Homeజాతీయ వార్తలుPM Modi : మూడోసారి మోదీనే.. ఆ కాన్ఫిడెన్స్‌ వెనుక కథేంటి?

PM Modi : మూడోసారి మోదీనే.. ఆ కాన్ఫిడెన్స్‌ వెనుక కథేంటి?

PM Modi : ‘వచ్చే ఏడాది భారత ప్రధానిగా తాను మూడోసారీ ప్రమాణం చేస్తా.. ఆ అయిదేళ్ల కాలంలో భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తా’ ప్రపంచంలోనే అతిపెద్దదైన, అత్యాధునిక వజ్రాల వ్యాపార కేంద్రం.. సూరత్‌ డైమండ్‌ బోర్స్‌(ఏసీబీ)ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలివీ. గుజరాత్‌లోని సూరత్‌ సమీపంలో ఆదివారం వజ్రాల వ్యాపార కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ మాట్లాడారు. ఎస్‌ఓబీ నవీన భారత శక్తి, సంకల్పానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. సూరత్‌లోని వజ్రాల పరిశ్రమ ప్రస్తుతం 8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని, కొత్త భవన సముదాయం కారణంగా మరో 1.5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.

సూరత్‌ వైభవంలో మరో వజ్రంగా..
ప్రపంచంలోనే అతిపెద్దదైన, అత్యాధునిక వజ్రాల వ్యాపార కేంద్రాన్ని సూరత్‌ వైభవంలోని మరో వజ్రంగా మోదీ అభివర్ణించారు. ‘సూరత్‌ వైభవంలో మరో వజ్రం చేరింది. ఇది చిన్నది కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. ప్రపంచంలోనే అతిపెద్ద భవంతులు సైతం ఈ వజ్రం మెరుపుల ముందు వెలవెలబోతాయి. ఈ వజ్రాల బోర్స్‌ గురించి ఎవరు మాట్లాడినా.. భారత్‌ను, సూరత్‌ను ప్రస్తావిస్తారు’ అని మోదీ చెప్పారు.

ఇప్పుడు ఐదు.. తర్వాత మూడు..
గత పదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాల భారత్‌ పదో స్థానం నుంచి ఐదుకు ఎగబాకిందని మోదీ తెలిపారు. ‘నేను మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టాక ఆ ఐదేళ్ల కాలంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుందని హామీ ఇస్తున్నాను’ అని పేర్కొన్నారు. దిల్లీ–ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు సూరత్‌ వాణిజ్యానికి సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడింటిని గెలిచింది. రెండింటిలో ఓటు బ్యాంకు పెంచుకుంది. ఉత్తర భారతదేశంపై కమలం పట్టు బిగించింది. ఈ నేపథ్యంలోనే మోదీ మూడోసారి తానే ప్రధాని అవుతానని ధీమాగా చెబుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు సర్వే సంస్థలు కూడా కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారం చేపడుతుందని వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ పూర్తి ఆత్మవిశ్వావసంతో మాట్లాడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వజ్రాల భవనం ప్రత్యేకతలివీ..
‘డైమండ్‌ రీసెర్చ్‌ అండ్‌ మర్కంటైల్‌ సిటీ’లో భాగంగా 35.54 ఎకరాల్లో సుమారు రూ.3,400 కోట్లతో నిర్మించిన ఎస్‌ఓబీలో మొత్తం తొమ్మిది భవనాలు ఉన్నాయి. వీటిని పూర్తి హరిత భవనాలుగా తీర్చిదిద్దారు. ఒక్కో భవనంలో 15 అంతస్తులు నిర్మించారు. మొత్తం 67 లక్షల చదరపు అడుగుల ఫ్లోర్‌ ఏరియాతో కూడిన ఈ భవనాల్లో 300 చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం మధ్య సుమారు 4,500 కార్యాలయాలు ఉన్నాయి. సుమారు 65 వేల మంది వ్యాపారాలు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. శుద్ధి చేసిన, ముడి వజ్రాల వ్యాపారానికి ఏసీబీ అంతర్జాతీయ కేంద్రంగా మారనుంది. అలాగే ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కస్టమ్స్‌ క్లియరెన్స్‌ హౌస్‌ కూడా ఇందులోనే ఉంటుంది. ఆభరణాల రిటైల్‌ వ్యాపారులు తమ విక్రయ కేంద్రాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అంతర్జాతీయ బ్యాంకింగ్, సురక్షిత లాకర్ల సదుపాయం కూడా ఉంటుంది. నాలుగు వేల సీసీ కెమెరాలతో పాటు స్మార్ట్‌ గేట్లతో భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఏసీబీతో సూరత్‌ వజ్రాల వ్యాపారం మరింతగా విస్తరించనుంది. మరోవైపు, ప్రపంచంలో ఇప్పటి వరకు అతి పెద్ద కార్యాలయ సముదాయంగా అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌ ఉంది. ఆ స్థానాన్ని ఎస్‌ఓబీ ఆక్రమించింది.

అభివృద్ధి పనులు…
ఇక మోదీ సర్కార్‌ పూర్తిగా ఇప్పుడు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంపై దృష్టిపెట్టింది. ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి ఎన్నికల నాటికి ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. త్వరలో మరికొన్ని వందేభారత్‌ రైళ్లు, రోడ్డు మార్గాలు, జాతీయ ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల నాటికి పూర్తిచేసిన ప్రాజెక్టున్నీ ప్రారంభించేలా కేంద్రం అడుగులు వేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ ప్రస్తుతం పుంజుకునే దశ లేదు. ఇండియా కూటమిలో ఇప్పటికీ సక్యత కనిపించడం లేదు. దీంతో కమలం పార్టీలో విజయంపై ఆత్మవిశ్వాసం పెరుగోతంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular