మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల విడుదల చేసిన ‘లాహే లాహే’ సాంగ్ కు కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.
ఈ సినిమాను సమ్మబర్ బరిలో నిలిపిన విషయం చేసింది. మే 14న స్లాట్ బుక్ చేసిన ఈ చిత్ర యూనిట్.. ఆ రోజున రంగంలోకి దింపేందుకు శరవేగంగా పనిచేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా ఫినిష్ చేస్తున్నారు. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతోందనే వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.
దీనికి ప్రధాన కారణం రెండు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులేనని తెలుస్తోంది. దేశంతోపాటు రెండు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అంతేకాదు.. విద్యార్థుల పరీక్షలు కూడా మరోకారణంగా కనిపిస్తోంది. తెలంగాణలో ఓసారి.. ఏపీలో ఇంకోసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్యను రిలీజ్ చేయడం సరికాదని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు.. కేసులు మరింతగా పెరిగితే.. సినిమా థియేటర్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీని అమలు చేసే విషయాన్ని కూడా ప్రభుత్వాలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్ల సినిమాను వాయిదా వేయడమే మేలని నిర్మాతలు భావిస్తున్నారట.
అయితే.. ఇది అధికారిక సమాచారం కాదు. ఒకవేళ ఇదే నిజమైతే.. మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది కూడా కీలకం. అందుతున్న సమాచారం ప్రకారం జూలై, ఆగస్టును కూడా వదిలేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత తీరిగ్గా దసరా బరిలో చిత్రాన్ని నిలపబోతున్నట్టు తెలుస్తోంది. మరి, ఇందులో నిజమెంత అనేది మేకర్స్ మాత్రమే ప్రకటించాల్సి ఉంది.