
Amul Controversy In Karnataka: కర్ణాటక ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా కర్ణాటకలో పాల ఉత్పత్తుల కార్యకలాపాలు సాగిస్తామని, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నంది కంపెనీతో తాము వ్యాపారం నిర్వహిస్తామని గుజరాత్ కేంద్రంగా నడిచే (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్) అమూల్ ఆ మధ్య ప్రకటించింది. దీంతో కర్ణాటకలో వివాదం చెలరేగింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నంది బ్రాండ్ పీక తోక్కేసేందుకే తెరపైకి అమూల్ ను తీసుకొస్తున్నారని కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కచ్చితంగా దీనిని అడ్డుకుంటామని ప్రకటించారు.
ఈ క్రమంలోనే కర్ణాటక రైతులు అమూల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉత్తర కర్ణాటక, కోస్తా కర్ణాటక ప్రాంతంలో ఆందోళనలు ఉదృతం కావడంతో అక్కడి అధికార భారతీయ జనతా పార్టీ మెట్టు దిగాల్సి వచ్చింది. అయితే అంతకుముందు అమూల్ కర్ణాటకలోకి వచ్చేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు సమ్మతం తెలిపారు. అంతకుముందు ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించిన నేపథ్యంలో.. కర్ణాటక రాష్ట్రంలో వివాదాలు చెలరేగాయి. అసలు కర్ణాటక రాష్ట్రానికి అమూల్ కంపెనీని తీసుకురావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. గుజరాత్ కంపెనీ తో కర్ణాటక కంపెనీ ఎలా పని చేస్తుందనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఇక ప్రస్తుతం ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదాన్ని కాంగ్రెస్ మరింత జటిలం చేసింది. రైతులతో కలిసి ఉద్యమాలు చేయడం ప్రారంభించింది. దీనికి తోడు సామాజిక మాధ్యమాల్లో కూడా అమూల్ కు వ్యతిరేకంగా యాష్ టాగ్ ఉద్యమం నడిచింది. “బ్యాన్ అమూల్” ట్విట్టర్ లో ట్రెండింగ్ టాపిక్ అయింది. దీంతో ఇది తమకు నష్టం చేకూర్చుతోందని భావించిన భారతీయ జనతా పార్టీ పెద్దలు మెట్టు దిగిరాలేక తప్పలేదు. ఈ క్రమంలో అమూల్ కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశించదని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆందోళనలు తగ్గుముఖం పట్టలేదు.. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం రైతులను తమ వైపు తిప్పుకునేందుకు ఈ ప్రకటన చేసిందని, మళ్లీ తర్వాత ఇదే తంతును కొనసాగిస్తుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే అలాంటిది ఏమీ ఉండదని బిజెపి నేతలు సమాధానం ఇస్తున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలోనే అమూల్ వివాదాన్ని రచ్చ రచ్చ చేశారని వాదనలు ఉన్నాయి.

వాస్తవానికి కర్ణాటక నంది బ్రాండ్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఒక కోపరేటివ్ సంస్థ. ఇది లక్షలాది మంది రైతుల వద్ద పాలను సేకరిస్తుంది. వారికి ప్రతి నెల డబ్బులు ఇస్తుంది. అయితే ఈ వ్యవహారంలోకి అమూల్ చొరపడితే లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పటికిప్పుడు కర్ణాటకలోకి అమూల్ ను తీసుకురావాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అయితే దీనికి బిజెపి వద్ద ఎటువంటి సమాధానం లేదు. ఈ క్రమంలో ఎన్నికల నష్టం జరుగుతుందని భావించి భారతీయ జనతా పార్టీ అమూల్ ఏర్పాటుపై ఒక అడుగు వెనక్కి వేసింది.. ఇది తమ నైతిక విజయంగా కాంగ్రెస్ చెప్పుకుంటున్నది.