
Karnataka Elections- BRS: ఢిల్లీలో చక్రాలు తిప్పుతాం. మోదీని గద్దె దించుతామని ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పార్టీ హోదా కూడా రద్దుచేసిన నేపథ్యంలో.. మంగళవారం ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన జెడిఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి తరపున తాను, ఇతర ప్రజాప్రతినిధులు ప్రచారం చేస్తారని ప్రకటించారు.
వాస్తవానికి కుమారస్వామికి కేసీఆర్ గతంలో 400 కోట్లు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అంతే కాదు కుమారస్వామి పలుమార్లు ప్రగతి భవన్ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. అయితే ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యాలయ ప్రారంభానికి మాత్రం కుమారస్వామి వెళ్లలేదు. అప్పట్లో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ మళ్ళీ కుమారస్వామి కెసిఆర్ ఫోల్డ్ లోకి వచ్చాడు. అయితే ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేంత సత్తా లేనందువల్ల భారత రాష్ట్ర సమితి అనివార్యంగా కుమారస్వామికి మద్దతు ప్రకటించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే భారత రాష్ట్ర సమితి నేతలు తెలుగు వాళ్ళు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వెళ్లి ప్రచారం చేస్తారని తెలుస్తోంది. బళ్ళారి, సౌత్ బెంగళూరు, హోస్ పేట, చామరాజ నగర, కూర్గ్ వంటి ప్రాంతాల్లో ప్రచారం సాగిస్తారని తెలుస్తోంది.. అయితే ఎన్నికలకు సంబంధించి కుమార స్వామికి కెసిఆర్ నగదు సహాయం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.

ఇక కర్ణాటక రాష్ట్రంలో 59 స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి అవుతానని కుమారస్వామి చెబుతున్నారు. మరి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కుమార స్వామి పార్టీ 97 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ 165 మంది పేర్లను ప్రకటించింది. బిజెపి ఇంకా జాబితా ప్రకటించలేదు. కర్ణాటకలో మే పదిన ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. అయితే మరోసారి అధికారంలోకి వస్తామని బిజెపి చెప్తుంటే.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తోంది. వీరిద్దరి మధ్య అధికార నాకే దక్కుతుందని కుమారస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కన్నడ ఓటర్లు ఎటువైపు మొగ్గుతారో..