
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు తారస్థాయికి చేరాయి. 20 ఏళ్ల క్రితం ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామంటూ ఆఫ్ఘన్ లో ప్రవేశించిన అమెరికా సైన్యాలు స్వదేశానికి పయనమయ్యాయి. దీంతో.. తాలిబన్లు రెచ్చిపోతున్నారు. మళ్లీ ఆఫ్ఘన్ ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు వేగంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటి వరకూ తొమ్మిది ప్రావిన్సులకు చెందిన రాజధానలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. మిగిలిన ప్రాంతాలను సైతం తమ పరిధిలోకి తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. దేశ రాజధాని కాబూల్ ను కూడా గుప్పిట పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇన్నాళ్లూ అమెరికా సేనలు ఉండడంతో కాస్త మౌనంగా ఉన్న తాలిబన్లు.. ఇప్పుడు అడ్డుకునేవారే లేరంటూ రెచ్చిపోతున్నారు. తాజాగా.. నార్త్ లోని ఫుల్ – ఐ – ఖుమ్రీ, ఫైజాబాద్, పశ్చిమలోని ఫరా నగరాలు తమ సొంతమైనట్టు ప్రకటించుకున్నారు. ఈ పరిస్థితికి ముందే అక్కడి సర్కారు ప్రతినిధులు రాజధాని కాబూల్ కు వెళ్లిపోయారు. దేశంలో రాజధాని తర్వాత అత్యంత ముఖ్యమైన నగరం కుందుజ్ ను స్వాధీనం చేసుకోవడంతో.. అది అతి పెద్ద విజయం చెప్పుకుంటున్నారు తాలిబన్లు. ఇక, త్వరలోనే దేశం మొత్తం తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటామని చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితులతో ఆఫ్ఘనిస్తాన్ లో బీతావహ దృశ్యాలు నెలకొన్నాయి. ఎదిరించిన వారిని చంపడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. తాలిబన్లను ఎదుర్కొనేందుకు ఆఫ్ఘన్ దళాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. దీంతో.. ఆ దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. తమ దేశాల పౌరులను వెంటనే వెనక్కి రావాలని సూచిస్తున్నాయి. భారత్ సైతం ఈ మేరకు ఆదేశాలుజారీచేసింది. ఆఫ్గన్ నుంచి రాకపోకలు నిలిపేసేలోగా స్వదేశానికి వచ్చేయాలని సూచించింది.
కాగా.. 2001లో అమెరికాపై విమాన దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామంటూ ఆఫ్గన్ లో అమెరికన్ దళాలు ప్రవేశించాయి. అయితే.. గడిచిన 20 ఏళ్లలో లక్ష్యం ఏ మేరకు నెరవేరిందంటే.. శూన్యమనే చెప్పాలి. కానీ.. ఈ కాలంలో అమెరికాకు చాలా నష్టం జరిగింది. ఒక ట్రిలియన్ డాలర్లకుపైగా ఖర్చయ్యిందని అంచనా. అంతేకాదు.. వేలాది మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ.. తాలిబన్లను ఏమీ చేయలేకపోయారు. 398 జిల్లాలు ఉన్న ఆఫ్గనిస్తాన్ లో దాదాపు 200 జిల్లాలు తాలిబన్ల ఆధిపత్యంలోనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో తాలిబన్లకు – ఆఫ్ఘనిస్తాన్ సైనికులకు మధ్య పోరు కొనసాగింది. రెండు దశాబ్దాలు ప్రయత్నించినా.. ఏమీ చేయలేకపోవడంతో తమ బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించుకుంది. గతేడాది ఫిబ్రవరిలోనే అమెరికా-తాలిబన్ల మధ్య ఈమేరకు ఒప్పందం కుదిరింది.
తాలిబన్లకు పాకిస్తాన్ అండదండలు అందిస్తున్న నేపథ్యంలో.. అమెరికన్ సేనలు పూర్తిగా వైదొలిగితే.. తాలిబన్ల అరాచకాలు మళ్లీ పాత స్థితికి వచ్చేస్తాయనే ఆందోళన అప్పుడే వ్యక్తమైంది. సరిగ్గా ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుండడం గమనార్హం. అయితే.. ఈ పరిస్థితి అందరికన్నా భారత్ కే ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మత ప్రాతిపదికన భారత్ ను శత్రువుగానే చూస్తున్నారు తాలిబన్లు.
అయితే.. భారత్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. ఆ దేశంలో పార్లమెంట్ నిర్మించడం నుంచి.. ఎన్నో విధాలుగా సహకారం అందిస్తోంది. అయినప్పటికీ.. ఉగ్రవాద మూకలు భారత్ వ్యతిరేకంగానే పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరించడమే చేయాల్సింది.