Pawan Kalyan
Pawan Kalyan: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి దిగబోతున్నారు. బీజేపీతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారితోపాటు, బీజేపీ అభ్యర్థుల తరఫున పోటీ చేయడానికి జనసేనాని రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో బీజేపీతో..ఏపీలో టీడీపీతో కొనసాగుతున్న పవన్ ఇప్పుడు నేరుగా ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. పవన్ తన ప్రచారంలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తారా..రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుంటారా. బీజేపీతో సహా ఏపీలోనూ ఇదే ఆసక్తి కొనసాగుతోంది. పవన్ ప్రచారం.. ఫలితం ఆధారంగా ఏపీలో పొత్తులు..సమీకరణాలు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
బుధవారం నుంచి ప్రచారం..
తెలంగాణలో బీజేపీ – జనసేన అభ్యర్థులకు మద్దతుగా పవన్ కల్యాణ్ బుధవారం నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నారు. జనసేన ఈ మేరకు ప్రచార షెడ్యూల్ ప్రకటించింది. వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక ప్రచార సభల్లో పవన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌లో ప్రచారం నిర్వహిస్తారు. గురువారం ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేట, మధ్యాహ్నం 3 గంటలకు దుబ్బాకలో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారు. టీబీజేపీతో పొత్తులో భాగంగా ఇచ్చిన 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలో ఉండగా ఈనెల 25న తాండూరులో.. 26న కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు.
టార్గెట్ ఎవరో..
ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న పవన్ తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. టీడీపీకి ఏపీలో మిత్రపక్షంగా ఉన్న పవన్ తెలంగాణలో టీడీపీ మద్దతుదారుల ఓట్లతో పాటుగా తెలంగాణలో స్థిరపడిన ఏపీ మూలాలు కలిగిన ఓటర్లను ఆకర్షించి..ఓట్లను సాధిస్తారని బీజేపీ ఆశలు పెట్టుకుంది. దీంతో తెలంగాణ ఎన్నికలు ఇప్పుడు పవన్ సమర్ధతకు పరీక్షగా మారుతోంది. జనసేనాని ఇక్కడ బీజేపీ ఆశల మేరకు సక్సెస్ అయితే, ఏపీలోనూ పవన్ కోరిన విధంగా పొత్తులకు బీజేపీ అంగీకరించే అవకాశం ఉంది. టీడీపీ మద్దతు ఓటింగ్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే..ఏపీలో పవన్ కోరుకుంటున్నట్లుగా పొత్తుల ఖరారైన ప్రభావం చూపటం ఖాయంగా కనిపిస్తోంది.
పవన్ పరీక్ష..
ఇక..ఎన్నికల ప్రచారంలో పవన్ ప్రధానంగా ఎవరిని టార్గెట్ చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌పై పవన్ ఎక్కడా ఘాటుగా స్పందించలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో బీజేపీకి ప్రత్యర్ధులుగా అటు సీఎం కేసీఆర్.. ఇటు కాంగ్రెస్ నేత రేవంత్ ఉన్నారు. టీడీపీ మద్దతు దారుల ఓట్లు దక్కించుకోవటంలో ఒక విధంగా రేవంత్ – పవన్ మధ్య పోటీ ఉంది. ఈ సమయంలో పవన్ తన ప్రచార సభల్లో సీఎం కేసీఆర్ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు.. రేవంత్ పైన ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారుతోంది.