ఏపీలో రాజకీయ వేడెక్కుతోంది. అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అంటూ నిన్న జనసేనాని విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో తొడగొట్టారు. ‘తగ్గేదేలే’ అంటూ విరుచుకుపడ్డారు. 2024లో జనసేన అధికారంలోకి వస్తుందని.. వైసీపీ నాయకులపై ప్రతీకారం తప్పదని.. తాట తీసి కూర్చుండ బెడుతామని స్పష్టం చేశారు.

దీనికి వైసీపీ నేతలు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. ఏపీ మంత్రి పేర్ని నాని పవన్ పై విరుచుకుపడ్డారు. కౌంటర్ ఇచ్చారు. తేల్చుకుందామంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడా రాజకీయ వేడి తూర్పు గోదావరి జిల్లాకు షిఫ్ట్ అయ్యింది.
గోదావరి నదిపై కాటన్ బ్యారేజీ వద్ద జనసేనాని పవన్ కళ్యాణ్ అక్టోబర్ 2న చేపట్టిన శ్రమదానంకు ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలోని రోడ్ల దుస్థితిని తెలియజేసేందుకు పవన్ 2న శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద ఈ కార్యక్రమం నిర్వహణకు పోలీసులకు, ఎస్ఈకి జనసేన పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ప్రాజెక్ట్ ఇరిగేషన్ ఎస్ఈ అనుమతి నిరాకరించడం సంచలనమైంది.
కాటన్ బ్యారేజ్ రోడ్ ఆర్ అండ్ బీ పరిధిలోకి రాదని ఎస్ఈ స్పష్టం చేశారు. మానవతా దృక్ఫథంతో ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని ప్రకటించారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీ నష్టం జరుగుతుందని వివరించారు.
అయితే జనసేన మాత్రం రోడ్డు బాగు చేసే వరకు ఊరుకోమని.. కార్యక్రమాన్ని జరిపి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పవన్ శ్రమదానం జరిపి తీరుతామన్నారు. ఇందుకోసం ఇప్పటికే భారీగా జనసేన కార్యకర్తలు వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం వర్సెస్ పవన్ మధ్య పెద్ద యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు శ్రమదానం ఎవ్వరూ ఆపలేరని.. మంచి పని చేస్తున్నామని.. ఎందుకు అడ్డుకుంటారని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కడప జిల్లా బుద్వేల్ ఉప ఎన్నిక అభ్యర్థిపై సాయంత్రంలోగా ప్రకటన చేస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రెండు నెలలుగా బీజేపీ జనసేన అంతర్గత సమావేశంలో ఈ విషయంపై చర్చించామన్నారు. ఇరు పార్టీల అంగీకారంతోనే ఉమ్మడి అభ్యర్థిని నిలబెడుతామని తెలిపారు.