కరోనా రికార్డు.. ఒక్కరోజులోనే లక్షకు పైగా కేసులు

ఓ వైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా.. పాజిటివ్‌ కేసుల సంఖ్యకు మాత్రం బ్రేక్ పడడం లేదు. రోజురోజుకూ కేసుల ఉధృతి కొనసాగుతోంది. అంతేకాదు.. పాత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ఇండియాలో తొలిసారిగా ఒక్కరోజులో అత్యధిక కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న దేశవ్యాప్తంగా 1,03,558 కొత్త కేసులు వచ్చాయి. ఇండియాలో 2020లో కరోనా వైరస్ వ్యాపించాక.. ఇంత ఎక్కువగా కరోనా కేసులు రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు అత్యధికంగా 2020 సెప్టెంబర్ 16న 97,894 కేసులు […]

Written By: Srinivas, Updated On : April 5, 2021 2:26 pm
Follow us on


ఓ వైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా.. పాజిటివ్‌ కేసుల సంఖ్యకు మాత్రం బ్రేక్ పడడం లేదు. రోజురోజుకూ కేసుల ఉధృతి కొనసాగుతోంది. అంతేకాదు.. పాత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ఇండియాలో తొలిసారిగా ఒక్కరోజులో అత్యధిక కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న దేశవ్యాప్తంగా 1,03,558 కొత్త కేసులు వచ్చాయి. ఇండియాలో 2020లో కరోనా వైరస్ వ్యాపించాక.. ఇంత ఎక్కువగా కరోనా కేసులు రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు అత్యధికంగా 2020 సెప్టెంబర్ 16న 97,894 కేసులు వచ్చాయి. కొత్త కేసులతో కలిపి ఇండియాలో ఇప్పటివరకూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య 1,25,89,067. అంటే కోటిన్నరకు పైగానే. కొత్త రికార్డ్ పుణ్యమా అని దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,41,830కి చేరింది. ఆదివారం కూడా ఇండియాలో కేసులు ఎక్కువగానే వచ్చాయి. కొత్త కేసులు 93,249 రాగా.. మరణాలు 513 వచ్చాయి.

ఇండియాలో గత 24 గంటల్లో 478 మంది కరోనా వల్ల మరణించారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 1,65,101కి చేరింది. ఇక కొత్తగా 52,847 మంది కరోనా నుంచి కోలుకోవడం వల్ల.. మొత్తం రికవరీల సంఖ్య 1,16,82,136కి చేరింది. ఇక దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర తన రికార్డులను తానే తిరగరాసుకుంటోంది. నిన్న ఆ రాష్ట్రంలో 57,074 కొత్త కేసులు వచ్చాయి. అక్కడ నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ అమలుచేయబోతున్నారు. మహారాష్ట్ర తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. అక్కడ కొత్తగా 5,250 నమోదయ్యాయి. కర్ణాటకలో 4,553 రాగా.. ఉత్తరప్రదేశ్‌లో 4,136 కొత్త కేసులు వచ్చాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో కరోనా అత్యంత తీవ్రంగా ఉంది.

నిన్న వచ్చిన లక్షకు పైగా కేసుల్లో 70 శాతం కేసులు ఈ నాలుగు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. తెలంగాణలో కొత్తగా 1097 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,13,237కి చేరింది. తాజాగా ఆరుగురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1723కి చేరింది. తెలంగాణలో మరణాల రేటు 0.55 శాతంగా ఉంది. కొత్తగా 268 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,02,768కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు 96.65 శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 8,746 యాక్టివ్ కేసులున్నాయి. వాటిలో 4,458 మంది హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 302 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో కొత్తగా 43,070 టెస్టులు చేశారు.

ఇక.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1730 మంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 9,04,781కి చేరింది. కొత్తగా ఇద్దరు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 7,239కి చేరింది. కొత్తగా 842 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 8,87,242కి చేరింది. ప్రస్తుతం 10,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 31,072 టెస్టులు చేశారు. కాగా.. దేశవ్యాప్తంగా మూడు దశల్లో అమలవుతున్న వ్యాక్సినేషన్‌లో భాగంగా నిన్నటివరకు 16,38,464 మందికి టీకా అందించారు. సుమారు మూడు నెలల్లో కేంద్రం 7,91,05,163 టీకా డోసులను పంపిణీ చేసింది