Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముంగిట రాష్ట్ర ప్రజలకు అతి చేరువలో ఉండాలని డిసైడ్ అయ్యారు. పూర్తిస్థాయిలో ఏపీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి మంగళగిరిలో నివాసం ఉండాలని స్థిర నిర్ణయానికి వచ్చారు. హైదరాబాదు నుండి మకాన్ని మార్చుకున్నారు. ఎన్నికల ముంగిట జనసేన సైనికులకు ఇది శుభవార్తే.
ఇప్పటివరకు పవన్ హైదరాబాదు నుంచి తన రాజకీయ కార్యకలాపాలను నిర్వర్తించారు. అక్కడే ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే అన్ని రకాల కార్యకలాపాలు సాగేవి. అయితే ఇప్పుడు కార్యాలయాన్ని మంగళగిరి కి మార్చేశారు. అక్కడ ఉన్న సిబ్బంది, ఫైల్స్, కంప్యూటర్లు, ఇతర విభాగాలు కూడా మంగళగిరికి తరలించారు. ఇకపై షూటింగ్ ఉంటేనే హైదరాబాద్ కు పవన్ రానున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ సొంత ఇంటిని నిర్మించారు. నిర్మాతలు, దర్శకులు వచ్చి సినిమా చర్చలు జరిపే వీలుగా కొన్ని విభాగాలను ఏర్పాటు చేశారు. దీంతో పవన్ ఏపీ రాజకీయాలపై పూర్తి ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
కాగా పవన్ కళ్యాణ్ ఆదివారం సాయంత్రమే విజయవాడ చేరుకున్నారు. గత రెండు రోజులుగా పార్టీ సంస్థాగత వ్యవహారాలు, మూడో విడత వారాహి యాత్రపై పార్టీ నేతలతో చర్చించారు. ముఖ్యంగా యాత్ర పూర్తి చేసుకున్న ఉభయ గోదావరి జిల్లాల నేతలను పిలిచి చర్చించినట్లు తెలుస్తోంది. ఇకనుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ నిత్యం అందుబాటులో ఉంటారని సమాచారం. తాజా మార్పులతో జనసైనికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.