Telangana Assembly Election: కాంగ్రెస్ ఆరు హామీలు అంటూ దూసుకుపోతోంది. బిజెపి గిరిజన యూనివర్సిటీ, టర్మరిక్ బోర్డు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హోదా పెంపు వంటి హామీలను ప్రకటించింది. మరి భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఏమిటి?! ఇంతవరకు కెసిఆర్ ఏదీ ప్రకటించలేదు. గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఇంతవరకూ బయటికి రాలేదు. హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే బయట తిరుగుతున్నారు. అక్టోబర్ 15న జరిగే భారీ బహిరంగ సభలో కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటిస్తారని భారత రాష్ట్ర సమితి వర్గాలు అంటున్నాయి. ఇంతకీ కెసిఆర్ ఏం మేనిఫెస్టో ప్రకటించనున్నారు?
2018_19 ఎన్నికలకు ముందు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ఎకరానికి పెట్టుబడి సహాయం కింద 8000 చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. 2018 _19 ఎన్నికల్లో యాసంగి రైతుబంధును నవంబర్ నెలలో పోలింగ్ సమయంలో ఖాతాల్లో జమ చేయడంతో రైతులు భారత రాష్ట్ర సమితికి ఓట్ల పంట పండించారు. రైతు బంధు, రైతు బీమా పథకాలతో కేసీఆర్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చినట్టు అప్పట్లో చర్చ జరిగింది. రెండో సారి కెసిఆర్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రైతుబంధు ఆర్థిక సహాయాన్ని మరో రెండు వేలకు పెంచింది. ఒక పంటకు ఎకరానికి 5000 చొప్పున ఏడాదికి 10,000 పంపిణీ చేస్తోంది. గత బడ్జెట్ 2023_24 లో ఎకరానికి 1000 పెంచి ప్రతి పంటకు 6000 చొప్పున 12000 పంపిణీ చేస్తారని ప్రచారం జరిగింది. బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల మేనిఫెస్టోలో రైతులను లక్ష్యంగా చేసుకొని రూపుదిద్దుకుంటుండడంతో.. భారత రాష్ట్ర సమితి దీనిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఒక పంటకు ఎకరానికి 7500 చొప్పున ఏడాదికి 15000 పంపిణీ చేస్తారని, భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టోలో దీనిని పొందుపరచాలని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది పట్టాదారులు ఉన్న నేపథ్యంలో.. వారందరికీ రైతుబంధు సహాయం కింద ఏటా 15 వేల కోట్ల బడ్జెట్ ప్రభుత్వం కేటాయిస్తోంది. ఒకవేళ ఎకరానికి 15000 చొప్పున ఇస్తే బడ్జెట్లో ఆ కేటాయింపు 22,500 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.
2017 ఏప్రిల్ 13న ప్రగతిభవన్లో రైతులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులందరికీ 2018 ఆర్థిక సంవత్సరం నుంచి 24 లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. అని ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదు. అయితే ఈసారి ప్రకటించే మేనిఫెస్టోలో ఈ అంశాన్ని కీలకంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పథకంలో భాగంగా ఎకరానికి రెండు బస్తాలు చొప్పున యూరియా రైతులకు అందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో పింఛన్ 4000 ఇస్తామని ప్రకటించారు. దీనిపై స్పందించిన భారత రాష్ట్ర సమితి దివ్యాంగులకు ప్రస్తుతం అందిస్తున్న 3,106 పింఛన్ కు అదనంగా మరో వెయ్యి కలిపి నెలకు 4,116 రూపాయలు అందిస్తోంది. ప్రస్తుతం ఆసరా పించన్ల కింద అందిస్తున్న 2016కు మరో వెయ్యి జోడించి 3016 రూపాయలు అందించాలని నిర్ణయించినట్టు సమాచారం. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలకు ఇస్తున్న 1,01,116 నగదు సహాయాన్ని 20 నుంచి 30% పెంచి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇవే కాకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని కెసిఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను కలిపి అర్హులైన అందరికీ ఆరోగ్య భరోసా పేరుతో 10 లక్షలతో హెల్త్ కార్డు అందించాలని కెసిఆర్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలో భాగమైన చేయూత పథకంలో రాజు ఆరోగ్యశ్రీ బీమా కింద పది లక్షలు అందిస్తామని తెలిపింది. దీంతో భారత రాష్ట్ర సమితి కూడా హెల్త్ కార్డు పేరుతో ఒక పథకాన్ని తీసుకువచ్చి.. సాయం మొత్తాన్ని పెంచాలని భావిస్తోంది. గతంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఈ పథకానికి మార్పులు చేర్పులు చేసి ప్రకటించి.. ఎన్నికల్లో ఆ అంశాన్ని ప్రధానంగా యువతలోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఈ బీసీ, బీసీ విద్యార్థుల వారీగా ఆర్థిక సహాయాన్ని ఏడాదికింత చొప్పున ఇవ్వాలా? లేక నెలవారీగా ఇవ్వాలా? అనేదానిపై కూడా చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలను బలంగా ఢీకొట్టేందుకు కెసిఆర్ భారీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే వివిధ రంగాల నిపుణులతో ఆయన ఆయన విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు నిర్వహిస్తున్నట్టు సమాచారం.