Iconic On Screen Couples: కాజోల్, షారుఖ్ ఖాన్ హిందీ ఇండస్ట్రీలో ఎంతో పేరుగాంచిన ఆన్-స్క్రీన్ జంటగా గత మూడు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు. కానీ అంతటి పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు ఒకరి సరసన ఒకరు కనిపించింది కేవలం ఆరు సినిమాలలో మాత్రమే. అలాంటి వీళ్లిద్దరినీ సూపర్ హిట్ పైర్ అంటే ఇక 20 ఏళ్లలోపు కలిసి 130 చిత్రాలను చేసిన జంటని ఏమనాలి? మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే వాటిలో దాదాపు సగం హిట్ అయ్యాయి.
ఇంతకీ వీళ్లు ఎవరూ అంటే 1962 – 1981 మధ్యకాలంలో దాదాపు 130 చిత్రాలలో కలిసి నటించిన సూపర్‌హిట్ మలయాళ నటులు ప్రేమ్ నజీర్, షీలా ప్రధాన. వీరిద్దరూ జంటగా కలిసి అత్యధిక చిత్రాలలో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు.
ఈ ఇద్దరు నటీనటులు మలయాళ సినిమాల్లో అత్యంత విజయవంతమైన స్క్రీన్ పెయిర్‌గా నిలిచారు. వారి సమయంలో అనేక హిట్ చిత్రాలను అందించారు.
వారివి 50కి పైగా సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అంటే వారు ప్రతి సంవత్సరం కనీసం రెండు హిట్‌లను ఇండస్ట్రీకి అందించారు. షీలా 1983లో పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడిన తర్వాత సినిమాలకు విరామం ఇవ్వడంతో వారి జోడి సినిమాల్లో కనిపివ్వడం ఆగిపోయింది. ప్రేమ్ నజీర్ 1989లో 62 ఏళ్ల వయసులో మరణించారు.
ప్రేమ్ నజీర్ మలయాళ సినిమాల్లో మొదటి సూపర్ స్టార్‌గా ఎదిగిన హీరో. అక్కడి ప్రేక్షకులు ఆయన్ని నిత్యహరిత నాయకన్ (ఎవర్‌గ్రీన్ హీరో) అని పిలుచుకునేవారు. 1952లో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన తర్వాత, ఎన్నో హిట్ సినిమాలను అందించి మలయాళ సినిమా ప్రముఖ వ్యక్తిగా స్థిరపడ్డాడు. సినిమా చరిత్రలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటుల్లో ప్రేమ్ నజీర్ ఒకరు. అప్పట్లో అతను 700 కంటే ఎక్కువ చిత్రాలలో నటించిన హీరోగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నాడు. అతనుకు మరో రెండు రికార్డులు కూడా ఉన్నాయి. అవి ఏమిటి అంటే- ఒక సంవత్సరంలో అత్యధిక చిత్రాల విడుదల (30) చేసిన హీరో, ఇక కెరీర్‌లో అత్యధిక మంది కథానాయికల సరసన నటించిన హీరో(80).
ఇక షీలా 1962లో సినిమాల్లోకి అడుగుపెట్టింది. అదే సంవత్సరం ప్రేమ్ నజీర్ సరసన నటించింది. వీరిద్దరి కెరియర్ లో వెలుత కత్రినా, కుట్టి కుప్పాయం, స్థానార్థి సారమ్మ, కడతనట్టు మక్కం, కన్నప్పనున్ని వంటి అతిపెద్ద హిట్‌లు ఎన్నో ఉన్నాయి.