Jabardasth Shanti Swaroop: జబర్దస్త్ ఎందరో సామాన్యులను స్టార్స్ చేసింది. 2013లో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ కామెడీ షో ట్రెమండస్ సక్సెస్ అయ్యింది. బుల్లితెర చరిత్రలో జబర్దస్త్ కొత్త అధ్యాయం లిఖించింది. జబర్దస్త్ టీఆర్పీ దెబ్బకు చాలా షోలు కుదేలయ్యాయి. అనసూయ, రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ఇంకా చాలా మంది అక్కడ స్టార్స్ గా ఎదిగారు. ప్రస్తుతం కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు.
అయితే ఈ జబర్దస్త్ కమెడియన్స్ లో తక్కువ పేమెంట్ తీసుకుని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏళ్ల తరబడి ఆ షోలో ఉన్నా కూడా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. అలాంటి వాళ్లలో శాంతి స్వరూప్ ఒకడు. లేడీ గెటప్స్ వేసే శాంతి స్వరూప్ జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో ఒకడు. ముఖ్యంగా హైపర్ ఆది టీమ్ లో చేసేవాడు. రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ మీద హైపర్ ఆది జోక్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.
జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇంకా స్పెషల్ షోస్ లో ఏళ్ళుగా కామెడీ చేస్తున్నాడు శాంతి స్వరూప్. అయితే మనోడి సంపాదన అంతంత మాత్రమే. ఇప్పుడు ఆర్థిక కష్టాలలో ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. తనకంటూ ఉన్న ఒక్కగానొక్క ఇంటిని అమ్మేస్తున్నట్లు శాంతి స్వరూప్ తెలియజేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
శాంతి స్వరూప్ తల్లి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఇటీవల ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారట. ఆపరేషన్ కి అవసరమైన డబ్బులు తన వద్ద లేవట. అందుకే ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో తల్లికి వైద్యం చేయించబోతున్నట్లు శాంతి స్వరూప్ చెప్పాడు. శాంతి స్వరూప్ దీన స్థితికి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లు పరిశ్రమలో ఉండి కష్టపడిన శాంతి స్వరూప్ కి ఈ పరిస్థితి ఏంటని పలువురు వాపోతున్నారు.