Daggubati Purandeswari: పురందేశ్వరి అరణ్యరోధన.. నిర్మలమ్మ ఈసారైనా పట్టించుకోండి

కొద్ది నెలల కిందటే పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె పదవి స్వీకరించిన తర్వాత జగన్ సర్కార్ పై విరుచుకు పడడం ప్రారంభించారు. జూలైలో ఏకంగా ఢిల్లీ వెళ్లి ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న అప్పులపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు.

Written By: Dharma, Updated On : October 24, 2023 3:23 pm

Daggubati Purandeswari

Follow us on

Daggubati Purandeswari: ఏపీ సర్కార్ అవకతవకలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ఆమె బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన నాటి నుంచే జగన్ సర్కార్ అవినీతి పై ఫోకస్ పెట్టారు. కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. అయినా సరే సానుకూల ఫలితం రాలేదు. పురందేశ్వరి ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోలేదని.. ఏపీ బీజేపీని అగ్రనాయకత్వం లైట్ తీసుకుందని.. పురందేశ్వరి టీడీపీకి పనిచేస్తున్నారని జగన్ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీంతో పురందేశ్వరి మరోసారి జగన్ సర్కార్ పై కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విజయవాడలో పర్యటిస్తున్నారు. ఆమెను కలిసిన పురందేశ్వరి సమగ్ర వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. కేంద్రానికి తాను పలుమార్లు ఫిర్యాదు చేసినా.. జగన్ సర్కార్ తీరు మారలేదని.. చేస్తున్న అప్పుల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని.. మద్యంతో వేలకోట్ల రూపాయల ఆదాయాన్ని వైసీపీ నేతలే ఆర్జిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పైగా ఏపీ బీజేపీని మసకబార్చే విధంగా జగన్ సొంత మీడియాలో విమర్శనాత్మక కథనాలు ప్రచురిస్తున్నారని పురందేశ్వరి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

కొద్ది నెలల కిందటే పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె పదవి స్వీకరించిన తర్వాత జగన్ సర్కార్ పై విరుచుకు పడడం ప్రారంభించారు. జూలైలో ఏకంగా ఢిల్లీ వెళ్లి ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న అప్పులపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. ఆర్బిఐ తోపాటు కార్పొరేషన్ల ద్వారా దాదాపు పది లక్షల కోట్ల అప్పులు చేశారని అప్పట్లో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిపై కేంద్రం పార్లమెంట్లో ఒక ప్రకటన చేసింది. ఏపీ ప్రభుత్వం కేవలం 4.5 లక్షల కోట్ల మాత్రమే అప్పులు చేసినట్లు చెబుతోందని చెప్పుకొచ్చింది. దీంతో ఫిర్యాదు చేసిన పురందేశ్వరికి పరువు పోయినట్టయింది. జగన్ అనుకూల మీడియాలో ఏపీ బీజేపీకి, ముఖ్యంగా పురందేశ్వరికి వ్యతిరేకంగా కథనాలు వచ్చాయి.

మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు పురందేశ్వరి. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడుపుతోందని.. ఏడాదికి 25 వేల కోట్ల రూపాయలకు పైగా మద్యం ద్వారా వైసీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. అటు తరువాత నేరుగా మద్యం దుకాణాలకు వెళ్లి క్రయవిక్రయాలను పరిశీలించారు. ఏపీలో మద్యం పాలసీ పై సిబిఐ దర్యాప్తు చేస్తే ఎన్నో ఔకత్వకలు బయటపడతాయని చెప్పుకొచ్చారు. అయితే పురందేశ్వరి ఎన్ని రకాల ఆరోపణలు చేసినా, కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నా.. అటు నుంచి ఎటువంటి సానుకూలతలు రావడం లేదు. కేంద్రం దీనిపై విచారణలకు దిగడం లేదు. ఇప్పుడు మరోసారి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి రావడంతో పురందేశ్వరి మొరపెట్టుకున్నారు. మీరు పట్టించుకోకపోవడంతో ఏపీ బీజేపీ శాఖను జగన్ అనుకూల మీడియా మరింత పోలుచన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చర్యలకు ఉపక్రమించాలని విజ్ఞప్తి చేశారు. మరి కేంద్రం పట్టించుకుంటుందో? లేదో? లేకుంటే మాత్రం పురందేశ్వరిది అరణ్యరోధనగా మిగలనుంది. మరోసారి ఆమె జగన్ అనుకూల మీడియాకు టార్గెట్ అయ్యే అవకాశం ఉంది.