Paddy Issue AP, Telangana: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ ఓ కొత్త పంచాయితీ షురూ.. అయింది. ఇప్పటికే తెలంగాణ నుండి ఏపీ కి మద్యం తీసుకెళ్తున్నారని తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్న ధాన్యం లారీలకు చెక్ పెట్టడమే దీని ఉద్దేశం. ఏపీ ధాన్యం లారీలను సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారు. దీంతో ఏపీ నుంచి ధాన్యం తరలిస్తున్న వారు తెలంగాణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ రవాణా అడ్డుకున్నారంటూ ఆంధ్ర రైతులు పేర్కొంటున్నారు.
-బోర్డర్ లో చెక్ పోస్టులు
తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతి పెరుగడంతో ఈ యాసంగిలో భారీగా ధాన్యం పండించింది. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ఢిల్లీ వేదికగా మహాధర్నా తరువాత కూడా కేంద్రం స్పందించకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వమే వెనక్కు తగ్గింది. ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని ఆదేశించారు. అయితే తెలంగాణాలో యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2 వేల నుంచి రూ.3 వేల కోట్ల వరకు భారం పడుతుందని కెబినెట్ అంచనా వేసింది. మరోవైపు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణలోకి ధాన్యం వస్తోంది. దీంతో భారం పెరుగుతుందని భావించిన ప్రభుత్వం చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: Revanth Reddy: బియ్యం స్కాం: కిషన్ రెడ్డిని టీఆర్ఎస్ ను ఇరుకునపెట్టిన రేవంత్ రెడ్డి
-ఏపీ ధాన్యం లారీలను అడ్డుకుంటున్న అధికారులు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధాన్యం సమస్య ప్రభుత్వానికి తలనొప్పిగా ఉంటే ఏపీ నుంచి ధాన్యం రాష్ట్రానికి రావడాన్ని సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే ధాన్యాన్ని అడ్డుకుంటుంది. ఏపీ సరిహద్దులో తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకు వెళ్తున్న ధాన్యం లారీలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం లారీలను అనుమతించేది లేదని తెలంగాణ పోలీసులు తేల్చి చెబుతున్నారు.
-ధాన్యం లారీలు నిలిపివేత..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి∙తెలంగాణకు వస్తున్న ధాన్యం వాహనాలను సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు, రెవెన్యూ సిబ్బంది నిలిపివేశారు. వివరాలను నమోదు చేసి మరీ లారీలను వెనక్కి పంపిస్తున్నారు. మిల్లర్ల నుంచి తెలంగాణకు తరలిస్తున్న ధాన్యం వాహనాలను తనిఖీ చేస్తున్న అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తెలంగాణలోకి అనుమతించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఏపీ వాహనాలను కట్టడి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు.
-అన్నీ ఉన్నా ఆపుతున్నారని ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి∙వచ్చే ధాన్యాన్ని అనుమతించవద్దని తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్న ఆంధ్రా రైతులు లబోదిబోమంటున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ ధాన్యాన్ని ఆపటం ఏంటని వాహనదారులు, మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. చట్ట ప్రకారమే ఆంధ్రా నుంచి తెలంగాణకు ధాన్యాన్ని తీసుకొస్తున్నామని, అకారణంగా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వే బిల్లులు తోపాటు అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ సరైన కారణం చెప్పకుండా ధాన్యం లారీలను అడ్డుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
-పొరుగు ధాన్యం అనుమతించేది లేదంటూ..
అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని అనుమతించేది లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక లారీ డ్రైవర్లు వెనుదిరిగి వెళ్తున్నారు. ఆంధ్ర ధాన్యం తెలంగాణలోకి వస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీ నుంచి∙ధాన్యం కొనుగోలు చేస్తున్న వ్యాపారులకు అధికారుల తనిఖీలు షాక్ ఇస్తున్నాయి. ఒకవేళ కొనుగోలు చేసినా ఇబ్బందులు వస్తాయని వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు.