ఏపీలో అత్యధికంగా కర్నూల్ లో కరోనా వైరస్ వ్యాప్తికి స్థానిక అధికార పక్షానికి చెందిన ఎమ్యెల్యే కారణం అని, ఆయన వత్తిడుల కారణంగా అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకోలేక పోతున్నదని ఒక వంక విమర్శలు చెలరేగుతూ ఉండగా, తాజాగా వైసీపీకి చెందిన కర్నూల్ ఎంపీ ఇంట్లోనే ఆరుగురికి వైరస్ సోకున్నట్లు వెల్లడైనది.
ఇప్పటికే జిల్లాలో మొత్తం 279 కేసులు నమోదయ్యాయి. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి కరోనా సోకున్నట్లు ఆయనే స్వయంగా ఎంపీనే మీడియాకు వెల్లడించారు.
వైరస్ సోకిన వారిలో ఎంపీ ఇద్దరు సోదరులు, వారి సతీమణులు, వీరిలో ఒకరి కుమారుడు(14) ఉండగా, 83ఏళ్ల తండ్రికీ సోకినట్లు నిర్ధారణ అయింది. తండ్రి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఆరుగురిలో నలుగురు వైద్యులే కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
లాక్ డౌన్ ఉన్నప్పటికీ వైరస్ కట్టడి కాకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, తన కుటుంభ సభ్యులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రులలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.