పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోమని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. చెప్పిన కారణాలు ఏమంటే ఇప్పటికే 7 రాష్ట్రాలు ఈ తరహా తీర్మానాలు చేశాయంట. అంటే మేమేదో మజ్లీస్ మాటలకు తలూపి చేయటం లేదు, ఇప్పటికే 7 రాష్ట్రాలు చేశాయి కాబట్టి మేమూ అదేబాటన నడుస్తున్నామని చెప్పాలనే తాపత్రయం అందులో కనబడింది. అందుకే మధ్యలో మజ్లీస్ కి మాకూ అన్ని విషయాల్లో సామీప్యత ఏమీలేదనే అంశాన్ని ప్రస్తావించారు. అలాగే మేము లౌకికతత్వానికి కట్టుబడ్డపార్టీ అనికూడా చెప్పటానికి ప్రయత్నించటం జరిగింది. ఈ బిల్లు లౌకిక తత్వానికి వ్యతిరేకం కాబట్టే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇక ఈ బిల్లు ఎంత ప్రమాదకారో చెప్పటానికి నాకు కూడా పుట్టినతేది ధ్రువపత్రం లేదని, ఇక పేదవాళ్లకు ఎక్కడినుంచి వస్తుందని ప్రశ్నించారు. అదేసమయంలో సరిహద్దుగోడ కట్టండి మద్దతిస్తామని కూడా చెప్పారు. కెసిఆర్ గారి వాదనలో ఎక్కడో కొంత భయం, తప్పుగా ఆలోచిస్తున్నాననే భావన ఉన్నట్లు కనబడుతుంది. అందుకే కేవలం మజ్లీస్ కి వత్తాసుగా మాట్లాడటం లేదని చెప్పటం , అసదుద్దీన్ ఒవైసీ , ఇతర మత పెద్దలకు మాట ఇచ్చినా మున్సిపల్ ఎన్నికలు అయ్యేదాకా నిర్ణయాన్ని వాయిదావేయటం ఇవన్నీ తనకున్న సందేహాలను చెప్పకనే చెప్పుతుంది. అదేమిటంటే ఇప్పటివరకూ ఎదురులేని తన రాజకీయ గుత్తాధిపత్యానికి ఈ చర్యతో దెబ్బతగులుతుందేమోననే భయం లోపల వుంది. బీజేపీ కి తనే చూస్తూ చూస్తూ పరోక్షంగా రాజకీయ బిక్ష పెడుతున్నానేమోననే సందేహం తొలుస్తోంది. అదేసమయంలో ఒవైసీ నుంచి వచ్చే ఒత్తిడిని ఎక్కువకాలం వాయిదావేయలేకపోవటం కూడా చివరకు తప్పని పరిస్థితుల్లో ఈ వైఖరి తీసుకునేటట్లు చేసిందని అనుకోవాలి. ఇక అసలు విషయానికొద్దాం.
పౌరసత్వ సవరణ చట్టంలో ఏముంది?
పొరసత్వ సవరణ చట్టం లో ఈ దేశ పౌరుల గురించి, లోకికతత్వాన్ని గురించి ఏమీ లేకపోవటం అందరికీ తెలిసిందే. దాన్నే రాజా సింగ్ తెలివిగా ఉపయోగించుకున్నాడు. ఈ చట్టం వలన ఏ ఒక్క భారతీయ పౌరుడికి నష్టం జరిగినా నేను రాజకీయాలనుంచి తప్పుకొని తెలంగాణ నుంచి వెళ్లిపోతానని చెప్పాడు. తను అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికీ సమాధానం చెప్పకుండానే కెసిఆర్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదింపచేసుకున్నాడు. నితీష్ కుమార్ లాంటి వాళ్ళు పౌరసత్వ చట్టాన్ని సమర్థిస్తూనే ఎన్ ఆర్ సి ని వ్యతిరేకించారు. అలాగే ఎన్ పి ఆర్ ని పాత పద్ధతుల్లో అయితేనే ఒప్పుకుంటానన్నాడు. అంటే ప్రతిఅంశాన్ని కూలంకషంగా పరిశీలించి సి ఎ ఎ ని పూర్తిగా సమర్ధిస్తూ , ఎన్ పి ఆర్ ని షరతులతో ఆమోదిస్తూ ఎన్ ఆర్ సి ని పూర్తిగా వ్యతిరేకించాడు. కెసిఆర్ మాట్లాడినదాంట్లో స్పష్టత కరువయ్యింది. ఆయన పుట్టిన తేదీ ధ్రువపత్రం ఈ పౌరసత్వ సవరణ చట్టం అమలు అయితే ఇవ్వాల్సివుంటుందా? ఇది ప్రజల్ని తప్పుదోవపట్టించటం కాదా? అసలు ఈ చట్టం తెలంగాణా ప్రజలకి ఏ విధంగా నష్టం? బంగ్లాదేశ్, పాకిస్తాన్ , ఆఫ్గనిస్తాన్ నుంచి మత వేధింపులకు గురయి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ చట్టం ప్రకారం పౌరసత్వం పొందవచ్చు. మిగతావాళ్ల గురించి ఈచట్టం మాట్లాడలేదు. ఈ చట్టం కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకొని అటువంటివాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి కెసిఆర్ పనిగట్టుకొని పుట్టినతేది ధ్రువపత్రం కోసం టెన్షన్ పడాల్సిన పనిలేదు. చట్టం ఇంత స్పష్టంగా ఉంటే దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్, మజ్లీస్ కూడా పోటీపడి వాళ్ళ లౌకికతత్వం కెసిఆర్ కన్నా ఏమీ తక్కువతినలేదని చెప్పుకోవటానికి ప్రయత్నం చేశారు.
అసెంబ్లీ లో మాట్లాడింది వింటే పౌరసత్వ సవరణ చట్టంలో వున్న ఏ క్లాజు భారతదేశ పౌరులకు నష్టం చేస్తుందో ఎక్కడా ఈ మూడుపార్టీల నాయకుల మాటల్లో విడమరిచి చెప్పలేదు, ఎప్పుడూ మాట్లాడే పడికట్టు పదజాలం ఒకరిమీద ఒకరు పోటీగా మాట్లాడటం తప్ప. రెండోది ఎన్ పి ఆర్ ( జాతీయ జనాభా రిజిస్టర్ ) లో ఎక్కడా ఎటువంటి ధ్రువపత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. వివరాలు చెప్పటం మన బాధ్యత. అది మన ప్రభుత్వ పధకాల అమలుకు ఉపయోగపడుతుంది. అదనంగా ఇవ్వాల్సిన సమాచారం లో తప్పేంటో అర్ధంకావటంలేదు. మీరు కానీ, మీ తల్లిదండ్రులు కానీ ఎక్కడినుంచి వచ్చారో వివరాలు ఇవ్వటం వలన మీకొచ్చిన నష్టమేమిటో వివరిస్తారా? అంటే మీ కుటుంబ వివరాలు అడిగితే లౌకికతత్వం దెబ్బతింటుందా? ఇంత మూర్ఖంగా ఆలోచించే మేధావులు కూడా వుంటారా? ప్రతిసంవత్సరం ప్రభుత్వం విడుదలచేసే లెక్కల్లో వలస కుటుంబాలు, కార్మికులు ఎంతమందో వివరాలు ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్ లో అసంఘటిత రంగం లో ఎంతోమంది ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర భాషల వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళందరి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంటే పధకాల అమలులో , ప్రణాళిక రచనలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో పేదలకు అన్యాయం ఎక్కడో చెప్పాలి. వాస్తవానికి పేదలకు న్యాయం జరుగుతుంది. దీన్ని వ్యతిరేకించి పేదలకు అన్యాయం చేసినవాళ్లు అవుతున్నారు. అయినా ఇందులో మీరు ఎటువంటి ధ్రువపత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక మూడోది ఎన్ సి ఆర్ ( జాతీయ పౌరసత్వ రిజిస్టర్ ). దీనిపై వున్నదీ లేనిది కల్పించి అసత్యాలు, అపోహలు ప్రచారం చేస్తున్నారు. అసలు ఇది ఎలావుంటుందో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం ఇంతవరకు దీనిపై విధివిధానాలు కానీ , కనీసపు అవగాహనా సదస్సులు గానీ, కనీసం బేస్ వర్క్ కానీ మొదలుపెట్టలేదు. కేవలం అమిత్ షా వెలిబుచ్చిన అభిప్రాయం తప్ప. ఈ విషయం స్వయంగా ప్రధానే చెప్పాడు. ఎలావుంటుందో తెలియనిదాన్ని గురించి చిలవలు పలవలు అల్లి పుట్టినతేది ధ్రువపత్రం లేకపోతే పౌరులు కాకుండా పోతారని ప్రజల్లో భయాందోళనలు రెచ్చగొట్టటం కెసిఆర్ లాంటి రాజ్యాంగ పదవుల్లో వున్న వ్యక్తులకు తప్పుగా అనిపించటం లేదా? ఆధారాలు లేని ఆరోపణలు చేసి ప్రజల్ని రెచ్చగొట్టటం బాధ్యతారాహిత్యం కాదా? అస్సాం లో కొన్ని చారిత్రక కారణాల వలన జరిగిన ఒప్పందాన్ని ఆధారం చేసుకొని తయారుచేసిన జాతీయ పౌరసత్వ పట్టిక కు ఈ ప్రక్రియకు సంబంధం లేదని ప్రభుత్వం పదే పదే వివరణ ఇచ్చినా ఆ పట్టిక తయారీలో లోపాలనే ఎత్తిచూపి లబ్దిపొందాలనుకోవటం ఉద్దేశపూర్వక అబద్ద ప్రచారం కాదా? ఎన్ సి ఆర్ పై వైఖరిని ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందులో అంశాల్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి నోట్లో శని లాగా వుంది ఈ వ్యవహారం.
దీనివెనుక అసలు ఉద్దేశం ఏమిటి?
పౌరసత్వ సవరణ చట్టం భారతీయులకు వర్తించకపోయినా ఎందుకింత ఆందోళన జరుగుతుంది? ఒక్కసారి పరిస్థితుల్ని లోతుగా పరిశీలిస్తే గానీ సమస్య అర్ధం కాదు. ఈ మూడు ఇస్లామిక్ దేశాలనుంచి వచ్చినవాళ్లలో మైనారిటీలు కానివాళ్ళకు కూడా ఈ చట్టం వర్తించాలనేది ఇక్కడున్న ముస్లిం మత పెద్దల మనోభావం. చారిత్రక పరిస్థితులతో ముడిపెట్టకుండా అందరికీ ఇస్తే తోటి ముస్లిం సోదరులకు కూడా మేలుజరుగుతుందనేది వీళ్ళ భావన. ఇది దేశాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా వున్నముస్లిం బ్రదర్ హుడ్ సంఘీభావం. ఇకపోతే రెండో వర్గం విద్యార్థులు, ఉదారవాదులు. వీళ్ళ ఉద్దేశాన్ని శంకించాల్సిన అవసరం లేదు. కాకపోతే చరిత్ర లో తప్పులు జరిగినా ప్రస్తుతం అందరినీ సమభావం తో చూడాలనే వాదన. వామపక్ష తీవ్రవాదం వీళ్లపై ప్రభావం చూపుతుంది. ఇక మూడో వర్గం రాజకీయవర్గం. వీళ్ళు అవకాశవాదులు. ఏ ఎండకా గొడుగు పట్టగలరు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ఒకమాట, అధికారం లో వున్నప్పుడు ఇంకోమాట మాట్లాడగల మాటకారులు. బెంగాల్ లోని ఈ బంగ్లాదేశ్ శరణార్ధులకు పౌరసత్వం కల్పించాలని ఒకనాడు పార్లమెంటు లో బయటా మాట్లాడినవాళ్ళే ఇప్పుడు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముమ్మూరు తలాక్ చట్టం విషయం లో కుంటిసాకులు చెప్పి వ్యతిరేకించినట్లే ఇప్పుడూ లౌకికతత్వం పేరుతో ముస్లింలను రెచ్చగొడుతున్నారు. ఈ వర్గం మాటల్ని పట్టించుకోవాల్సిన పనిలేదు. రెండోవర్గం లోని విద్యార్థులకు చారిత్రక నేపధ్యాన్ని వివరించి దారికి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతయినా వుంది. ఇక మొదటివర్గం అసలు లౌకిక వాదాన్ని నమ్మని వర్గం. ఏ మాత్రం అవకాశం దొరికితే షరియత్ చట్టాన్ని అమలుచేయాలనే వర్గం. ముస్లిం ప్రజానీకంలో ఆధునిక భావాలు వ్యాప్తిచెందకుండా మత మౌఢ్యం వైపు నడిపించాలని తాపత్రయం పడుతున్న , ఇప్పటికీ ముస్లిం ప్రజల్లో పట్టున్న వర్గం. భారత ఉపఖండం లో ప్రఢవిల్లిన సూఫీ విశ్వాసాన్ని దెబ్బతీస్తూ గత రెండు, మూడు దశాబ్దాల్లో వ్యాప్తిచెందుతున్నవహాబీజం ప్రభావం వీరిపై ఎక్కువగా వుంది. ఈవర్గం ముస్లిం ప్రజానీకాన్ని ఇంకా వెనక్కు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. ముస్లింలలో వున్న అభ్యుదయ , ఉదారవాదులు ( ఎంత తక్కువమంది వున్నా ) ఈ మారుతున్న పరిణామాలను గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. షహీన్ బాగ్ నిరసనల వెనక ఈ మూడువర్గాల ప్రజలు వున్నారు. పౌరసత్వ సవరణ చట్టం లో భారతీయ ముస్లింలకు ఎటువంటి నష్టం లేదని వీళ్ళందరికీ తెలుసు. అయినా ఎందుకు ఆందోళన చేస్తున్నారంటే దీన్ని అడ్డంపెట్టుకొని ముస్లిం లలో ‘ చైతన్యం, సంఘటితం ‘ తీసుకురావాలనే వాళ్ళు, నిజంగానే వివక్ష ఉండకూడదనే వాళ్ళు, దీన్ని అవకాశంగా తీసుకొని మోడీకి వ్యతిరేకంగా రాజకీయ పబ్బం గడుపుకోవాలనే వాళ్ళు ఎవరి ప్రయోజనాలు వారివి. చివరకిది రెండువైపులా ఉద్రిక్తతలు పెరిగి ఢిల్లీ అల్లర్లకు దారితీయటం మనందరికీ తెలిసిందే.
కెసిఆర్ పప్పులో కాలేశాడా?
మరి ఇందులో కెసిఆర్ లాంటి రాజకీయ చాణుక్యుల ఉద్దేశాలేంటి? నిజం చెప్పాలంటే తను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లయింది. ఓట్లకోసం మజ్లీస్ తో అంటకాగి ఇన్నాళ్లు నడిచినతర్వాత వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. నిజానికి కెసిఆర్ కి ఇప్పుడు మజ్లీస్ మద్దత్తు లేకపోయినా తనకొచ్చిన ముప్పేమీలేదు. అధికారం లోకి వచ్చిన కొత్తలో ఆ అవసరం ఉందికాని ఇప్పుడు ఆ బంధమే గుదిబండ అయ్యింది. ఒవైసీ సోదరులను పక్కన పెట్టుకొని లౌకికవాదం గురించి మాట్లాడుతుంటే వినేవాళ్లకు వెగటుగా వుంది. ఇదే అక్బరుద్దీన్ ఒవైసీ ఒకనాడు నిర్మల్ సభలో మాట్లాడింది ప్రజలు మర్చిపోలేదు. అలాగే నిన్నటికి నిన్న ఇంకో మజ్లీస్ నాయకుడు వారిస్ పఠాన్ కలబుర్గిలో మాట్లాడింది ప్రజలకు గుర్తే వుంది. కెసిఆర్ గారు ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో కపిల్ మిశ్ర , అనురాగ్ ఠాకూర్ గురించి ఉటంకించాడు కాని వారిస్ పఠాన్ గురించి మాట్లాడలేదు. కపిల్ మిశ్రా , అనురాగ్ ఠాకూర్లది ఎంత తప్పో అమానుతుల్లా ఖాన్, వారిస్ పఠాన్లు మాట్లాడింది కూడా అంతే తప్పు. లౌకికవాదమంటే ఒకర్ని విమర్శించి రెండోవాళ్ళను వెనకేసుకోవటం కాదు. సభలోనే అక్బరుద్దీన్ ని మీ పార్టీ కూడా పద్ధతులు మార్చుకోమని చెప్పుంటే ప్రజలు కెసిఆర్ లౌకిక వాదాన్ని హర్షించేవాళ్ళు. ఇందులో కెసిఆర్ పప్పులో కాలేసాడనే అనిపిస్తుంది. కుహనా లౌకికవాదం పేరుతో బీజేపీ ప్రచారం చేయటానికి కెసిఆర్ ఈ తీర్మానంతో పెద్ద అస్త్రమే ఇచ్చాడనిపిస్తుంది. ఎంతపెద్దవాళ్లయినా ఎక్కడో అక్కడ పప్పులో కాలేస్తారంటే ఇదేమరి. ఇప్పటికైనా సమయం మించిపోయిందిలేదు. ఇప్పటికైనా ఎంతతొందరగా మజ్లిస్ తో తెగతెంపులు చేసుకుంటే అంత మంచిది. లేకపోతే మొదటికే మోసమొస్తుంది కెసిఆర్ గారూ , తస్మాత్ జాగ్రత్త.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Self goal by kcr by passing assembly resolution
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com