తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్రకు ఉన్న విశిష్టత ఏంటన్నది అందరికీ తెలిసిందే. ఉన్న ప్రభుత్వాలను కూల్చేసింది. కొత్త ప్రభుత్వాలకు పురుడుపోసింది. 2004లో నాటి కాంగ్రెస్ నేతగా రాజశేఖర రెడ్డి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘనమైన పాదయాత్ర చేశారు. దీంతో.. కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఇక, 2014 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు పాదయాత్ర చేశారు. ఆయన కూడా అధికారం చేపట్టారు. అనంతరం 2019 ఎన్నికల ముందు ఏపీలో జగన్ యాత్ర చేపట్టారు. సుదీర్ఘమైన ఈ పాదయాత్రతో జగన్ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. దీంతో.. పార్టీ గెలుపు ఖాయం చేసే ప్రధాన అస్త్రంగా పాదయాత్రను ఎంచుకుంటున్నారు నేతలు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే విషయమై జోరుగా చర్చ సాగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ను సాధారణంగా ఢీకొట్టడం అంత సామన్యమైన విషయం కాదు. ఏదైనా అద్భుతం జరగాలి. అది పాదయాత్రే అని అంటున్నాయి విపక్షాలు. దీంతో.. యాత్రకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 9న హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రారంభించి, అక్టోబరు 2న హుజూరాబాద్ లో నిర్వహించిన సభతో యాత్ర ముగించనున్నట్టు ప్రకటించారు. మొత్తం 55 రోజులపాటు 750 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుందని తెలిపారు.
ఇక, టీపీసీసీ అధినేతగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి సైతం పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే.. యాత్రకు సిద్ధమయ్యారు. అయితే.. సీనియర్లుగా ఉన్నవారు హైకమాండ్ కు కంప్లైంట్లు చేసి మొత్తానికి అడ్డుకున్నారు. ఇక, ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కు ఆయనే బాస్. కాబట్టి.. ఎదురు లేదు. దీంతో.. పాదయాత్ర చేపట్టి టీఆర్ఎస్ పై యుద్ధం మొదలు పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ నుంచి రేవంత్ బరిలోకి దిగనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని దాదాపు వంద నియోజకవర్గాలను చుట్టేయనున్నట్టు సమాచారం. మరోవైపు.. తెలంగాణలో పార్టీ ప్రకటించిన షర్మిల కూడా పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఈమె అక్టోబరు నుంచే భారీ యాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రాష్ట్రంలో 85 శాతం నియోజకవర్గాలు చుట్టేసేలా యాత్రను డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అటు ఏపీలోనూ జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాదయాత్ర గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు నుంచి 2023 ఏప్రిల్ వరకు రాష్ట్రంలో సుదీర్ఘ యాత్ర చేపట్టాలని పవన్ చూపుస్తున్నట్టు సమాచారం. అయితే.. పవర్ స్టార్ గా ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా జనాన్ని అదుపు చేయడం సాధ్యమవుతుందా? అనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదేకోవలో టీడీపీ యువనేత లోకేష్ కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు వయసు దృష్ట్యా లోకేష్ రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై దండయాత్రలకు సిద్ధమవుతున్నాయి విపక్షాలు. మరి, ఎవరు విజయకేతనం ఎగరేస్తారు? అన్నది చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Opposition leaders are trying to do padayatra in telugu states
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com