MP Gopinath : తమిళ ఎంపీ.. తెలుగులో ప్రమాణం.. వీడియో వైరల్

MP Gopinath : ఇక క్రిష్ణగిరి స్థానం నుంచి ఎంపీగా గెలిచిన గోపీనాథ్ కూడా హోసూర్ ప్రాంతంలో పేరు మోసిన వ్యాపారవేత్త. గోపీనాథ్ హోసూరులోనే పుట్టినప్పటికీ.. తెలుగు భాష పై విపరీతమైన మమకారాన్ని పెంచుకున్నారు. ఎంపీగా గెలిచి.. తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు.

Written By: NARESH, Updated On : June 25, 2024 10:04 pm

MP Gopinath

Follow us on

MP Gopinath : తెలుగు భాషకు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పేరు. అందువల్లే దేశభాషలందు తెలుగు లెస్స అనే నానుడి పుట్టింది. కానీ కాలక్రమేణా దేశభాషలందు తెలుగు లెస్ అనే విధంగా పరిస్థితి మారిపోతోంది. ఇంగ్లీష్ చదువులను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండడం.. తల్లిదండ్రులు కూడా అంతకుమించి ఆలోచిస్తుండడంతో.. తెలుగు మాధ్యమంలో చదివే వారి సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది. ఇదే సమయంలో ఇంగ్లీష్ చదువులు చదివే వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే ఇలాంటి సమయంలో తెలుగు వారికి పట్టిన ఇంగ్లీష్ జబ్బు వదిలించేందుకు ఓ తమిళ ఎంపీ బయలుదేరారు. చర్నాకోలు పట్టుకుని కొట్టినట్టుగా.. తన చేతులతో తెలుగు వారు చేస్తున్న భాష నిర్లక్ష్యాన్ని పార్లమెంట్ సాక్షిగా నిరూపించారు.. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..

తమిళనాడు రాష్ట్రంలోని క్రిష్ణగిరి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గోపీనాథ్ అనే వ్యక్తి గెలిచారు. మంగళవారం పార్లమెంటులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ఒక చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకొని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. సభకు నమస్కారం అంటూ తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు.. చివర్లో ఆయన నన్ డ్రి, వణక్కం, జై తమిళనాడు.. అంటూ అరవ భాషలో ముగించారు.. అయితే గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రధాన కారణం ఉంది. ఎందుకంటే ఆయన మాతృభాష తెలుగు. ఆయన ముత్తాతల మూలాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అయితే వారి కుటుంబం తమిళనాడులో స్థిరపడడంతో.. ఆయన తమిళ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మారిపోయారు..

ఇక గతంలో గోపీనాథ్ హోసూర్ అనే అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2001, 2006, 2011 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2016 లో జరిగిన ఎన్నికల్లో అన్న డీఎంకే అభ్యర్థి బాలకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను క్రిష్ణగిరి పార్లమెంటు స్థానం నుంచి రంగంలోకి దింపింది. తొలిసారిగా ఎంపీగా పోటీ చేసిన ఆయన.. విజయం సాధించారు. ఇక గతంలో గోపీనాథ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హోసూరు, ఎంపీగా గెలిచిన క్రిష్ణగిరి ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు సరిహద్దులో ఉంటుంది. ఈ నియోజకవర్గంలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటారు… అందువల్లే ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారని తెలుస్తోంది.

ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి క్రిష్ణగిరి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హోసూర్ ప్రాంతం 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందిన హోసూరులో దశాబ్దాల క్రితమే చాలామంది తెలుగువారు స్థిరపడ్డారు. హోసూరు ప్రాంతంలో సుమారు 50 శాతం మంది తెలుగు వారే ఉంటారు. అక్కడ ఉన్న వ్యాపారవేత్తల్లోనూ తెలుగువారే ఎక్కువ. ఇక క్రిష్ణగిరి స్థానం నుంచి ఎంపీగా గెలిచిన గోపీనాథ్ కూడా హోసూర్ ప్రాంతంలో పేరు మోసిన వ్యాపారవేత్త. గోపీనాథ్ హోసూరులోనే పుట్టినప్పటికీ.. తెలుగు భాష పై విపరీతమైన మమకారాన్ని పెంచుకున్నారు. ఎంపీగా గెలిచి.. తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు.