https://oktelugu.com/

Afghanistan cricket : రాత్రికి రాత్రే ఇది జరిగిపోలేదు.. ఆఫ్ఘన్ క్రికెట్ ఈ స్థాయికి ఎదగడం వెనుక ఎన్నో కష్టాలు..

Afghanistan cricket : ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లకు నేర్చుకోవాలని తపన ఎక్కువగా ఉంటుంది. ఇదే విషయాన్ని గతంలో ఆ జట్టుకు కోచ్ గా పనిచేసిన లాల్ చంద్ రాజ్ పుత్ వెల్లడించారు. మైదానంలో కొంతసేపు పరిగెత్తమంటే.. వారు ఏకంగా గంటల తరబడి రన్నింగ్ చేసేవారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 25, 2024 9:59 pm
    Afghanistan cricket

    Afghanistan cricket

    Follow us on

    Afghanistan cricket : టి20 వరల్డ్ కప్ లో లీగ్ దశలో న్యూజిలాండ్ జట్టును ఓడించి ఆఫ్ఘనిస్తాన్ సంచలనం సృష్టించింది. వాస్తవానికి దీనిని గాలివాటం గెలుపు కింద చాలామంది జమ కట్టారు..కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ జట్టు సూపర్ -8 దశలో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది.. బంగ్లాదేశ్ తో చివరి వరకు పోరాడి.. గెలిచింది.. అంతే నేరుగా సెమీస్ వెళ్ళిపోయింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఒక్కసారిగా ట్రెండింగ్ టాపిక్ అయింది. నిత్యం ఘర్షణలు, తాలిబన్ల అరాచకాలు, దుర్భర దారిద్ర్యం.. ఇన్ని తాండవిస్తున్న దేశంలో క్రికెట్ ఈ స్థాయిలో ఎలా ఎదిగింది? ఆ జట్టు ఆటగాళ్లు ఈ స్థాయిలో ఎలా ప్రతిభ చూపుతున్నారు? దీనిపై ప్రత్యేక కథనం..

    సరదాగా ఆడుకునే ఆటగా..

    శరణార్థి శిబిరాల గుడారాల వద్ద ఆడుకునే ఆటగా ఆఫ్ఘనిస్తాన్ యువకులకు క్రికెట్ పరిచయమైంది.. అది కాస్త వారి జీవితంలో ఒక భాగమైంది. దానిని ఆడేందుకు, ఆటలో నైపుణ్యం సంపాదించేందుకు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు పడ్డ కష్టం మామూలుది కాదు. అసలే ఆఫ్ఘనిస్తాన్ లో మత చాందసవాదం ఎక్కువగా ఉంటుంది. కట్టుబాట్లు, నియమ నిబంధనలు తీవ్రంగా ఉంటాయి.. ఇలా అన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ.. ఆ జట్టు ఆటగాళ్లు క్రికెట్ ను ఒక ధ్యాసలాగా మార్చుకున్నారు. మత చాందసవాదం పెచ్చరిల్లుతున్నప్పటికీ.. ఆటను ఆడేందుకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించుకున్నారు. ఇలా తరాలు మారుతున్నా కొద్దీ ఆఫ్ఘనిస్తాన్ లో క్రికెట్ అభివృద్ధి చెందడం మొదలైంది. అదే ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బలమైన న్యూజిలాండ్, పటిష్టమైన ఆస్ట్రేలియా, సంచలన బంగ్లాదేశ్ పై విజయాలు సాధించి.. తమవి గాలివాటం గెలుపులు కావని.. కష్టం, శ్రమ, కఠినమైన సాధన ద్వారా వచ్చినవని ఆఫ్ఘాన్ నిరూపించింది.

    2001 లో ఏర్పాటు

    2001లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏర్పాటయింది.. ఆ జట్టులో నాణ్యమైన బౌలర్లున్నారు.. వీరు అద్భుతంగా బౌలింగ్ చేసేవారు. బ్యాటర్లు మాత్రం హార్డ్ హిట్టింగ్ ను మాత్రమే నమ్ముకునేవారు. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ జట్టులో బ్యాటింగ్ ఆర్డర్ నిలకడగా ఉండకపోయేది. ఈ జట్టు 2017లో తొలిసారి టీ -20 ప్రపంచ కప్ కు అర్హత సాధించింది.. ఆ సంవత్సరం స్కాట్లాండ్ జట్టుపై సాధించిన విజయంతో సరిపెట్టుకుంది. ఆ మరుసటి ప్రపంచ కప్ లో దారుణమైన పరాజయాలను ఎదుర్కొంది.. ఈ క్రమంలో కోచ్ లు ఆఫ్ఘనిస్తాన్ ఆటో స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. టి20 అంటే దూకుడు మాత్రమే కాదని, సింగిల్స్ తీయడం, డబుల్ స్ కొట్టడం, స్ట్రైక్ రొటేట్ చేయడం వంటి వాటిని నేర్పించారు. ఫలితంగా 2023 వన్డే ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల ఆట తీరు పూర్తిగా మారింది. గతంలో వారి డాట్ బాల్ పర్సంటేజ్ 65.8 ఉండగా.. అది 52.1 కు పడిపోయింది. ఇక భాగస్వామ్యాల సరాసరి కూడా 2015తో పోలిస్తే రెట్టింపయింది. అది ఏకంగా 36 కు చేరుకుంది. అందువల్లే 2023 వరల్డ్ కప్ లో పాకిస్తాన్, ఇంగ్లాండ్ వంటి జట్లకు ఆఫ్ఘనిస్తాన్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టును ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించింది.

    నేర్చుకోవాలనే తపన

    ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లకు నేర్చుకోవాలని తపన ఎక్కువగా ఉంటుంది. ఇదే విషయాన్ని గతంలో ఆ జట్టుకు కోచ్ గా పనిచేసిన లాల్ చంద్ రాజ్ పుత్ వెల్లడించారు. మైదానంలో కొంతసేపు పరిగెత్తమంటే.. వారు ఏకంగా గంటల తరబడి రన్నింగ్ చేసేవారు. శిక్షణ విషయంలో ఏమాత్రం తగ్గే వారు కాదు. చివరికి యుద్ధం తీవ్రంగా ఉన్నప్పుడు.. వారి ఆత్మీయులు చనిపోయినప్పుడు.. అంత్యక్రియలకు వెళ్లి వచ్చి.. వెంటనే మైదానంలో సాధన చేసేవారు. జట్టుకు నిధుల లేకపోయినప్పటికీ.. ఆటగాళ్లు క్రికెట్ ను వదిలిపెట్టలేదు. 2006లో ఇంగ్లాండ్ దేశంలో జరిగిన ఆరు కౌంటీ మ్యాచ్లలో ఆఫ్గనిస్తాన్ విజయం సాధించింది. తిరిగి స్వదేశానికి వచ్చిన ఆ జట్టుకు.. ఎవరూ స్వాగతం పలకలేదు. చివరికి ఆటగాళ్ల వద్ద డబ్బులు లేకపోవడంతో నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు.

    యూఏఈ సాయం

    ఇక తాలిబన్లు రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీసా సమస్యలు మొదలయ్యాయి. ఈ దశలో యూఏఈ వీరికి వీసాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. రెసిడెన్సీ పరిమిట్లను మంజూరు చేసింది. యూఏఈ లోని షార్జా క్రికెట్ స్టేడియం సీఈవో ఖలాఫ్ బుక్తియార్ ఇందుకు సహకరించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లకు చాలా విషయాలలో శిక్షణకు సంబంధించి తన వంతు సహాయాన్ని అందజేసింది.