వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ లోక్ సభ స్పీకర్ ఓమ్ ప్రకాష్ బిర్లాకు ఫిర్యాదు చేసినా ఆయన మాత్రం తన తీరు ఏ మాత్రం మార్చుకోలేదు. ఇప్పుడు ఇంకా తీవ్రత పెంచినట్లుగా కనిపిస్తుంది. పింఛన్ల అంశంపై నేరుగా సీఎం జగన్ కు లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. తాజా లేఖలో సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని గడువు దాటినా నెరవేర్చక పోవడంపై ప్రశ్నించారు. ఎన్నికల ముందు పలు బహిరంగ సభల్లో పింఛన్ల విషయంలో సీఎం ఇచ్చిన హామీలను లేఖలో ప్రస్తావించారు.
పింఛన్ల లబ్ధిదారులకు ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతూ, నాలుగేళ్లలో నెలకు రూ. 3 వేలను అందజేస్తామని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయినా ఇంకా పింఛను మొత్తాన్ని నెలకు రూ.250 పెంచి రూ.2,500 చెల్లించక పోవడంపై విమర్శలు గుప్పించారు. వృద్ధాప్య పింఛను పొందేందుకు వయోపరిమితి 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని ప్రభుత్వం జీఓ 103ను 2019 మే 30వ తేదీన విడుదల చేసి 2019 జూలై నుంచి వయోపరిమితి తగ్గింపు అమలు చేస్తామని ప్రకటించారని, వాస్తవంగా ఫిబ్రవరి నుంచి మాత్రమే అమలు చేశారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రంలో అవ్వా తాతలు రూ.15,700 నష్టపోయారని తెలిపారు.
ఇంత కాలం మీడియాకు మాత్రమే వివారాలు వెల్లడించడం, మీడియా ముందు మాత్రమే విమర్శలకు దిగిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు సీఎంకు లేఖ రాసి మీడియాకు విడుదల చేయడం అంశాన్ని బట్టి చూస్తే పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం విమర్శలు వేగం మరింత పెంచినట్లు కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చట్ట పరంగా ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడుతున్న ఎంపీ రాజు తనపై అనర్హత వేటు పడే అవకాశం లేదని ధీమాతో ఉన్నారు.
మరోవైపు పార్టీని ఎన్నికల సంఘం ముందు చట్టపరంగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో మొత్తంగా ఎంపీ రాజు హైలెట్ అవుతూ వైసీపీ పార్టీని, జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో ఎంపీ లేఖకు సీఎం జగన్ స్పందించలేదు, ఇప్పుడు రాసిన లేఖకైనా స్పందిస్తారో.. లేదో వేచిచూడాల్సిందే.