Priyal Chauragade tiger encounter: అది మహారాష్ట్ర.. పార్శివ్ని.. క్రూరమైన పులి.. అప్పటికే చాలా జంతువులను తినేసింది. అడవిలో ఆహారం లభించకపోవడంతో జనావాసాలలోకి వచ్చింది. పశువులను వరుసగా తినడం మొదలుపెట్టింది. పులి వరుసగా పశువులను చంపుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళనకు గురయ్యారు.
ఈ విషయం మీడియా ద్వారా నాగ్ పూర్ అటవీ శాఖకు తెలిసింది. అటవీ శాఖ అధికారులు ఆ పులిని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. దానిని ట్రాప్ చేయడానికి ట్రాప్ లు, కెమెరాలు ఏర్పాటు చేశారు. బోనులు కూడా అందుబాటులో ఉంచారు. అయినప్పటికీ ఆ పులి తప్పించుకునేది. అంతేకాదు రైతుల పశువుల మీద దాడులు చేసేది. ఇలా రోజులు గడుస్తున్నాయి. పులి మాత్రం దొరకడం లేదు. దీంతో స్థానికుల్లో ఆగ్రహం పెరిగిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించడంతో.. పులి వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయ నాయకులు అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడంతో ఆ పులిని పట్టుకోడానికి అధికారులు మరింత తీవ్రంగా కసరత్తు మొదలుపెట్టారు. దీనికోసం ఒక ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలోనే ఒక చెట్టు మీద మంచే ఏర్పాటు చేశారు.
ఆ మంచె మీద డాక్టర్ ప్రియల్ చౌరగడే కాపు కాయడం మొదలుపెట్టారు. ఆ మంచె మీద ప్రియల్ చౌరగడే అత్యంత కఠినమైన పరిస్థితిలో కూర్చున్నారు. గంటల తరబడి అక్కడే ఉన్నారు. తన ఉనికిని పులి గుర్తుపట్టకుండా ఉండడానికి ఆకులను కప్పుకున్నారు. చివరికి తన వద్ద ఉన్న రైఫిల్ లో టెలిస్కోప్ సైట్ కూడా తీసివేశారు. ఇలా 15 గంటల పాటు అలానే ఉన్నారు. చివరికి అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన ఎర వద్దకు పులి వచ్చింది. ఆ పులి తలభాగం మాత్రమే షాట్ కు అనుకూలంగా ఉంది. దీంతో మొదటి అవకాశం కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే అటవీశాఖ అధికారులు హెడ్ షాట్ లు నిషేధించారు.
ఇక ఈసారి సరైన అవకాశం కోసం ఆమె ఎదురు చూశారు. దీంతో ట్రంక్విలైజర్ డార్ట్ ను టార్గెట్ గా పెట్టారు. కేవలం ఒకే ఒక్క షాట్ తో పులి వెంటనే కింద పడిపోయింది. అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో అటవీ శాఖ అధికారులు పులిని బంధించారు. నాగపూర్ ప్రాంతంలోని ట్రాన్సిట్ రెస్క్యూ సెంటర్ కి తీసుకెళ్లారు. పెద్ద పెద్ద పురుష అధికారులు వెనుకడుగు వేసిన క్రమంలో.. క్రూరమైన పులికి ప్రియల్ చౌరగడే ఎదురు నిలిచింది. 15 గంటలపాటు అలాగే ఉండిపోయింది. చెట్టు మీద ఉన్న మంచె లో ఆకులు కప్పుకుంది. పులి కోసం ఎదురుచూసి.. దానిని ట్రాప్ లో పడేసింది. ప్రియల్ చౌరగడే చేసిన సాహసం మహిళల్లో ఉన్న ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. ప్రియల్ చౌరగడే నాగ్ పూర్ ప్రాంతంలోని ట్రాన్సిట్ ట్రీట్మెంట్ సెంటర్లో వెటర్నరీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు.