Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు నిరంతర ముప్పుగా ఉన్నాయి. అయితే ఇటీవలి సంవత్సరాల్లో కశ్మీర్‌లో ఉగ్రవాదం గణనీయంగా అదుపులోకి వచ్చినప్పటికీ, అనంత్‌నాగ్‌లో తాజా కానిస్టేబుల్ హత్య వంటి సంఘటనలు ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదని గుర్తు చేస్తున్నాయి. నక్సలిజాన్ని ఆపరేషన్ కగార్ ద్వారా సమర్థవంతంగా అణచివేసిన అనుభవంతో, కేంద్రం ఇప్పుడు ఉగ్రవాదాన్ని 2029 నాటికి పూర్తిగా అంతం చేసే లక్ష్యంతో ప్రహార్ (Prahaar) అనే సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది.
ప్రహార్ అంటే ఏమిటి?
ఇది పోలీసు, గూఢచార, పరిపాలనా అధికారుల సమన్వయంతో తయారైన ఏడు స్తంభాల వ్యూహం. ఉగ్రవాద ఘటన జరిగిన తర్వాత కాకుండా, మూలాల వద్దనే నెట్‌వర్క్‌ను భగ్నం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. పాకిస్తాన్ నేరుగా కాకుండా కరాచీ ఆధారిత మాఫియా డాన్లు, చిన్న మాడ్యూళ్ల ద్వారా దాడులు చేయాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యూహం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రహార్ ఏడు స్తంభాలు
1. ప్రివెన్షన్ (Prevention)
ఉగ్రవాద దాడులు జరగకముందే నిఘా బలోపేతం చేసి, సంబంధాలు ఉన్నవారిని, బాంబు తయారీలో పాల్గొనేవారిని ముందస్తుగా అరెస్టు చేయడం. ఇప్పటికే దేశంలోని 11 రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలను గుర్తించి అరెస్టులు చేశారు. ఇది ‘‘ముందస్తు చర్య’’పై దష్టి సారించే కీలక అంశం.
2. ర్యాపిడ్ రెస్పాన్స్ (Rapid Response)
ఏదైనా ఘటన జరిగిన వెంటనే వేగంగా స్పందించడం. అనంత్‌నాగ్ సంఘటన తర్వాత వేల మంది ఓవర్‌గ్రౌండ్ నెట్‌వర్క్ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ చేయడం దీనికి ఉదాహరణ. సమయం కోల్పోకుండా దాడి కారకులను గుర్తించి అణచివేయడం.
3. ఏజెన్సీల యూనిటీ (Agency Unity)
వివిధ భద్రతా ఏజెన్సీలు విడివిడిగా కాకుండా సమన్వయంతో పనిచేయడం. వాటి సామర్థ్యాలను కలిపి ‘‘సినర్జీ’’ సృష్టించడం ద్వారా సమాచార మార్పిడి, కార్యాచరణ సమర్థత పెరుగుతుంది.
4. హ్యూమన్ రైట్స్ (Human Rights)
ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేటప్పుడు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక భావాలు లేదా ఉగ్రవాద అనుకూల వైఖరి పెరగకుండా ఉండాలంటే ఈ అంశం అత్యంత కీలకం.
5. అటెన్యూయేటింగ్ కండీషన్స్ (Attenuating Conditions)
ఉగ్రవాదానికి, మతోన్మాదానికి పునాది అయిన జిహాది వ్యవస్థలను, ఆలోచనలను నిర్మూలించడం. ఐసిస్ శాఖలు, ఖలిస్తానీ సోషల్ మీడియా ప్రచారం వంటివి ఇందులో భాగం.
6. అలైనింగ్ ఇంటర్నేషనల్ రెస్పాన్స్ (Aligning International Response)
అంతర్జాతీయ యాంటీ–టెర్రర్ సంస్థలు, వివిధ దేశాలతో సహకారం పెంచి భారత ఉగ్రవాద వ్యతిరేక పోరును ప్రపంచ స్థాయి ప్రయత్నాలతో అనుసంధానం చేయడం.
7. రికవరీ అండ్ రెసిలియన్స్ (Recovery and Resilience)
దాడి జరిగిన తర్వాత వెంటనే సాధారణ స్థితికి తిరిగి రావడం, సమాజం, భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం.
ఉగ్రవాద పరిధి విస్తరణ
ప్రహార్ కేవలం సంప్రదాయ దాడులకే పరిమితం కాదు. రసాయన, జీవ, రేడియోలాజికల్, అణు, డిజిటల్ ఉగ్రవాదం వంటి ఆరు రకాల ముప్పులను కూడా ఈ వ్యూహం పరిధిలోకి తీసుకొచ్చింది. ఇది ఆధునిక కాలపు సంక్లిష్ట ముప్పులను గుర్తించి సమగ్ర రక్షణ కల్పించే ప్రయత్నం.
అవకాశాలు, సవాళ్లు..
ఆపరేషన్ కగార్ విజయం నక్సలిజం విషయంలో నిరూపించినట్లు, స్పష్టమైన లక్ష్యం, సమన్వయం, నిరంతర పర్యవేక్షణ ఉంటే ఉగ్రవాద నిర్మూలన సాధ్యమే. ప్రహార్ ఈ దిశగా ముందడుగు. ముఖ్యంగా ముందస్తు నివారణ, ఏజెన్సీల సమన్వయం, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలు బలంగా ఉన్నాయి. అయితే సవాళ్లు కూడా తక్కువ కావు. సరిహద్దు ఆవలి నుంచి నిరంతరం మారుతున్న మాడ్యూళ్లు, డిజిటల్ ప్రచారం, స్థానిక నెట్‌వర్క్‌లు, మానవ హక్కులు–భద్రత సమతుల్యం ఇవన్నీ నిరంతర శ్రద్ధ అవసరం. ప్రజల విశ్వాసం కోల్పోకుండా చర్యలు తీసుకోవడం, సమాచార యంత్రాంగాన్ని మరింత ఆధునీకరించడం కీలకం.
ప్రహార్ వ్యూహం ఉగ్రవాదాన్ని కేవలం దాడుల స్థాయిలో కాకుండా దాని మూలాలు, పోషక వ్యవస్థలు, అంతర్జాతీయ కనెక్షన్లు వరకు విస్తృతంగా ఎదుర్కొనే ప్రయత్నం. 2029 లక్ష్యం సాధించాలంటే ఈ వ్యూహాన్ని నిరంతరం అమలు చేస్తూ, పరిస్థితులకు అనుగుణంగా మెరుగుపరచుకోవాలి. భారతదేశం ఉగ్రవాద ముక్తంగా మారాలనే లక్ష్యం కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు ప్రజలు, సమాజం కూడా భాగస్వాములుగా ఉండాల్సిన జాతీయ కర్తవ్యం.








