కొందరు తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు. ఇంకొందరు ఎక్కువ మాట్లాడతారు తక్కువ పని చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా తక్కువ మాట్లాడతారు. ఆయన రాజకీయ అనుభవం గురించి మనకు తెలిసిందే. కానీ ఎక్కడా ఎక్కువ సేపు మాట్లాడిన దాఖలాలు లేవు. అదే చంద్రబాబు అయితే జనం కనబడితే చాలు ఊగిపోతూ మాట్లాడతారనే తెలుసు. ఈ నేపథ్యంలో జగన్ ఎందుకు మాట్లాడరు అనే దానిపై పెద్ద చర్చ జరిగినా ఆయన స్పందించరు. అవసరమైతే తప్ప మాట్లాడరు.
సొంత మీడియా ఉండడంతో కూడా ఆయన సంయమనం పాటిస్తారనే విషయం చాలా మంది అనుకుంటారు. జగన్ సీఎం అయ్యాక కూడా మీడియాకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తాను అనుకున్నది చేసేయడమే ఆయన నైజం. అంతే కాని దానికి ప్రచారాలు అక్కరలేదని భావిస్తారు. ఆయన ఆలోచనలు అమలు చేయడానికి చాలా మంది ఉన్నారు. ఇటీవల ప్రతిపక్షాలు అయితే ఆయనకు విషయం లేకపోవడంతోనే మాట్లాడరని విమర్శలు చేసినా పట్టించుకోవడం లేదు.
ఆయన కూడా ఓ మీడియా అదినేత కావడంతో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరని తెలుస్తోంది. ప్రచారానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టే దూరంగా ఉంటున్నారని వైసీపీ నేతలు చెబుతన్నారు. జగన్ మీడియా ముందుకు రాకపోవడానికి ఆయనకు భయమే కారణమని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెబుతున్నారు. మీడియా అడిగే ప్రశ్నలకు జగన్ దగ్గర జవాబులు లేకే రారని పేర్కొంటున్నారు.
ఇదే నిజమైతే పొరుగు రాష్ర్టం ముఖ్యమంత్రులు సైతం మీడియాతో ఎక్కువ మాట్లాడరనే విషయం తెలుసుకోవాలి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి సైతం మీడియాతో మాట్లాడింది లేదు. దీంతో తక్కువ మాట్లాడినంత మాత్రాన పనిమంతులు కారనే అపవాదు ఆపాదించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీడియా పద్ధతులు కూడా మారిపోయాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి జై కొడుతూ పబ్బం గడుపుకునే వారున్నారు. దీంతో ఏది మాట్లాడినా దానికి వక్ర మార్గాలు అన్వేషించడం పరిపాటిగా మారింది.
దీంతో మీడియా ముందుకు రావడానికి కూడా జంకుతున్నారు. జగన్ ఏది చేసినా దాన్ని చెప్పేందుకు ఆయనకు పెద్ద యంత్రాంగమే ఉంది. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యమివ్వరనే విషయం అందరికి తెలుస్తోంది. అంతమాత్రాన జగన్ కు భయం ఉందని చెప్పడం అవివేకమే. తాను అనుకున్న పని చేసుకుపోవడమే తప్ప అందులో ప్రచారాన్ని ఆపాదించి ఆర్భాటాలు చేయడం అందరికి అలవాటు ఉండదనే విషయం టీడీపీ తెలుసుకుంటే మంచిదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.