TMC Split Crisis: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 28 ఏళ్ల ప్రస్థానం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఇప్పటివరకు ఎదుర్కొనని తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఎదుర్కొంటోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీలో చెలరేగిన అసంతృప్తి, ఒక కొత్త ఎమ్మెల్యే నేతృత్వంలో భారీ తిరుగుబాటుగా మారింది. 80 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 60 మంది మద్దతుతో రీతాబ్రత్ బెనర్జీ ప్రతిపక్ష నేతగా ఎదగడం టీఎంసీ చరిత్రలోనే అసాధారణ ఘటన.
ఎవరీ రీతాబ్రత్ బెనర్జీ..?
’రీతాబ్రత్ బెనర్జీ 1979 నవంబర్ 15న న్మించాడు. విద్యార్థి రాజకీయాల ద్వారా రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. ఎస్‌ఎఫ్‌ఐ కీలక నాయకుడిగా ఎదిగి, సీపీఎం యువజన విభాగంలో సుమారు ఎనిమిది ఏళ్లు చురుగ్గా పని చేశారు. 34 ఏళ్ల వయసులోనే రాజ్యసభకు ఎన్నికై జాతీయ స్థాయి గుర్తింపు సాధించారు. అయితే 2017లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో సీపీఎం నుంచి బహిష్కరించబడ్డారు. తర్వాత టీఎంసీలో చేరి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకమయ్యాడు. ఇటీవలి ఎన్నికల్లో ఉలుబేరియా పూర్వ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పై సుమారు 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
తిరుగుబాటుకు మూల కారణాలు..
టీఎంసీలో తిరుగుబాటు సిద్ధాంతపరమైనది కాదు. ఇది నాయకత్వం, అధికార పంపకాలు నిర్ణయాల కేంద్రీకరణపై ఉన్న తీవ్ర అసంతృప్తి నుంచి ఉద్భవించింది. ఎన్నికల ఓటమి తర్వాత మమతా బెనర్జీ నివాసంలో జరిగిన కీలక సమావేశానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం, ఆమె నిర్వహించిన బహిరంగ నిరసన కార్యక్రమానికి తక్కువ హాజరు ఇవి పార్టీలో లోతైన విభేదాలను బయటపెట్టాయి. ముఖ్యంగా మమతా–అభిషేక్ బెనర్జీ ద్వయం చేతుల్లో నిర్ణయాలు పూర్తిగా కేంద్రీకృతం కావడం, సీనియర్, మధ్యస్థ స్థాయి ఎమ్మెల్యేలు సైడ్‌లైన్ అవుతున్నారనే భావన బలంగా పెరిగింది.
టర్నింగ్ పాయింట్ ఇదే..
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నియామకం విషయంలో వచ్చిన గందరగోళం ఈ సంక్షోభానికి కేంద్ర బిందువు. సంతకాల ఫోర్జరీ ఆరోపణలు, ఫిర్యాదులు, బహిష్కరణలు ఈ క్రమంలో రీతాబ్రత్ బెనర్జీతో పాటు మరికొందరిని పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే ఇది తిరుగుబాటు వర్గాన్ని మరింత బలోపేతం చేసింది. రీతాబ్రత్ తనను తాను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. మమతా బెనర్జీని ఇప్పటికీ అధినేత్రిగా గౌరవిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా నేరుగా ఆమెపై దాడి చేయకుండా, అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని లక్ష్యం చేసుకున్నారు. ఇది అసంతృప్త ఎమ్మెల్యేలను ఒకేచోట చేర్చడంలో కీలకం అయింది.
రీతాబ్రత్ వ్యూహం ఎలా సక్సెస్ అయింది?
ఎన్నికల ఓటమి తర్వాత ఉన్న సాధారణ అసంతృప్తిని సమర్థవంతంగా వాడుకోవడం. అనుభవం ఉన్న ‘‘అవుట్‌సైడర్’’ ఇమేజ్‌తో సీనియర్ నాయకులను ఆకర్షించడం, ఫోర్జరీ వివాదాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడం, జిల్లా స్థాయి అసంతృప్త నేతలతో ముందుగానే నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కలిసి ఒక కొత్త ఎమ్మెల్యేకు ఇంత పెద్ద సంఖ్యలో మద్దతు తెచ్చిపెట్టాయి.
ఏం జరగబోతోంది?
టీఎంసీలో చీలిక భవిష్యత్తుపై పెద్ద సందేహాలు రేకెత్తిస్తోంది. రీతాబ్రత్ వర్గం మమతాను ప్రధాన సలహాదారుగా కోరుతున్నప్పటికీ, పార్టీ సంస్థాగత నిర్మాణం, అధికార వ్యవస్థ, రాజకీయ వ్యూహాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో విపక్షం ఇంకా బలహీనపడితే బెంగాల్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.
