటేనే మండిపడుతున్నారు. ఎలాగైనా అధికార పీఠానికి దూరం చేయాలని భావిస్తున్నారు. అందుకు ఏ చిన్నపాటి అంశాన్ని విడిచిపెట్టడం లేదు. ఎల్లో మీడియాగా అభివర్ణిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబీఎన్ , టీవీ5ను ఏపీ సీఎం జగన్ దుష్టచతుష్టయంగా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి కాస్తా వెనుకబడి ఉండడంతో హైప్ చేసే పనిలో ఎల్లో మీడియా పడింది. చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలిశారు. లోకేష్ రహస్యంగా అమిత్ షాను కలిసి చర్చలు జరిపారు అన్న గ్యాసిప్స్ వచ్చిందే తరువాయి ఈ మీడియాకు పూనకం వచ్చేస్తుంది. పుంఖానుపుంఖాలుగా కథనాలు వడ్డిస్తాయి. యాంకర్లు తెగ హడావుడి చేస్తూ చర్చాగోష్టిలు నిర్వహిస్తుంటారు.

ఎవరి గేమ్ వారిది..
అయితే ఎవరు ఎన్ని చేసుకున్నా బీజేపీకి ఇక్కడి పరిస్థితి తెలియంది కాదు. ఎవరితో కలిస్తే ప్రయోజనముంటుందో వారితోనే కలుస్తారు. వాస్తవానికి నాడు బీజేపీతో కలిసి నడుస్తున్న చంద్రబాబుతో మైండ్ గేమ్ అడి ఎన్డీఏకు దూరం చేసింది జగన్ కాదా? ఎన్డీఏలో చేరకుండానే ఇప్పటివరకూ ఆ స్థానంలో కొనసాగుతుంది ఆయన కాదా? అలాగే ఇప్పుడు ఎన్డీఏలో చేరాలని తహతహలాడుతుంది చంద్రబాబు కాదా? నాటి తన వ్యూహాన్ని చంద్రబాబు ఫాలో అవుతుండడంతో కలవరపాటుకు గురవుతుంది జగన్ కాదా? అయితే పైకి మాత్రం చంద్రబాబు సింగిల్ గా పోటీచేయాలని సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతం వైసీపీ బయట ఉన్నా ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగుతుందన్న భావన అందరిలోనూ ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు తప్పించి రాజకీయ ప్రయోజనాలను పొందుతున్న విషయం సామాన్యుడికి సైతం తెలుసు. ఇప్పుడు చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే మరోసారి బీజేపీ ప్రాపకం కోసమని అందరికీ విధితమే. అయితే ఇవేవీ జనాలకు తెలియదన్నట్టు నీలి మీడియా, ఎల్లో మీడియా ప్రయత్నాలు చేస్తుండడం మాత్రం జుగుప్సాకరం. అటు తటస్థ మీడియా సైతం అప్పుడున్న పరిస్థితుల బట్టి స్ట్రాటజీ మారుస్తుండడంతో ఏపీ ప్రజల దౌర్భాగ్యం.
Also Read: Modi-KTR: మోడీతో ఫైట్: బస్తీమే సవాల్ అంటూ ఆయన సవాల్ స్వీకరించిన కేటీఆర్


[…] […]