
పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో నీరంతా వృథాగా పోయింది. దీనికి ప్రాజెక్టు నిర్వహణ లోపమేనని నిపుణుల కమిటీ నివేదిక వెల్లడించింది. ప్రాజెక్టు నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో నాణ్యత లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని పేర్కొంది. సుమారు 44 టీఎంసీల నీటితో ఉండే ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో నీరు సముద్రం పాలు అయిందని తేల్చింది. జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణ రెడ్డి నేతృత్వంలో ప్రస్తుత, మాజీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు. నిపుణుల కమిటీ సమావేశమై అనేక విషయాలపై చర్చించారు.
16వ నంబర్ గేటులో టై ప్లాట్స్ పూర్తిగా తెగిపోయాయి. అక్కడ గేటును ఎత్తేందుకు దించేందుకు ఉపయోగించే తాళ్లు తెగిపోయాయని గుర్తించారు. వీటిలో వినియోగించే బోల్టులు విరిగిపోయాయి. వాటిలో ఉండే పుల్లీస్ పడిపోయాయి. గేటు దాదాపు 750 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. ప్రాజెక్టులో నిర్వహణ లోపాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించింది.
గేటు కొట్టుకుపోవడానికి ప్రధాన కారణం ఇదే కావచ్చని అభిప్రాయపడ్డారు. దాదాపు రెండేళ్లుగా గేట్ల నిర్వహణ, సాధారణ అంశాలను సరిగా పట్టించుకోలేదని నిపుణులు భావిస్తున్నారు. గ్రీజు వినియోగించలేదు. తలుపులు ఎలా పనిచేస్తున్నాయో తనిఖీ చేసుకోలేదు. నిధులు రాకపోవడం వల్ల నిర్వహణ పనులను సరిగా చేయలేదని ఇంజినీర్లు చెబుతున్నారు.
గేటులో యాంకర్ గడ్డర్ ట్ునియన్ గడ్డర్ ఉంటాయి. ట్రునియన్ గడ్డర్ దిగువ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ కట్టడానికి వినియోగించిన కాంక్రీటు గట్టిదనంపైన నిపుణుల కమిటీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అక్కడ ఎం.35 కాంక్రీటు వినియోగించాలి. ట్రునియన్ వైర్ ను నిలబెట్టే చోట వినియోగించిన కాంక్రీటు ప్రమాణాల మేరకు లేకపోవడంతో అక్కడ తగిన సామర్థ్యం లేకుండా పోయిందని అభిప్రాయపడుతున్నారు.
ఆగస్టు 5న తెల్లవారు జామున 3 గంటల సమయంలో గేటు ఎత్తినప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో గేటు ఎందుకు ఎత్తాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు 40 వేల క్యూసెక్కుల వరకు వరద నీటిని వదిలేశారు. మళ్లీ మరోసారి 58 వేల క్యూసెక్కుల వరద రావడంతో నిర్దిష్ట స్థాయి నిర్వహించేందుకు గేట్లు ఎత్తామని ఇంజినీర్లు చెబుతున్నా కమిటీ మాత్రం అనుమానం వ్యక్తం చేస్తోంది.