Kharif Paddy- Telangana Govt: మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అని వెనుకటికి ఎవడో అన్నాడట. ఇప్పుడు అలానే ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కాస్త అప్పుడు మయం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతినెలా అప్పు చేస్తే గాని జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయింది. ఇక పెద్దపెద్ద ప్రాజెక్టులన్ని మూలకు పడిపోయాయి. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మొదలు పెడితే సర్పంచ్ ల వరకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి.. ఇక మిగతా సంక్షేమ పథకాలకు సర్దుబాట్లనే రాష్ట్ర ప్రభుత్వం నమ్ముకుంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్, నల్లగొండ జిల్లాలో ధాన్యం చేతికి వచ్చింది. సన్నాలు కావడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకముందే మిల్లర్లు పచ్చిధాన్యాన్ని క్వింటాకు 1900 చొప్పున తీసుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకునే ధాన్యాన్ని రైతులు తూర్పార పట్టాలి. తేమ శాతం 17 లోపు ఉండాలి. కానీ ప్రస్తుతం నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో వ్యాపారులు పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. పైగా క్వింటాకు 1900 దాకా చెల్లిస్తున్నారు. దీనివల్ల రైతులకు మంచి ప్రయోజనమే కలుగుతోంది. ముందస్తు కోతలు జరుగుతాయని తెలిసినా ప్రభుత్వం నిష్క్రియా పరత్వం వల్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. అసలు ఈ కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

అప్పు ఇస్తేనే కొనుగోలు చేస్తారట
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు బాధ్యతను పౌర సరఫరాల శాఖ పర్యవేక్షిస్తుంది. ఏటా ధాన్యాన్ని కొనుగోలు చేసి దానిని మిల్లర్ల ద్వారా మిల్లింగ్ చేయించి, పౌర సరఫరాల శాఖకు విక్రయిస్తుంది. దాని ద్వారా వచ్చిన డబ్బును ప్రభుత్వానికి చెల్లిస్తుంది. అయితే పౌరసరఫరాల శాఖకు ప్రభుత్వమే పూచికతుగా ఉండి వివిధ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తుంది. అయితే గత ఎనిమిది సంవత్సరాలుగా పౌరసరఫరాల శాఖ పనితీరు అస్తవ్యస్తంగా మారింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సక్రమంగా ఆడిట్ నిర్వహించకపోవడంతో పౌర సరఫరాల శాఖ బకాయిలు పేరుకుపోయాయి. కొందరు అధికారులు, మిల్లర్లతో మిలాఖత్ కావడంతో జాతీయ ఆహార సంస్థకు సకాలంలో బియ్యం అందడం లేదు. దీనివల్ల పౌరసరఫరాల శాఖ మీద వడ్డీ భారం పెరుగుతోంది. ఉదాహరణకి 2014 _ 15 సీజన్ కి ధాన్యం 25 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే.. మిల్లర్లు మాత్రం కోటి టన్నులు మిల్లింగ్ చేశామని తప్పుడు లెక్కలు చూపారు. మిల్లర్లు చూపిన లెక్క ప్రకారం ఆ స్థాయిలో బియ్యం ఇవ్వలేదు. దీని పై ఆరా తీసిన కేంద్ర ప్రభుత్వం 1650 కోట్ల చెల్లింపులను నిలిపివేసింది. ఆ నిధులను రాబట్టుకోవడంలో పౌరసరఫరాల శాఖ ఘోరంగా విఫలమైంది. ఇలాంటి పరిణామాల వల్ల పౌరసరఫరాల శాఖపై బకాయిలు పేరుకుపోయి కనీసం ధాన్యం కొనుగోలు చేయలేని స్థితిలో ఉంది.
పంజాబ్, ఛత్తీస్గడ్ బాటలో..
ధాన్యం కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో వడ్డీల భారం తగ్గించుకునేందుకు పౌరసరఫరాల శాఖ కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పంజాబ్, చత్తీస్గడ్ బాటలో నడుస్తోంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి నిధుల సేకరణకు టెండర్లు ఆహ్వానించనుంది. ఈ సీజన్ కు సంబంధించి కోటి టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి రావడంతో.. ఇందుకు 1950 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. స్వల్పకాలిక రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే సంస్థలు 26లోగా టెండర్లు వేయాలని కోరింది. 27న టెండర్లను ఓపెన్ చేస్తారు. గతంలో ఈ పద్ధతి ద్వారా పంజాబ్, చత్తీస్గడ్ బయట మార్కెట్ నుంచి రుణాలు సేకరించాయి. అయితే పౌరసరఫరాల శాఖ వివిధ బ్యాంకులకు ఇప్పటివరకు 35 వేల కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది.

మిల్లర్లు పెద్ద ఎత్తున ధాన్యం నిల్వ చేసుకోవటం, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలించడం, ఈ ప్రక్రియ మొత్తం స్థానికంగా ఉన్న టిఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లో జరగడం వల్ల ఈ ప్రభావం పౌరసరఫరాల శాఖ మీద పడుతుంది. నానాటికి రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో సంస్థ మనుగడే ప్రమాదంలో పడింది. గతంలో సివి ఆనంద్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలుకు సంబంధించి జరిగిన అక్రమాలపై ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోలేదు. పైగా సివి ఆనంద్ ను హైదరాబాద్ పోలీసు శాఖ కమిషనర్ గా బదిలీ చేసింది. ఇది ఇలా ఉంటే కోవిడ్ రెండు దశలో యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి తేమ, తాలు పేరుతో అడ్డగోలుగా కోతలు విధించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని ధాన్యం కొనుగోలు విషయంలో అక్రమాలు అన్ని ఇన్ని కావు. అసలు చేతిలో పైసా లేకుండా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇలాంటి స్థితిలో దేశానికే మేము అన్నం పెడుతున్నామని కెసిఆర్ అంటుండటం, దానిని మిగతా నాయకులు బలపరుస్తుండటం గమనార్హం.