CM Jagan Review Meeting: మింగ మెతకులేదు..మీషానికి సంపంగి నూనె అన్నట్టుంది ఏపీలో సీఎం జగన్ దుస్థితి. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదు కానీ.. సచివాలయాలనికి రూ.20 లక్షల చొప్పన నిధులు కేటాయిస్తామని చెబుతుండడం విస్తుగొల్పుతోంది. నియోజకవర్గానికి రూ.2 కోట్లు అందిస్తాం. అభివృద్ధి పనులను పరుగులెత్తించండి అంటూ ఆరు నెలల కిందట జగన్ ప్రకటించారు. కానీ ఇంతవరకూ అతీగతీ లేదు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ముందు సీఎం జగన్ ఎమ్మెల్యేలకు వర్కుషాపు నిర్వహించారు. నియోజకవర్గానికి రూ.2 కోట్లు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో సదరు ఎమ్మెల్యేలు ఉబ్బితబ్బిబయ్యారు. అయితే రోజులు కాస్తా.. నెలలు అయ్యాయి. కానీ ఇంతవరకూ నిధుల జాడలేదు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు అధికారులను అడుగుతుంటే జీవోలే రాలేదని చెబుతున్నారు. రాష్ట్రస్థాయి అధికారులను అడుగుతుంటే పొంతన లేని మాటలు చెబుతున్నారు. కలెక్టర్ ఖాతాల్లో నిధులు సేఫ్ గా ఉన్నాయంటున్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న మాట మాత్రం చెప్పడం లేదు. దీంతో ఎమ్మెల్యేలు రూ.2 కోట్ల నిధులపై ఆశలు వదులుకున్నారు. ప్రజలు వచ్చి ఏ చిన్న సమస్య చెబుతున్నా చేయలేకపోతున్నామని తెగ బాధపడిపోతున్నారు. ఈ సమయంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎలా వెళ్లేది అంటూ ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా ప్రజల్లోనే ఉండాలని అధినేత జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. అటు నిధులు చూస్తే మాత్రం ఇవ్వడం లేదు. రహదారులు బాగుచేయడం లేదు. మౌలిక వసతులు కల్పించడం లేదు. దీంతో ప్రజల వద్దకు వెళుతుంటే నిరసనలు, నిలదీతలు ఎదురవుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు పడుతున్న బాధ మాత్రం వర్ణనాతీతం. ఎంతో ఊహించుకుంటే పరిస్థితి ఇంతలా దిగజారిపోతున్నదేమిటి? అని వాపోతున్నారు.
ఎలా గ్రాఫ్ పెంచుకోవాలి?
తాజగా జగన్ మరోసారి వర్కుషాపు నిర్వహించారు. ఎమ్మెల్యేలకు స్ఫష్టమైన హెచ్చరికలు పంపారు. ఆరు నెలల్లో అభ్యర్థులను తేల్చేస్తానన్నారు. ప్రజల్లో గ్రాఫ్ పెరగకపోతే తొలగింపు ఖాయమని తేల్చేశారు. అయితే తాము ఎలా గ్రాఫ్ పెంచుకోలగమని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. అసలు గ్రామ, వార్డు వలంటీర్లకు ఉన్న పవరు కూడా తమ దగ్గర లేదని.. అసలు చేతిలో నిధులు లేకపోతే మేము ఎలా పనిచేస్తామంటున్నారు.
Also Read: Presidential Polls 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ కీలకంగా మారిందా?
చిన్న చిన్న సమస్యలు విన్నవించే వారికి సైతం పరిష్కార మార్గం చూపించలేని దయనీయ స్థితిలో ఉన్నామని చెబుతున్నారు. కిందిటి వర్కు షాపులో నియోజకవర్గానికి రూ.2 కోట్లు కేటాయిస్తామని సీఎం చెప్పారని.. కానీ ఇంతవరకూ నిధులు జమ చేయలేదని.. ఈ మధ్యలో వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు మీట నొక్కిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మీట నొక్కేందుకు డబ్బులు ఉన్నాయి.. కానీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడానికి లేవా? అంటూ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అటువంటప్పుడు సీఎం గ్రాఫే పెరుగుతుంది తప్ప.. తమ గ్రాఫు ఎలా పెంచుకోగలమని ప్రశ్నిస్తున్నారు.
మొత్తం రూ.22 కోట్లు…
సీఎం జగన్ ఈ సారి సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున కేటాయించనున్నట్టు తెలిపారు. ఒక నియోజకవర్గంలో తక్కువలో తక్కువ 100 వరకూ సచివాలయాలుంటాయి. ఈ లెక్కన రూ.20 కోట్లు అన్నమాట. దీనికితోడు ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు కలుపుకొని సరాసరి రూ.22 కోట్లు అన్నమాట. ఈ నిధులు కానీ విడుదలైతే మాత్రం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగుపెట్టించవచ్చని వైసీపీ నేతలు సంబరపడుతున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తుందా? లేదా? అని అనుమానిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రభుత్వ భవనాల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టి చేతులు కాల్చుకున్నారు. బిల్లుల చెల్లింపులు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొందరు సొంత ప్రభుత్వంపైనే కోర్టకు వెళుతున్నారు. అయితే కోర్టు ఆదేశాలు సైతం బేఖాతరైన సందర్భాలున్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అసలు ప్రభుత్వానికి నిధులు మంజూరుచేసే ఉద్దేశ్యం ఉందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే తాజాగా సచివాలయానికి రూ.20 లక్షల నిధులు అనే మాటను కూడా ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు అయితే ముందుగా రూ.2 కోట్లు విడుదల చేయండి… దానికే అతీగతీ లేదు..సచివాలయానికి రూ.20 లక్షలు ఉత్తమాటేనని అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు.
Also Read:Political Surveys in Telangana: సర్వే షాకింగ్: టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లకు అదే అర్థమైంది?