
Cheater Arrested : ఏ కంప్యూటర్ వెనుక ఏ కంపుగాడున్నాడో చెప్పడం అసాధ్యం. మొత్తం బయట పడిన తర్వాత గానీ.. జరిగిన నష్టమేంటో అర్థం కాదు. ఇది కూడా అలాంటి సంఘటనే. ఈ కేటుగాడు ఒకరిద్దరిని కాదు.. ఏకంగా 30 మంది అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడాడు. కానీ.. రోజులు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు కదా.. చివరకు టైమ్ వచ్చింది. పోలీసులు లాక్ చేస్తే.. వెళ్లి ఊసలు లెక్కపెడుతున్నాడు. ఇంతకీ ఎవరితను? చేసిన మోసమేంటి? అన్నది తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇవాళ రేపు పెళ్లికి మంచి అబ్బాయి.. మంచి అమ్మాయి దొరకడం గగనమైపోయింది. ఒకరికి అందం సమస్య, మరికొరికి ఉద్యోగం సమస్య.. ఈ రెండు బాగున్నాయంటే.. వాళ్ల బుద్ధితో సమస్య. ఇలాంటి సమస్యల నుంచి మంచి భాగస్వామని సెలక్ట్ చేసుకోవడమన్నది అతిపెద్ద సమస్యగా తయారైంది. అందుకే.. మ్యారేజ్ బ్యూరోలనో, మ్యాట్రిమోని సైట్లనో ఆశ్రయిస్తుంటారు ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇలాంటి వారి అవసరాలను ఆసరా చేసుకున్నాడో మోసగాడు. మ్యాట్రిమోని సైట్లలో తన పేరు రిజిస్టర్ చేసుకొని మంచి స్టైలిష్ ఫొటోలు, అద్భుతమైన ప్రొఫైల్ ను అప్ లోడ్ చేశాడు. ఇతగాడు అంతకు మించిన మాటకారి కూడా. ఇంకేముందీ.. తనదైన టాలెంట్ చూపిస్తూ.. ఒకటీ, రెండు, మూడు అంటూ అమ్మాయిలను పటాయించడం మొదలు పెట్టాడు.
ఏపీలోని చిత్తూరు సమీపంలోని ఎన్.ఆర్ పేటకు చెందిన ఓ యువతిని ఇలాగే పరిచయం చేసుకున్నాడు. మ్యాట్రిమోని సైట్లో ఆమె నంబర్ తీసుకొని కాల్ కలిపాడు. ఆమె ఇతని ప్రొఫైల్ చూసింది. సూపర్బ్ గా ఉంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి, ఏడాదికి 20 లక్షల జీవితం. అతని ఫొటో అంతకన్నా హ్యాండ్సమ్ గా ఉంది. దీంతో.. సదరు యువతి టెంప్ట్ అయ్యింది. తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి తన తల్లికి బాగోలేదని ఏడుస్తూ ఫోన్ చేశాడు. అర్జెంటుగా 1.40 లక్షలు కావాలని అడిగాడు. ఆ మాటలు నమ్మిన యువతి.. ఆ డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసింది. ఖతం.. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విఛ్ ఆఫ్.
ఆ తర్వాత మరో అమ్మాయితో ఇదే వ్యవహారం! ఇలా.. ఒకరిద్దరు కాదు 30 మందిని మోసగించాడు. ఇతని బాధితు ఏపీలోనే కాదు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా ఉన్నారు. ఒంగోలుకు చెందిన ఓ ఐటీ ఎంప్లాయ్ అమ్మాయి నుంచి 28 లక్షలు కాజేశాడు. నరసారావుపేట యువతి నుంచి అయితే.. ఏకంగా 40 లక్షలకు పైన లాగేశాడు. ఈ విధంగా.. అందరు అమ్మాయిల నుంచి 3 కోట్లకు పైగా దండుకున్నాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇతగాడి ఆచూకీ దొరకలేదు. సిమ్ కార్డులు మారుస్తూ మోసం కొనసాగించాడు.
అయితే.. తాజాగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇతగాడిని పోలీసులు పట్టుకున్నారు. అరెస్టు చేసి, ఆరాతీస్తే.. చీటర్ దందా మొత్తం గడ్డా గడ్డా కారిపోయింది. అతను ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలానికి చెందిన శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు.