
YCP Sarpanch: దేశానికి ప్రధాని అయినా కుగ్రామంలో పర్యటించినప్పుడు ప్రోటోకాల్ పాటించాల్సిందే. ఆ గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ ఉండాల్సిందే. రాజ్యాంగం కల్పించిన హక్కు అది. గ్రామపాలనే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ అంటారు. అటువంటి పల్లె పాలనను వైసీపీ సర్కారు పూర్తిగా నిర్వీర్యం చేసింది. స్థానిక సంస్థల హక్కులను కాలరాసింది. రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధుల నుంచి తప్పించి పల్లెకు ప్రతినిధి అంటూ లేకుండా చేసింది. రాజకీయ లెక్కలు వేసుకొని సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలను చేసింది. వారికి నిధులు, విధులు లేకుండా చేసింది. ప్రజలకు, గ్రామానికి సేవ చేద్దామని వ్యయప్రయాసలకోర్చి సర్పంచ్ అయినా వేలాది మంది ఆశలను ప్రభుత్వ నీరుగార్చింది. తాను నిధులు కేటాయించకపోగా.. కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సంఘం నిధులను సైతం పక్కదారి పట్టించింది. దీంతో అధికార వైసీపీకి చెందిన సర్పంచ్ లు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విలేఖర్ల సమావేశంలోనే ఓ సర్పంచ్ తన ఆవేదనను వెళ్లగక్కుతూ తన చెప్పుతో తానే కొట్టుకున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
స్థానిక సంస్థలు నిర్వీర్యం..
వాస్తవానికి పేరుకే స్థానిక సంస్థలు కానీ.. రాష్ట్రంలో వాటి హక్కును ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. ఒక్కో హక్కు, విధులను దూరం చేస్తూ వచ్చింది. అటు సంక్షేమ పథకాల అమలు, పర్యవేక్షణ, అభివ్రద్ధి పనులు, పన్నుల వసూలు బాధ్యతలను సచివాలయాలకు అప్పగించింది. పైగా 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించింది. దీంతో పంచాయతీ సర్పంచ్ లకు గ్రమాల్లో కనీస విలువ లేకుండా పోయింది. చిన్నపాటి పనికైనా ప్రజలు వలంటీర్లనే ఆశ్రయిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదు సరికదా.. ఉన్న జనరల్ ఫండ్స్ ను సైతం దారి మళ్లిస్తోంది. ఇప్పటికీ చాలా పంచాయతీల బ్యాంకు ఖాతాలు జీరో బ్యాలెన్స్ చూపుతున్నాయి.
పెరిగిన నిర్వహణ భారం..
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా పంచాయతీల నిర్వహణే కష్టంగా మారిన తరుణంలో సచివాలయాల నిర్వహణ బాధ్యతను సైతం ప్రభుత్వం పంచాయతీలకే అప్పగించింది. అది కేవలం నిర్వహణ వరకూ మాత్రమే. ఎటువంటి హక్కులు మాత్రం కల్పించలేదు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత సర్పంచ్ లకు ఉండే ఒక్కో అధికారాన్ని దూరం చేసింది. చివరకు స్వాతంత్ర దినోత్సవం నాడు పాఠశాల ప్రాంగణాల్లో జెండా ఎగురవేసే గౌరవాన్ని సైతం దూరం చేసింది. అభివృద్ధి పనులకు నిధులు లేవు.. జనరల్ ఫండ్స్ ను సర్పంచ్ లకు తెలియకుండానే దారి మళ్లిస్తోంది. వైసీపీ సర్కారు హయాంలో సర్పంచ్ లు ఎందుకయ్యాం అంటూ ఆవేదన వ్యక్తం చేసినవారే అధికం.

ఏకతాటిపైకి స్థానిక సంస్థల ప్రతినిధులు..
జగన్ సర్కారు పంచాయతీల నిధులను లాగేసుకోవడం, అభివృద్ధికి సహకరించనందుకు నిరసిస్తూ ప్రకాశం జిల్లా చినాంపల్లె సర్పంచ్ పగడాల రమేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ తరఫున ఎందుకు పోటీ చేశానా అని బాధపడుతున్నానని, ఆ పార్టీలో ఉండాలో, వెళ్లిపోవాలో అర్థం కావటం లేదని వాపోయారు. సోమవారం విజయవాడలో ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ తరఫున జరిగిన సమావేశంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో హాజరయ్యారు. తీవ్ర ఆవేదనతో మాట్లాడుతూ తన చెప్పతో తానే కొట్టుకున్నారు. పెండింగ్ బిల్లులు, పంచాయతీల అభివృద్ధి సమస్యతో ఏ సర్పంచ్ అయినా ఆత్మహత్య చేసుకుంటే దానికి సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లైనా తాము నిధులు తెచ్చుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి అవసరమైతే సర్పంచ్ లు రోడ్డెక్కుతారని హెచ్చరించారు.