https://oktelugu.com/

నేడో.. రేపో ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు

బెంగళూరు డ్రగ్స్‌ కేసు తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలూ ఈ మత్తు గబ్బులో చిక్కుకున్నట్లు వెల్లడైంది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న బెంగళూరు పోలీసులు.. పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నారు. కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇక ఈ వ్యవహారంలో తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 5, 2021 / 01:47 PM IST
    Follow us on


    బెంగళూరు డ్రగ్స్‌ కేసు తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలూ ఈ మత్తు గబ్బులో చిక్కుకున్నట్లు వెల్లడైంది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న బెంగళూరు పోలీసులు.. పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నారు. కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా కీలక విషయాలు బయటకు వచ్చాయి.

    ఇక ఈ వ్యవహారంలో తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారం వెలుగులోకి రావడంతో.. వారందరికీ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. విచారణకు హాజరు కావాలంటూ నేడో రేపో బెంగళూరు పోలీసులు వారికి నోటీసులు ఇవ్వనున్నారు. వీరితోపాటు.. తెలంగాణకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలపైనా బెంగళూరు తూర్పు విభాగం పోలీసులు దృష్టిసారించారు. ఫిబ్రవరి నెలలో శాండల్‌వుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటుడి హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ జరిగిందని నిర్ధారించిన పోలీసులు.. అక్కడి సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు.

    పార్టీ జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకున్నా.. ఆ సమయంలో హోటల్‌ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న కెమెరాల్లో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలు, మరో ప్రజాప్రతినిధి, పలువురు ప్రముఖుల చిత్రాలు రికార్డయినట్లు సమాచారం. అయితే వారు డ్రగ్స్‌ తీసుకున్నారా? లేదా? అనేది నిర్ధారణ కావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే అరెస్టయిన నైజీరియన్ల వద్ద సీజ్‌ చేసిన ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ల విశ్లేషణల ద్వారా అనుమానిత ఎమ్మెల్యేలతో వారు టచ్‌లో ఉన్నారనేది రూఢీ అయినట్లు పేర్కొన్నారు.

    అయితే.. ఆ ప్రజాప్రతినిధులు ఎవరనే సమాచారాన్ని బెంగళూరు పోలీసులు తెలంగాణ కాప్స్‌కు అందజేసినట్లు తెలిసింది. ‘తెలంగాణ పోలీసులు కోరిన సమాచారాన్ని అందజేశాం. అనుమానితుల నేర చరిత్ర వివరాలు సేకరిస్తున్నాం’ అని బెంగళూరు సెంట్రల్‌ క్రైమ్‌ బ్యూరో నుంచి సమాచారం అందుతోంది. ఈ వివరాలతో నగరంలోని మూడు కమిషనరేట్ల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ పోలీసులు సీఎం కేసీఆర్‌కు త్వరలో నివేదిక అందజేస్తారని తెలిసింది. ఎమ్మెల్యేల పాత్రపై ఇప్పటికే ఇంటెలిజెన్స్‌ విభాగం నివేదికను అందజేసినట్లు సమాచారం. బెంగళూరు పోలీసులు పేర్లు వెల్లడించిన వ్యాపారవేత్తలు కలహర్‌రెడ్డి, రతన్‌రెడ్డి గురించి కూడా ఆరా తీస్తున్నారు.