Bangalore : కేరళ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు బెంగళూరులోని కృపానిధి కాలేజీలో చదువుతున్నాడు. ఆగస్టు 30న రాత్రి అతనిపై హడో సిద్దాపుర ప్రాంతంలోని సెయింట్ స్టీఫెన్స్ మార్తోమా చర్చి సమీపంలో సీనియర్లు దాడి చేశారు. అతడి కాలేజీలో చదువుతున్న సేవియర్, విష్ణు, శరత్ అనే ముగ్గురు సీనియర్లు, మరో ఎనిమిది మంది విద్యార్థులు ఆ విద్యార్థి పై దాడి చేశారు. పెరిగిన గడ్డాన్ని గీయించుకోవాలని.. మీసాలను కత్తిరించుకోవాలని ఒత్తిడి చేశారు. అతడు దానికి అంగీకరించకపోవడంతో వారు దాడి చేశారు.. ఆ యువకులు ఏప్రిల్ నెల నుంచి ఆ విద్యార్థి వెంటపడుతున్నారు. పెరిగిన మీసాలను, గడ్డం తొలగించుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాలేజీ క్యాంపస్ లో అనేకసార్లు అతనిపై ర్యాగింగ్ కు పాల్పడ్డారు. అయినప్పటికీ ఆ యువకుడు బయటకు చెప్పుకోలేదు.
దాడి జరిగే రోజు సాయంత్రం అతడిని ఒక చర్చి వద్దకు రావాలని ఓ సీనియర్ ఫోన్ చేశాడు. దీనిని ఊహించని అతడు అక్కడికి రూమ్ మేట్స్ తో కలిసి వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వెంటనే షేవింగ్ చేసుకోవాలని అతనిపై వారు ఒత్తిడి తీసుకొచ్చారు. దానికి అతడు అంగీకరించలేదు. అతని స్నేహితులు కూడా ఒప్పుకోలేదు. దీంతో వారు మూకుమ్మడిగా అతనిపై దాడి చేశారు. ఆ తర్వాత ఆ విద్యార్థి స్నేహితులు అతడిని ఆసుపత్రికి తరలించారు. గాయాలు తీవ్రంగా కావడంతో ఆ విద్యార్థి భుజానికి శస్త్ర చికిత్స చేశారు. అంతేకాదు ఆ విద్యార్థి కుటుంబాన్ని ఆ విద్యార్థులు ఆసుపత్రిలో బెదిరించారు. దీనిపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బెల్లందూర్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఆ విద్యార్థులపై కేసును నమోదు చేశారు. అయితే దీనిపై ఇంతవరకు కళాశాల యజమాన్యం స్పందించలేదు.
ఈ ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ఆ కళాశాల యాజమాన్యం పట్ల విద్యార్థులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ర్యాగింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేనిపక్షంలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో చదువుకునే విద్యార్థులకు గడ్డం, మీసాలతో పని ఏంటని.. ఎవరైనా విద్యార్థి ఇష్టంతో పెంచుకుంటే బలవంతంగా తీసేసేందుకు ప్రయత్నాలు చేస్తారా అంటూ మండిపడుతున్నారు. కళాశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటం సరికాదని చెబుతున్నారు. కళాశాలలో చదువుకునే విద్యార్థులు సోదర భావంతో మెలిగి ఉండాలని.. ఇలా ఇష్టానుసారంగా దాడులు చేసుకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం కూడా విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని హితవు పలుకుతున్నారు.