Tamil Nadu election results 2026 : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక కౌంటింగ్ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతోంది. ఈ కౌంటింగ్లో తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే, అధికార డీఎంకే పార్టీ ఆరంభంలో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించినప్పటికీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన ’తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అనూహ్యంగా పుంజుకుని, సంప్రదాయ రాజకీయ శక్తివైన ఏఐఏడీఎంకేతో పాటు అధికార డీఎంకేను కూడా వెనక్కి నెట్టడం సంచలనం రేపుతోంది .
ఉత్కంఠగా ఫలితాలు..
ప్రస్తుత కౌంటింగ్ సరళిని గమనిస్తుంటే, పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు రాజకీయ విశ్లేషకులలో కొత్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. డీఎంకే తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుండగా, టీవీకే పార్టీ అట్టడుగు స్థాయి నుండి పుంజుకుని రేసులో ముందంజలో నిలిచింది. డీఎంకే 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీవీకే 62 స్థానాల్లో లీడ్లోకి వచ్చింది. ఇక ఏఐఏ డీఎంకే 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. కీలక నియోజకవర్గాల్లో టీవీకే పార్టీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోవడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా మారింది .
ప్రదీప్ గుప్తా అంచనాలు నిజమవుతున్నాయా?
ఎన్నికలకు ముందు ప్రదీప్ గుప్తా నేతృత్వంలోని ఎగ్జిట్ పోల్స్ అందించిన అంచనాలు వాస్తవ రూపం దాలుస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడులో బలమైన రాజకీయ శక్తులుగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా టీవీకే ఎదుగుదల, రాబోయే ఐదేళ్ల పాలనా గమనాన్ని మార్చవచ్చు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, తమిళనాడు రాజకీయాలు ద్రవిడ పార్టీల ఆధిపత్యం నుంచి నూతన రాజకీయ సమీకరణాల వైపు మళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు .