Sankaran Nair
Sankaran Nair: భారత స్వాతంత్య్ర సమరంలో(Fredom Fight) అనేక మంది వీరులు తమ జీవితాలను అర్పించి దేశానికి స్వేచ్ఛను సంపాదించారు. అయితే, కొందరు మహోన్నత వ్యక్తులుగా ఇప్పటికీ కీర్తి పొందుతున్నారు. కానీ, కొందరు కాలక్రమంలో చరిత్ర పుటల నుంచి మరుగునపడిపోయారు. అలాంటి వారిలో ఒకరు చెట్టూరు శంకరన్ నాయర్. జలియన్‌వాలా బాగ్ ఊచకోత దుర్ఘటన తర్వాత తన సాహసోపేతమైన చర్యలతో జాతీయవాద ఉద్యమంలో చెరగని ముద్ర వేశారు.
Also Read: పవన్ కళ్యాణ్ పై నోరుపారేసుకున్న కవిత
భారత స్వాతంత్ర సంగ్రామం సుమారు అర్ధ శతాబ్దం పాటు హోరాహోరీగా సాగింది. ఇందులో అనేక మంది అసువులు బాశారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భరత మాత విముక్తి కోసం రక్త తర్పణం చేశారు. ఇక కొందరు బ్రిటిషన్ పాలకుల వద్ద పనిచేస్తూనే వారిపైనే తిరుగుబాటు చేశారు. అలాంటి వారిలో చెట్టూరు శంకరన్ నాయర్(Chettur Shanran Nayar) ఒకరు. 1857 జూలై 11న కేరళ(Kerala)లోని పాలక్కాడ్ జిల్లా మంకర గ్రామంలో ఒక ప్రముఖ చెట్టూరు కుటుంబంలో జన్మించిన శంకరన్ నాయర్, తన బాల్యంలోనే అసాధారణ ప్రతిభను చాటుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో విద్యను ప్రారంభించిన ఆయన, కోజికోడ్‌లోని ప్రొవిన్షియల్ స్కూల్ నుంచి ఆర్ట్స్ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదివి 1877లో ఆర్ట్స్ డిగ్రీ, 1879లో మద్రాస్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర డిగ్రీ పొందారు. 1880లో మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, త్వరలోనే తన న్యాయ పరిజ్ఞానంతో పేరు సంపాదించారు. 1906లో మద్రాస్ అడ్వకేట్ జనరల్‌గా నియమితులై, 1908లో మద్రాస్ హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. శంకరన్ నాయర్ న్యాయవాదిగా హిందూ మతంలోకి మారిన వారిని సమాజం నుంచి వెలివేయరాదని ఇచ్చిన తీర్పు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ తీర్పు సామాజిక సంస్కరణలకు ఆయన నిబద్ధతను చాటింది. అంతేకాదు, ఆయన మద్రాస్ రివ్యూ, మద్రాస్ లా జర్నల్‌లను స్థాపించి సంపాదకుడిగా కూడా వ్యవహరించారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకైన పాత్ర
శంకరన్ నాయర్ కేవలం న్యాయవాదిగా, జడ్జిగా మాత్రమే కాకుండా, స్వాతంత్య్ర ఉద్యమం(Fredom Fight)లోనూ కీలక పాత్ర పోషించారు. 1885లో స్థాపితమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC)లో చేరిన ఆయన, 1897లో అమరావతి సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటివరకు అతి చిన్న వయసులో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఏకైక మలయాళీ నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఆ సమావేశంలో ఆయన బ్రిటీష్(British) పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ, భారతదేశానికి డొమినియన్ స్థాయిలో స్వయం ప్రతిపత్తిని డిమాండ్ చేశారు. 1902లో వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఆయనను రాలీ యూనివర్సిటీ కమిషన్ సెక్రటరీగా నియమించారు. ఈ సేవలకు గానూ 1904లో కంపానియన్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (CIE), 1912లో నైట్‌హుడ్ గౌరవాలను పొందారు. 1915లో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో విద్యా శాఖ సభ్యునిగా నియమితులై, భారతీయుడిగా అత్యున్నత పదవిని అలంకరించారు. ఈ సమయంలో ఆయన రాజ్యాంగ సంస్కరణలపై రెండు ప్రసిద్ధ విభిన్నాభిప్రాయ నోట్‌లను (Minutes of Dissent) సమర్పించి, బ్రిటీష్ పాలనలోని లోపాలను ధైర్యంగా ఎత్తిచూపారు. ఈ సంస్కరణలు భారతీయులకు పరిమిత స్వయం ప్రతిపత్తిని కల్పించిన మోంటాగ్యూ–చెంస్‌ఫోర్డ్ రిఫార్‌మ్స్‌కు దారితీశాయి.
జలియన్‌వాలా బాగ్ ఘటన తర్వాత..
1919 ఏప్రిల్ 13న అమృతసర్‌లోని జలియన్‌వాలా బాగ్(Jalianwalabag)లో జరిగిన ఊచకోత భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక దుర్ఘటన. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా సమావేశమైన వేలాది మంది అమాయకులపై జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాల మేరకు సైనికులు కాల్పులు జరిపారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ దారుణ సంఘటన శంకరన్ నాయర్‌ను తీవ్రంగా కలిచివేసింది. అప్పటికి వైస్రాయ్ కౌన్సిల్‌లో ఏకైక భారతీయ సభ్యుడిగా ఉన్న ఆయన, ఈ అమానవీయ చర్యను నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా బ్రిటీష్ ప్రభుత్వాన్ని కుదిపేసింది. శంకరన్ నాయర్ నిర్ణయం కారణంగా పంజాబ్‌లో విధించిన పత్రికా సెన్సార్‌షిప్ ఎత్తివేయబడింది, మార్షల్ లా రద్దు చేయబడింది. అంతేకాదు, ఈ ఘటనపై విచారణకు లార్డ్ విలియం హంటర్ నేతత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ చర్యలు జలియన్‌వాలా బాగ్ నరమేధాన్ని ప్రపంచం ముందు బహిర్గతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి.
లండన్‌లో చట్టపరమైన సవాల్
శంకరన్ నాయర్ తన పోరాటాన్ని ఇక్కడితో ఆపలేదు. 1922లో ఆయన రచించిన Gandhi and Anarchy అనే పుస్తకంలో జలియన్‌వాలా బాగ్ ఊచకోతకు బాధ్యుడిగా అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓడయ్యర్‌ను నేరుగా ఆరోపించారు. ఈ పుస్తకంలో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విమర్శిస్తూనే, బ్రిటీష్ పాలన యొక్క అమానవీయ చర్యలను కూడా బహిర్గతం చేశారు. ఈ రచన ఓ డయ్యర్‌ను కలవరపరిచింది, దీంతో ఆయన శంకరన్ నాయర్‌పై లండన్‌లో అపవాదు కేసు దాఖలు చేశారు. 1923లో జరిగిన ఈ కేసు ఐదు వారాల పాటు కొనసాగింది, ఇది బ్రిటీష్ చట్ట చరిత్రలో అత్యంత పొడవైన పౌర విచారణల్లో ఒకటిగా నిలిచింది. లండన్‌లోని కింగ్స్ కోర్టులో జరిగిన ఈ విచారణలో జ్యూరీలో 11 మంది ఓ డయ్యర్‌కు అనుకూలంగా ఓటు వేయగా, ఒక్క హెరాల్డ్ లాస్కీ మాత్రమే శంకరన్ నాయర్‌కు మద్దతిచ్చారు. జ్యూరీ ఏకగ్రీవంగా తీర్పు ఇవ్వలేదు కాబట్టి మరో విచారణ అవకాశం ఇచ్చారు. అయితే, శంకరన్ నాయర్ మరో బ్రిటీష్ జ్యూరీ నిర్ణయంపై నమ్మకం లేక, క్షమాపణ చెప్పే బదులు 7,500 పౌండ్ల (అప్పటి విలువలో భారీ మొత్తం) జరిమానా చెల్లించడాన్ని ఎంచుకున్నారు. ఈ కేసు ఆయనకు చట్టపరంగా ఓటమిని తెచ్చినప్పటికీ, జలియన్‌వాలా బాగ్ దుర్ఘటనను ప్రపంచవ్యాప్తంగా బహిర్గతం చేయడంలో నైతిక విజయాన్ని సాధించింది.
సామాజిక సంస్కరణలకు నిబద్ధత
శంకరన్ నాయర్ కేవలం రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, సామాజిక సంస్కర్తగా కూడా గణనీయమైన కృషి చేశారు. బాల్య వివాహాల నిర్మూలన, కుల వ్యవస్థ నిర్మూలన, తక్కువ ఆదాయ వర్గాలకు ప్రాథమిక విద్య అందించడం, మహిళల సమానత్వం వంటి అంశాలకు తన వంతు మద్దతు అందించారు. మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా 1896లో మలబార్ మ్యారేజ్ యాక్ట్ ఆమోదానికి దోహదపడ్డారు, ఇది స్థానిక సంఘ సంస్కరణలకు ఊతమిచ్చింది.
అయితే, ఆయన గాంధీజీ సహాయ నిరాకరణ, అసహాయక ఉద్యమాలను విమర్శించారు. ఈ ఉద్యమాలు హింసాత్మక అల్లర్లకు దారితీస్తాయని, రాజ్యాంగ పరమైన పోరాటమే సరైన మార్గమని ఆయన నమ్మారు. ఈ వైఖరి కారణంగా కాంగ్రెస్‌లోని కొందరు నాయకులతో ఆయనకు భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి, ఫలితంగా ఆయన క్రమంగా రాజకీయ కేంద్ర బిందువు నుంచి తప్పుకున్నారు.
చిరస్థాయి వారసత్వం
శంకరన్ నాయర్ తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. బ్రిటీష్ అధికారులు ఆయనను ‘సమస్యాత్మక వ్యక్తి‘గా భావించారు, మద్రాస్‌లోని కొందరు బ్రాహ్మణ నాయకులు ఆయన సంస్కరణవాద వైఖరిని వ్యతిరేకించారు. అయినప్పటికీ, ఆయన తన సూత్రాలకు కట్టుబడి, దేశ స్వాతంత్య్రం, సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేశారు. 1920–21లో లండన్‌లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ కోసం కౌన్సిలర్‌గా, 1925 నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యుడిగా కూడా సేవలందించారు.
1934లో చెన్నైలో శంకరన్ నాయర్ మరణించారు, కానీ ఆయన వదిలివెళ్లిన వారసత్వం చిరస్థాయిగా నిలిచింది. గురువాయూర్ ఆలయం వద్ద 300 వత్తులతో కూడిన 30 అడుగుల దీపస్తంభం ఆయన స్మృతిని ఇప్పటికీ గుర్తుచేస్తుంది. అంతేకాదు, ఆయన కుటుంబం స్థాపించిన చెట్టూరు శంకరన్ నాయర్ ఫౌండేషన్ సామాజిక, సాంస్కృతిక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
శంకరన్ నాయర్ జీవితం ధైర్యం, నిజాయితీ, సంస్కరణలకు నిదర్శనం. ఆయన చరిత్రలో తగిన గుర్తింపు పొందకపోయినప్పటికీ, జలియన్‌వాలా బాగ్ నరమేధాన్ని బహిర్గతం చేసిన ఆయన త్యాగం, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచింది.
Also Read: ఛీ మారరు.. పవన్ కుమారుడుపై చీప్ కామెంట్స్.. పోలీసులు సీరియస్!
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Sankaran nair hero of independence movement
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com