రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు పవన్ రావడం, ఆన్ లైన్ సినిమా టికెట్ల పై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడం, దానికి వైసీపీ నేతలు పవన్ పై విరుచుకు పడటం.. మొత్తానికి గత మూడు రోజులుగా ప్రధాన వార్తల్లో ఇవే ప్రధానమైనవి. ఈ మొత్తం వ్యవహారంలో ఈ వివాదం దేనితో మొదలయ్యిందో అది మధ్యలో వెళ్ళిపోయింది. రిపబ్లిక్ సినిమాని, ఆ సినిమా ప్రమోషన్స్ ను మొత్తం మర్చిపోయారు. రాజకీయ వేడిలో సినిమా ఒకటి ఉంది అనేది కూడా మెగా అభిమానులకు గుర్తు లేకుండా పోయింది. మొత్తమ్మీద పవన్ వల్ల సాయి తేజ్ కి నష్టం జరిగింది.

మరి ఈ నేపథ్యంలో రిపబ్లిక్ కి అసలు ఓపెనింగ్స్ వస్తాయా ? రావా ? అని నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. మరోపక్క తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ లోనే రిపబ్లిక్ సినిమా ఎక్కువ థియేటర్స్ లో విడుదల అవ్వబోతుంది. అయితే, ఏపీలో టికెట్ల రేట్లు అనుకూలంగా లేవు. మరి ఏపీ లో ఏ స్థాయి కలెక్షన్స్ వస్తాయి అని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.
మరోపక్క తెలంగాణ లో మొత్తంగా 215 థియేటర్లలో రిపబ్లిక్ రిలీజ్ కాబోతుంది. అదే ఏపీలో 380 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఏపీ – తెలంగాణ కలిపి 600 థియేటర్లలో రిపబ్లిక్ విడుదల అవుతుంది. ఇక వరల్డ్ వైడ్ గా దాదాపు 740 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అంటే.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ స్థాయిలో మరో ఏ సినిమా రిలీజ్ కాలేదు.
ఇప్పుడు రిపబ్లిక్ కి బాక్సాఫీస్ దగ్గర వచ్చే ఓపెనింగ్స్ బట్టే.. మిగిలిన సినిమాల రిలీజ్ లు ఆధారపడి ఉంటాయి. రిపబ్లిక్ సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.8 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 13.6 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. కాబట్టి.. రిపబ్లిక్ సినిమా హిట్ అవ్వాలి అంటే.. కచ్చితంగా థియేటర్స్ నుంచి 14 కోట్ల కలెక్ట్ చేయాల్సి ఉంది.
ప్రస్తుతం పరిస్థితి చూస్తే… అన్ని కోట్లు వస్తాయా ? అని అనుమానం కలుగుతుంది. ఈ సినిమా అన్ని వర్గాలకు కనెక్ట్ కాదు. పైగా సినిమా పై ఎలాంటి అంచనాలు లేవు. మరోపక్క ప్రమోషన్స్ విషయంలో కూడా ఈ సినిమాకి ఏ హడావుడి కనిపించడం లేదు. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గానీ, ఈ సినిమా భవిష్యత్తు చెప్పలేం.