Revanth Reddy: తెలంగాణలో ఎఫ్ సీఐకి బియ్యం ఇచ్చే విషయంలో గోల్ మాల్ జరుగుతోందని టీపీసీసీ రేవంత్ రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ మేరకు పలు విషయాలు ప్రస్తావించారు. బియ్యం సరఫరాలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు కొల్లగొడుతూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు.
ప్రతి ఏటా ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, సరఫరా విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రైస్ మిల్లర్లతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం మేరకు కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతుంది. దీన్ని అడ్డుకోవాల్సిన కేంద్రం ఎందుకు చోద్యం చూస్తుందని వాపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆగడాలపై విచారణ చేపట్టి నిజానిజాలు నిగ్గు తేల్చాలని సూచిస్తున్నారు.
Also Read: Mohan Babu: ‘సిరివెన్నెల’ను చూడడానికి ఎవరిని వెళ్లొద్దన్నా.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
మార్చిలో ఎఫ్ సీఐ అధికారుల తనిఖీలో ప్రభుత్వ గుట్టు రట్టయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల విచారణలో ధాన్యం సరఫరాలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదు. సర్కారు చేస్తున్న తప్పిదాలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
అధికారుల తనిఖీలో బియ్యం లేకపోవడాన్ని గుర్తించినా చర్యలు తీసుకోవడం లేదు. దీని విలువ దాదాపు రూ. 45 కోట్ల మేర ఉంటుందని సమాచారం. అయినా కేంద్రం ఎందుకు విచారణ చేపట్టడం లేదు. నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిని జైలుకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 30 శాతం మేర అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది.
బియ్యం కుంభకోణం విషయంలో కేంద్రం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. ఇటీవల కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నవారి పట్ల ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారు. రైస్ మిల్లుల్లో జరిగే అన్యాయాలపై విచారణ వేగవంతం చేసి బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరుతున్నారు.