Visakhapatnam: విశాఖ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళ్తున్న ఓ లారీని స్కూల్ ఆటో అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. రోడ్డుపై ఫల్టీలు కొట్టింది. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బుధవారం ఉదయం 9 గంటల సమయంలో జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి సిసి పూటేజీ వీడియో చూస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తోంది. స్కూల్ బస్సులతో పాటు ఆటోల్లో విద్యార్థుల తరలింపు విషయంలో నిర్లక్ష్య వైఖరి కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.
విశాఖలోని సంఘం శరత్ థియేటర్ సమీపంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో ఓ లారీ వెళ్తోంది. అదే సమయంలో సిరిపురం వైపు స్కూల్ విద్యార్థులతో వెళుతున్న ఆటో బలంగా వచ్చి ఢీ కొట్టింది. రోడ్డుపైనే మూడు పల్టీలు కొట్టింది. విద్యార్థులు రోడ్డుపై పడడంతో బలమైన గాయాలయ్యాయి. రహదారి రక్తసిక్తంగా మారింది. వెంటనే గమనించిన స్థానికులు హుటాహుటిన విద్యార్థులను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా నగరంలోని బేతలి స్కూల్ లో చదువుతున్నట్టు సమాచారం. మరోవైపు విశాఖ శివారులలోని మధురవాడలో ఆటో బోల్తా పడిన ఘటనలో మరో ఎనిమిది మంది విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో స్కూల్ బస్సులు ప్రమాదానికి గురికావడం నిత్య కృత్యంగా మారింది. కండిషన్లలో లేని బస్సులు, నైపుణ్యం లేని డ్రైవర్లు వాహనాలు నడుపుతుండడంతో తరచూ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాల బస్సులకు అనుమతి తప్పనిసరి. రవాణా శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించాలి. అటు డ్రైవర్ నైపుణ్యం సైతం పరీక్షించాలి. బస్సుల్లో భద్రతా చర్యలు చేపట్టాలి. కానీ అటువంటివేవి కనిపించడం లేదు. ఫిట్నెస్ పరీక్షలు సైతం సక్రమంగా జరగడం లేదు. లైట్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారితో వాహనాలు నడిపిస్తున్నట్లు ఎక్కడికక్కడే ఫిర్యాదులు వస్తున్నాయి. అయినా సరే ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించడం లేదు.
నగరాలు, గ్రామాల్లో పాఠశాల విద్యార్థులు ఆటోలపై వెళ్తున్నారు. ఆ సమయంలో కనీస భద్రతా చర్యలు చేపట్టడం లేదు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నారు. అతివేగంతో వాహనాలను నడుపుతున్నారు. ఈ కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట స్కూల్ బస్, విద్యార్థులను తరలిస్తున్న ఆటో ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నాయి. అయినా సరే రవాణా శాఖ కఠిన చర్యలు ఉత్పక్రమించడం లేదు. ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.