Mynampally Hanumanth Rao: మొన్న హరీష్.. నేడు రేవంత్ రెడ్డిని తొక్కేస్తాడట.. మైనంపల్లి మాటలకు అంతూ పొంతేలేదా?

మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావు మీద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనకు భారత రాష్ట్ర సమితి టికెట్ అనుమానమేనని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మైనంపల్లిని బయటకి పంపించాలనే ఉద్దేశం లోనే ఉన్నట్టు తెలుస్తోంది.

Written By: Bhaskar, Updated On : August 26, 2023 10:58 am

Mynampally Hanumanth Rao

Follow us on

Mynampally Hanumanth Rao: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన కామెంట్స్ మీడియాలో వైరల్ గా మారాయి. మొన్నటికి మొన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మీద ఆయన తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ నుంచి మొదలు పెడితే కవిత వరకు హనుమంతరావు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం హనుమంతరావును తెగ ట్రోల్ చేస్తోంది. భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులు కూడా హనుమంతరావు విమర్శిస్తున్నారు. ఇక అధికార పార్టీ భజన ఛానల్ టీ న్యూస్ అయితే హనుమంతరావు మీద వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తోంది. ఈ క్రమంలో హనుమంతరావుకు మల్కాజిగిరి సీటు కష్టమే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఎవరికీ భయపడను

ఇక హనుమంతరావు గతంలో చేసిన వ్యాఖ్యల తాలూకు ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.”నేను టిడిపిలో ఉన్నప్పుడు సమైక్యాంధ్రకు సపోర్ట్ చేశాను. అప్పుడు రేవంత్ రెడ్డి, మిగతా వారి వ్యవహారాలు మొత్తం నాకు తెలుసు. నేను తలచుకుంటే ఎవరినైనా ఏమైనా చేయగలను. కెసిఆర్, కేటీఆర్ అంటే భయం లేదు. రేవంత్ రెడ్డి ని తొక్కిపడేస్తా. నాకు ప్రధానమంత్రి అంటే కూడా లెక్కలేదు” అని మైనంపల్లి మాట్లాడిన మాటల తాలూకు ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వతహాగానే వివాదాస్పద రాజకీయ నాయకుడిగా పేరు గడించిన హనుమంతరావు ప్రతిపక్ష నాయకుడిని ఆ తీరుగా విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందులోనూ ఇష్టానుసారంగా బూతులు వాడటం కలకలం రేపుతోంది. ఎవరినీ లెక్క చేయను అని వ్యాఖ్యానించడం ఆయన వ్యవహార శైలికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. “రాజకీయాలు వ్యక్తిగత అంశాలు కాదు. వ్యక్తిగతంగా తీసుకుంటే అవి వైషమ్యాలు పెరిగేందుకు కారణమవుతాయి. ఇలాంటివి రాజకీయాల్లో ఉండకూడదు అని” రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొచ్చారా?

మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావు మీద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనకు భారత రాష్ట్ర సమితి టికెట్ అనుమానమేనని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మైనంపల్లిని బయటకి పంపించాలనే ఉద్దేశం లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మైనంపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి సీటును తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయికిరణ్ కు లేదా చామకూర మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కి కేటాయించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన గతంలో రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు తాలూకు ఆడియో విడుదల కావడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. దీనిపై ఇంతవరకు మైనంపల్లి ఎటువంటి ప్రకటన చేయలేదు. కాకపోతే ఈ ఆడియోను భారత రాష్ట్ర సమితి నాయకులు తమ సామాజిక మాధ్యమాల్లో ఖాతాల్లో పోస్ట్ చేస్తుండడం విశేషం.