Ration Card KYC Deadline : జూన్ 30, 2025తో ఈ కేవైసీ ప్రక్రియ గడువు ముగుస్తుంది. ఈ తేదీలోపు మీరు ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ రేషన్ కార్డు పనిచేయదు. ఉచితంగా పొందే రేషన్ మీరు ఇకపై పొందలేరు. తక్కువ ఆర్థిక సామర్థ్యం ఉన్న కుటుంబాలకు ముఖ్యంగా ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. ప్రతినెలా వచ్చే రేషన్ ఆగిపోతే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా రేషన్ కార్డుకు సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి. దేశవ్యాప్తంగా నకిలీ రేషన్ కార్డుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టింది. దేశంలో ఉన్న చాలా మంది తమకు అర్హత లేకపోయినా కూడా తక్కువ ధరకు రేషన్ కార్డు ద్వారా రేషన్ పొందుతున్నారు. ఈ క్రమంలో అవసరమైన వాళ్లకు రేషన్ ఆలస్యంగా అందుతుంది. ఈ సమస్యలన్నిటికీ ప్రభుత్వం పరిష్కార మార్గంగా ఈ కేవైసీ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచిస్తుంది.
ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ను ఈ కేవైసీ అంటారు. ఈ కేవైసీ ప్రక్రియ ద్వారా మీ రేషన్ కార్డులో ఉన్న వివరాలు మీ పేరు, జన్మ తేది అన్నీ కూడా ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో సరిపోల్చబడతాయి. ఎవరు అర్హులో కాదో దీని ద్వారా తెలుస్తుంది. ఈ క్రమంలో నకిలీ రేషన్ కార్డులను కూడా తొలగించవచ్చు. ఒకవేళ మీరు ఇచ్చిన గడువు లోపల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ రేషన్ కార్డు రద్దు కూడా చేస్తారు. మీ రేషన్ కార్డు రద్దు అయితే మీకు భవిష్యత్తులో ఉచిత రేషన్ లేదా తక్కువ ధరకు ఉచిత బియ్యం వంటివి రావు.
ఒకసారి మీ రేషన్ కార్డు రద్దు అయితే మీరు మళ్ళీ దానిని సరి చేసుకోవడం చాలా కష్టం. ఈ క్రమంలో మీకు భవిష్యత్తులో కొన్ని నెలల వరకు రేషన్ రాకపోవచ్చు కూడా. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలంటే మీరు వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయాలి. మీరు మీ రాష్ట్రంలోనే కాదు మరొక రాష్ట్రంలో ఉన్నా కూడా రేషన్ కార్డు ద్వారా రేషన్ పొందవచ్చు. ఈ విధానాన్ని పోర్టబిలిటీ అంటారు. ఉదాహరణకు చెప్పాలంటే బీహార్ కు చెందిన మీరు ప్రస్తుతం హైదరాబాదులో పని చేస్తున్నట్లయితే అక్కడ కూడా మీరు మీ రేషన్ కార్డు ద్వారా రేషన్ షాపులో బియ్యం పొందవచ్చు. కానీ ఇలా పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసిన వారై ఉండాలి.