ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ మంత్రులు కూడా పవన్ కల్యాణ్ పై పరుషమైన పదజాలం ప్రయోగిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలకు సైతం వెనకాడడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు మాత్రం పెదవి విప్పడం లేదు. పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఒక్క మాట కూడా అనడం లేదు. దీంతో రెండు పార్టీలు కలిసి ఉన్నాయా? లేక విడిపోయాయా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. పొత్తు ఉండటంతో జనసేన పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న వైసీపీని కట్టడి చేయడంలో బీజేపీ మౌన పాత్ర వహిస్తోంది.
ఆన్ లైన్ టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. దీంతో నిర్మాతలు నష్టపోతారని పేర్కొన్నారు. కానీ దీనిపై వైసీపీ గోరంతలు కొండంతలు చేస్తూ పవన్ పై విమర్శల దాడికి దిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. సినిమా టికెట్ల విషయంలో బీజేపీ ఇంతవరకు తన వైఖరి స్పష్టం చేయలేదు. ఈక్రమంలో బీజేపీ వైసీపీ నిర్ణయానికే మద్దతు తెలుపుతుందని వాదనలు వినిపిస్తున్నాయి.
పవన్ వ్యాఖ్యలకు సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి రెచ్చిపోయారు. పవన్ కల్యాణ్ పై ఎదురుదాడికి దిగారు. సినీ పరిశ్రమలోని వ్యక్తులు కూడా పవన్ కు మద్దతు ఇవ్వడం లేదు. దీంతో రాజకీయంగా ఈ విషయంలో పెద్ద రగడ రేగింది. జనసేన, వైసీపీ నేతల మధ్య పెద్ద అగాధం నెలకొంది. ఇందులో ఒక్క రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాత్రమే ట్విటర్ వేదికగా పవన్ కు మద్దతు తెలిపారు. వైసీపీ చర్యలను ఖండించారు..
ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉన్నా అది ఎక్కడ కూడా కనిపించదు. ఏ కార్యక్రమం చేసినా రెండు పార్టీలు ఒంటరిగానే చేస్తున్నాయి. దీంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి. భాగస్వామ్య పార్టీలు అంటే ఒకరికొకరు పరస్పరం సహకారం అందించుకోవాల్సి ఉన్నా ఎక్కడ కూడా రెండు పార్టీల భాగస్వామ్యం కనిపించదు. పైకి మాత్రమే పొత్తు పొత్తు లోలోపల అంతా చిత్తు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
